– మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి?
– కేసీఆర్ హయాంలో యూరియాకు కొరత లేదు
– రేవంత్ పాలనలో యాప్ పేరుతో రైతుల పాట్లు
– మూడు పంటలకు రేవంత్ రైతుబంధు ఎగ్గొట్టాడు
– కొడంగల్‌లో అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ ప్రభుత్వమే
– మరి నువ్వు సిద్దిపేటకు చేసిందేంటి?
– రేవంత్ పై బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు హరీష్ ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌కు పోయి నన్ను తిడుతూ.. కొడంగల్‌కు కేసీఆర్ ఏం చేశాడు, హరీశ్ రావు ఏం చేశాడు అని అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డీ.. కళ్లు తెరిచి చూడు! కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొడంగల్‌లో రెండు 50 పడకల ఆసుపత్రులు కట్టించాం, ఫైర్ స్టేషన్ లేకపోతే కొత్తగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేశాం, ప్రతి తండాకు అద్భుతమైన బీటీ రోడ్లు వేశాం, రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చాం, మిషన్ కాకతీయ కింద కొడంగల్ చెరువులన్నీ బాగుచేశాం, మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రతి మండలానికి గోదాములు కట్టించామని కొడంగల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీశ్ రావు సమాధానమిచ్చారు. సిద్దిపేటలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మూడేళ్లలో నువ్వు సిద్దిపేటకు ఏం చేశావని ప్రశ్నించారు. ఒక్క ఇటుక పెట్టకపోగా, సిద్దిపేటలో మన పిల్లలు చదువుకునేందుకు మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు ఎత్తుకుపోయావు! సిద్దిపేటలో వెయ్యి పడకల ఆసుపత్రి పనులను, నర్సింగ్ కాలేజీ పనులను మధ్యలోనే ఆపించావు.రంగనాయక సాగర్ కాలువలను మా ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పూర్తి చేశాం. నరసింహ గుంట నింపే కాలువ లాంటివి అక్కడక్కడా కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉండేవి.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ఆ మిగిలిన కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు, ఏ ఊరిలోనూ గజం తారు రోడ్డు వేసిన పాపాన పోలేదని విమర్శించారు.
‘ఈ మూడేళ్లలో నేను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు, చంకలు కాలిపోయేలా కష్టపడ్డా, బక్కచిక్కిపోయా, నా అంత కష్టపడేవాడు ఎవడూ లేడు’ అని కొడంగల్ సభలో సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు.అయ్యా రేవంత్ రెడ్డీ.. నువ్వు పడ్డ కష్టం ప్రజలకు సేవ చేయడానికా లేక కమిషన్లు, పైసలు కొట్టడానికా? అని ప్రశ్నించారు. నువ్వు నిజంగానే ఒక్కరోజు సెలవు తీసుకోకుండా అంతగా కష్టపడితే.. కేసీఆర్ ఉన్నప్పుడు బాయిలకాడ 24 గంటలు వచ్చిన కరెంటు, ఇప్పుడు 7-8 గంటలకే ఎందుకు పడిపోయిందో చెప్పాలన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతుల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నాయి?కేసీఆర్ ఉన్నప్పుడు రైతుకు నాలుగు యూరియా బస్తాలు కావాలంటే.. ఆటో డ్రైవర్‌కు చెప్తే సొసైటీకి పోయి నేరుగా బాయికాడికి తెచ్చి వేసేవాడు.
మరి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో యూరియా బస్తాల కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టాల్సిన దుస్థితి వచ్చింది..ఫోన్ పట్టుకుని యాప్‌లో యూరియా బుకింగ్ కోసం గంటల తరబడి ఒత్తుకుంటూ కూర్చోవాలి.. అది దొరికితే లాటరీ తగిలినట్టు, లేకపోతే లేదు ఇదేనా నువ్వు పడ్డ 24 గంటల కష్టం అంటూ ఎద్దేవా చేశారు. నాడు కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచమంతా ఆగిపోయిన కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతుబంధు ఆపకుండా వేశారు. మరి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడ్డానని చెప్పుకునే రేవంత్ రెడ్డి..రైతులకు ఇంకో రూపాయి ఎక్కువ ఇవ్వాలి గానీ, మూడు పంటలకు రైతుబంధు ఎందుకు ఎగ్గొట్టాడు? ఒకసారి ఎకరానికే వేసిండు, ఇంకోసారి రెండెకరాలకే వేసిండు, మరోసారి మొత్తానికే ఎగ్గొట్టిండని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డ కాన్పుకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. పైసా ఖర్చు లేకుండా కానుపు చేసి, కేసీఆర్ కిట్ ఇచ్చి, లోపల బాలింతకు, బయట సహాయకులకు కడుపునిండా అన్నం పెట్టి ఆదుకున్నాం.కానీ రేవంత్ రెడ్డి వచ్చాక కేసీఆర్ కిట్ బంద్ పెట్టి, ప్రభుత్వ ఆసుపత్రులను ఆగం చేశాడు. మాటలు చెప్పడం కాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





