10 నుండి 18 వరకు బతుకమ్మ వేడుకలు

– ఏర్పాట్లపై సీఎస్ సంజయ జాజు సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకత ఉన్న బతుకమ్మ పూల పండగను ఈనెల 10 నుండి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. 18వ తేదీన సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ట్యాంక్ బండ్‌పై వేలాదిమంది మహిళలచే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని అత్యంత వైభంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగాగల అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాదిమంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్ బండ్‌పైకి చేరుకుంటారని, వీరితోపాటు వందలాదిమంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పండగ శోభ వచ్చేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాక పలు జంక్షన్ల కేంద్రాల వద్ద విద్యుద్దీపాలతో అలంకరించాలని, నగరంలోని అన్ని ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుద్దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడేందుకు సమీపంలోని వాడలు, కాలనీలు, బస్తీల నుండి పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశమున్నందున వారికి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ట్యాంక్ బండ్ చిల్డ్రన్స్ పార్క్‌లో ఉన్న బతుకమ్మ ఘాట్ తోపాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచఎండీఏ, జీహెచఎంసీ అధికారులను సీఎస్ ఆదేశించారు. సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల మధ్య ట్యాంకు బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నందున ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్, కనీస సౌకర్యాల ఏర్పాట్లను చేపట్టాలని తెలిపారు. బతుకమ్మ జరిగే పది రోజులపాటు రవీంద్ర భారతిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నందున అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని టూరిజం కేంద్రాలు, ప్రముఖ ప్రాంతాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రతిబింబించేలా ఈసారి ప్రత్యేక లోగోను రూపొందిస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను కూడా ఈ లోగోలో తెలియచేసేలా రూపొందించనున్నట్టు తెలిపారు. సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వాణిప్రసాద్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య, జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మల్కాజిగిరి సీపీ బి.సుమతి, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) హైదరాబాద్ జోయెల్ డేవిస్, స్పెషల్ కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ ముకుంద రెడ్డి, హార్టీకల్చర్ కమిషనర్ షేక్ యాస్మీన్ బాషా, జలమండలి కమిషనర్ అశోక్ రెడ్డి, టూరిజం డైరెక్టర్ రంజిత్ నాయక్, శిల్పారామం, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఎ.నర్సింహారెడ్డి, ప్రత్యేక అధికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *