– ఆధారాలతో అసెంబ్లీలో బయటపెట్టాం
– ఎక్సెస్ టెండర్లతో కొందరికే కట్టబెడుతున్నారు
– బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : హ్యమ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని ఆధారాలతో తాము అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బయటపెట్టామని బీఆర్ఎస్ ఎల్పీ ఉప నాయకుడు టి.హరీష్‌రావు తెలిపారు. ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్‌లో 25 శాతం ఎక్సెస్‌తో కొందరికి మాత్రమే కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారని ఆనాడే చెప్పామన్నారు. తమ మాటే నిజమైందని, హ్యమ్ మోడల్ రోడ్ల టెండర్‌లో 25 శాతం ఎక్సెస్‌తో టెండర్ వేశారని చెప్పారు. ఈ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదంటూ ఆర్ అండ్ బీలో రూ.11 వేల కోట్లకు టెండర్ పిలిస్తే ఎక్సెస్‌తో కలిసి దాదాపు రూ.15 వేల కోట్లకు చేరిందని ఆరోపించారు. అలాగే పంచాయతీరాజ్‌లో రూ.6 వేల కోట్లతో టెండర్ పిలిస్తే దాదాపుగా రూ.7 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు అవుతుందని, ఎక్సెస్ టెండర్ వల్ల రూ.5 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని వివరించారు. హ్యామ్ మోడల్ రోడ్ల కోసం 60 శాతం బ్యాంకు నుంచి అప్పు తెచ్చి 15 సంవత్సరాలపాటు వడ్డీ సహా బ్యాంకుకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలపై తీవ్రమైన భారంతోపాటు రాబోయే ప్రభుత్వాలపై తీవ్రమైన భారం పడుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చేసే అప్పులతోపాటు పరోక్షంగా అప్పులు చేస్తున్నాడని, ఈ టెండర్‌లలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కూడా ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోరాడాడు.. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తెచ్చాడని ఆరోపించారు. 2014 బీఆరఎస్ అధికారంలోకి రాగానే మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేశామని, తమ హయాంలో 5 శాతం కంటే ఎక్కువగా టెండర్ ఉంటే వెంటనే రీ కాల్ చేసేవాళ్ళమని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 శాతం టెండర్ ఎక్సెస్ వేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఎక్సెస్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని, టెండర్లన్నిటినీ రీ కాల్ చెయ్యాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని, ఇదే విషయాన్ని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆధారాలతో వివరించామని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఉంటాడు.. రేపు పోతాడు.. ఎక్సెస్ టెండర్‌ల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని చెప్పారు. ఈ టెండర్లలో ఒక కంపెనీకి 15 టెండర్లు దక్కబోతున్నాయని పేర్కొన్నారు. త్వరలో ఆధారాలతో బయటపెడతానన్నారు. ఆరఅండ్‌బీలో రిటైర్ అయిన చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ జోగారెడ్డి పదవీ కాలం పొడిగించి ఈ టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారన్నారు. ప్రధానమైన ఇంజనీరింగ్ విభాగంలో ముఖ్యమైన అధికారులకు ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అడ్వైజర్లు ఉండరని, ఎక్స్‌టెన్షన్ ఉండదని మాట్లాడిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రధానమైన ఇంజనీరింగ్ డిపార్టుమెంటులో అధికారులకు ఎక్స్‌టెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




