ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్.. విచారణకు ఆదేశం
ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని వ్యాఖ్య
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : లగచర్ల రైతు హీర్యా నాయక్ ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి దవాఖానకు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధి కారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని ఆయన పేర్కొన్నారు. అధికారులపై దాడులకు పాల్పడ్డరాన్న ఆరోపణలతో లగచర్లకు చెందిన రైతు హీర్యానాయక్ తో పాటు మరో 20 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే..అయితే హీర్యా నాయక్‌కు గురువారం గుండె సమస్య రావడంతో అతడికి సంకెళ్ళ తోనే జైలు సిబ్బంది సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి 2డీ ఈకో పరీక్షలు చేయించారు.
కాగా ఛాతీనొప్పి రావడంతో రైతు ఈర్యానాయక్‌కు మొదట సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందించారు. హీర్యానాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం పంజాగుట్ట నిమ్స్‌కు తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో రైతుకు చికిత్స అందిస్తున్నారు. హీర్యా నాయక్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.. అయితే అండర్ ట్రయల్ ఖైదీలకు సంకెళ్లు వేసి తీసుకురావడం సరికాదని గతంలో కోర్టులు తీర్పు చెప్పినా కూడా జైలు సిబ్బంది సంకెళ్లుతో తీసుకురావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చాంశానీయంగా మారింది.