– తాలు, తరుగు లేకుండా కొంటానన్న హామీని మరిచారా?
– సీఎంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : మీ కళ్లముందే తాలు, తేమ పేరుతో రైతులను నిలువునా ముంచుతున్నా పట్టించుకోరా అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఈమేరకు సీఎంకు బహిరంగ లేఖ రాశారు. మండుటెండల్లో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులు మీకు పట్టవా అని నిలదీశారు. వడ్లకు బోనస్ హామీ అంతా ఉత్తిదేనా అంటూ గత రబీ సీజన్‌కు బోనస్ ఎగ్గొట్టారు.. ఈ సీజన్‌లోనూ బోనస్‌కు పాతరేసినట్లేనా అని నిలదీశారు. పత్తి పంటకు ఎమ్మెస్పీ ఎగ్గొట్టి రైతులను ముంచారు.. మొక్కజొన్నకు కేంద్రం ఎమ్మెస్పీ ఇస్తున్నా కొనుగోలు బాధ్యతను విస్మరించి దళారులకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అకాల వర్షాలతో రెండున్నరేళ్లలో ఐదు లక్షలకుపైగా ఎకరాల్లో పంట నష్టపోతే ఏం చేశారన్నారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.260 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నించారు. దళారులకు దోచిపెట్టి రైతులను రోడ్డున పడేయడమే మీ విధానమా.. పౌరసరఫరాల సంస్థను అప్పుల ఊబిలోకి నెడతారా.. అని అడిగారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ రూ.56 వేల కోట్ల అప్పులతో దివాలా తీయిస్తే కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో సంస్థను రూ.లక్ష కోట్ల అప్పుల పాల్జేసిందని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను పాతిపెట్టేశారంటూ రాయపూర్ ఏఐసీసీ రైతు తీర్మానాలకు తిలోదకాలిచ్చారా అని ఆ లేఖలో నిలదీశారు. రబీ సీజన్‌లో రైతుల వెతలపై మీరు ఏనాడైనా సమీక్షించారా సీఎం గారూ అని ఆయన అడిగారు. వడగాడ్పులతో జనం అల్లాడుతుంటే మీ డిజాస్టర్ మంత్రి నిద్రపోతున్నారా అన్నారు. ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతుంటే సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఏది అన్నారు. కరప్షన్, కలెక్షన్, ల్యాండ్ సెటిల్‌మెంట్లు తప్ప రైతుల కన్నీటి వెతలతో మీకు పనిలేదా అంటూ నమ్మి ఓటేసిన పాపానికి అన్నదాతలను నట్టేట ముంచుతారా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర పడినా మీలో చలనం లేదా అని నిగ్గదీశారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని బండి హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





