చైతన్యంతో భారత్‌ ప్రశ్నిస్తుంది..!

“ప్రజల పక్షానా సుదీర్ఘకాలంగా, దశాబ్దాలపాటు అన్ని త్యాగాలకు సిద్దపడి పని చేసిన వారు ప్రజలు చైతన్యం కావడం లేదు, వారిలో పోరాటం చేసే పరిపక్వత ఇంకా రాలేదని, పాలక, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యం రాలేదని ప్రకటించడం బాధాకరం. మారిన పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు అస్కా రం లేదని చెప్పడం పరిస్థితులను, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అంచనా వేయడంలో విఫలమవ్వడమే కారణం..”

ప్రజల చైతన్యాన్ని మాజీలు ప్రశ్నిస్తున్నారు..!! ధరణి దద్దరిల్లెలా ప్రజల ధిక్కార స్వరం వినిపిస్తుంది..!!

భారత దేశం నిత్యం చైతన్యం దీపం.దేశంలో చైతన్య జ్ఞాన జ్యోతి వెలుగుతూనే ఉంటుంది.ప్రజలు ఉద్యమిస్తారు. సమస్యలు, సవాళ్లతో నిత్యం సంఘర్షిస్తూ పోరాటాలు నిర్మిస్తారు. ప్రజా ఉద్యమాలకు ప్రజలే చరిత్ర నిర్మాతలు. భౌతిక భావా వాద సిద్దాంతాలపై చర్చిస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తారు. ప్రశ్నించడం, సమస్యలపై కొట్లాడటం నూతన ఆవిష్కరణలతో నవ సమాజాన్ని నిర్మించడం ఒక్క ప్రజల వల్లే అవుతుంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన. ఎంతమంది పాలకులు మారిన. ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చిన అవన్నీ ప్రజా పోరాటాల ద్వారానే సాధ్యమైంది. ప్రజా పోరాటాలు లేకుండా ఏ వ్యవస్థ మారలేదు..ఆదిమ, బానిస సమాజం నుంచి ఇవాళ్టి ప్రజాస్వామ్య ఏర్పాటు వరకూ ప్రజా పోరాటాలే మార్పుకు పునాదులు. ప్రజలు ఎప్పుడూ చైతన్యంతోనే ఉంటారు.కొంతమంది ప్రజా చైతన్యం లేదంటూ చేస్తున్న దంతా తప్పుడు వక్తీకరణలే అని చరిత్ర మొత్తం నిరూపిస్తోంది. తాజాగా త్యాగాల పోరాట బాటలో సుదీర్ఘకాలం నడిచి ఇప్పుడు భోగాల దారిలోకి వచ్చిన వాళ్లు ప్రజా చైతన్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏ సిద్దాంతం, పోరాటాలైతే ప్రజల బతుకులు మార్చుతాయని చెప్పిన వారే ఇప్పుడు ఆ సిద్దాంతమే తప్పంటున్నారు.

దేశంలో ప్రజలు మాట్లాడుతున్నారు.కార్మికులు జంగ్‌ సైరన్‌ మోగిస్తున్నారు. అన్నదాతలు దిల్లీకి కవాతు‌ చేస్తున్నారు. విద్యార్థి నిరుద్యోగులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు, దేశానికి అకౌంటబిలిటీ అడుగుతున్నారు..ప్రభుత్వాల జవాబుదారీతనం, పాలకు బాధ్యతపై దిల్లీ వీధుల్లో యువత లాంగ్ మార్చ్‌లు నిర్వహిస్తున్నారు. పాలకుల అసమర్దతతో దేశాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక రుగ్మతలపై పోరాటం చేస్తున్నారు. పాలకుల అవినీతి, బంధు ప్రీతీ, సహజ వనరుల దోపిడీపై తిరుగుబాటు చేస్తున్నారు. పోరాటం చేస్తున్న వారిపై ప్రభుత్వాలు తుపాకులతో కాల్పులు జరుపుతూ, కర్రలతో ఒళ్లు చింద్రమై రక్తాలు చిందేటట్లు కొడుతున్న దేశంలో యువత ఉద్యమం ఆపడం లేదు.

మేము బానిసలం కాదు. ఈ దేశానికి యజమానులమంటూ దేశ వ్యాప్తంగా నినదిస్తున్నారు. ఎంత అణచివేస్తే అంత తిరిగి వస్తామంటూ..మేము మహాత్మ గాంధీ, అల్లూరి, ఆజాద్‌, భగత్‌ సింగ్‌ సుఖ్ దేవ్‌, రాజ్‌గురు, సుభాష్‌ చంద్రబోస్‌ వారసులమంటూ ప్రకటించుకుంటున్నారు. బానిస వ్యవస్థ నుంచి దేశ స్వాతంత్ర్య , ప్రజాస్వామ్య ఉద్యమాల వరకూ అన్నింటికీ తాము వర్తమాన, భవిష్యత్‌కు వారసులంటూ దిక్కులు పిక్కటిల్లేలా, దోపీడీ వర్గాలు, ప్రజా కంఠక పాలకులకు వ్యతిరేకంగా ధరణి దద్దరిల్లెలా ధిక్కార స్వరం వినిపిస్తుంది. అన్నదాతల ఎర్రకోట ముట్టడి నుంచి విద్యార్థి నిరుద్యోగుల పార్లమెంట్‌ ముట్టడి వరకూ. హర్యానాలో కార్మికుల ఆందోళన ఉంచి పాడేరులో గిరిజనుల బాక్సైట్‌ వ్యతిరేక పోరాటం వరకూ మధ్య భారత్‌లో ఆదివాసుల మైనింగ్ వ్యతిరేక పోరాటాల నుంచి మైదాన ప్రాంతంలో ప్రభుత్వాలపై నిరుద్యోగుల తిరుగుబాటు వరకూ గల్లీ నుంచి దిల్లీ వరకు ప్రతి మూలన ప్రభుత్వాలపై ప్రజల అసంతృప్తి కట్టలు తెచ్చుకుంటుంది. ప్రజల్లో గూడుకట్టుకున్న ఆగ్రహాగ్నిపర్వతం బద్దలైతోంది.

అయితే గత కొంతకాలంగా ప్రజా పోరాటాలు లేవని, ప్రజలు చైతన్యంగా లేరని, ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడం లేదని అటు ప్రభుత్వాల నుంచి ఇటు కొన్ని ప్రజా ఉద్యమ సంఘాల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం లేదనడంలో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు దోపిడీ వర్గాలు ప్రయోజనాలు ఉండొచ్చు. ప్రజలు చైతన్యం కాకుండా, సమస్యలపై ఐక్యం కాకుండా చేయడంలో పాలక వర్గాలు ప్రయోజనాలుండొచ్చు.  ప్రజల కోసం మాట్లాడే, హక్కుల కోసం కొట్లాడే వారు ఎవ్వరూ లేరని, జనాలు పాలకుల బానిసలని చెప్పడానికి అధికార వర్గాలు ప్రచారం చేస్తుండొచ్చు. అలా ప్రాపగండా చేయడంలో పాలక వర్గం, దోపిడీ వర్గాల ఉమ్మడి లక్ష్యమై ఉండొచ్చు. మరీ ప్రజల పక్షానా సుదీర్ఘకాలంగా, దశాబ్దాలపాటు అన్ని త్యాగాలకు సిద్దపడి పని చేసిన వారు ప్రజలు చైతన్యం కావడం లేదు, వారిలో పోరాటం చేసే పరిపక్వత ఇంకా రాలేదని, పాలక, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యం రాలేదని ప్రకటించడం బాధాకరం. మారిన పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు అస్కా రం లేదని చెప్పడం పరిస్థితులను, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అంచనా వేయడంలో విఫలమవ్వడమే కారణం.

ప్రజలు చైతన్యంగా లేరు. జనాలు ప్రభుత్వాలపై, పాలన విధానాలపై సంతృప్తితో ఉన్నారు. దోపిడి వర్గాల విధ్వంసకర అభివృద్దిపై అసంతృప్తితో లేరు. ఈ వినాశకర, జన వ్యతిరేకత అభివృద్ది నమూనాలో భాగస్వామ్యం అవుతున్నారని దోపిడీ పాలక వర్గాలు ప్రచారం చేస్తుంటే. ఆ దోపిడీ వర్గాల ప్రకటనల రొంపిలో ప్రజల కోసం త్యాగాల పోరాటాలు చేసిన వారు కొట్టుకుపోతున్నారు. పాలక వర్గాల ప్రతీప శక్తుల వ్యూహంలో చిక్కుకుపోతున్నారు. దోపిడీ వర్గాల గొంతుకు గొంతు కలుపుతున్నట్లు ప్రజలు చైతన్యంగా లేరు. పోరాటాలు చేసే పరిపక్వతకు రాలేదంటూ ప్రకటిస్తున్నారు. నిజానికి అలా ప్రకటిస్తున్న వాళ్లు సుదీర్ఘకాలం త్యాగాల పోరాటాలను చేసినవారే కావడం శోచనీయం. ప్రజలే చరిత్ర నిర్మాతలు, తమలాంటి వాళ్లలను లక్షల మందిని తయారు చేసుకోవడం కొత్తేమికాదని,తాము కూడా అక్కడి నుంచే వచ్చినట్లు ఇవాళా పాలక వర్గాలతో గొంతు కల్పుతున్న ఉద్యమకారులకు స్పష్టంగా తెలుసు..కానీ పరిస్థితులు వాళ్లలో అలా మాట్లాడించేలా పాలక దోపిడీ వర్గాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి కావచ్చు.

మావోయిస్టు పార్టీ దగ్గరకు వద్దాం..పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల కోసం ఆ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. ఎంతో మంది ప్రజల కోసం అమరులయ్యారు. దశాబ్దాల కాలం ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రజలతో కలిసి ప్రజా పోరాటాలు చేసింది. పాలక వర్గాల దోపిడీ ఎదుర్కొంటూ ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించి చూపించింది. దేశ రాజకీయాలను, ప్రజల ఆలోచనల విధానాలను ప్రభావితం చేసింది. అలాంటి త్యాగాల చరిత్ర ఉన్న పార్టీలో నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్లు లొంగిపోయిన తర్వాత కూడా ప్రస్తుతం ప్రజా పోరాటాలు నిర్మించడం సాధ్యం కాదని, ప్రజలను సంఘటితం చేసే అవకాశం లేదంటూ ప్రజలు చైతన్యం కావడం లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది కూడా పాలక వర్గాలు, దోపిడి వర్గాల ప్రకటనలకు కొనసాగింపుగానే ఉంటున్నాయి.

నిజానికి మావోయిస్టు పార్టీ దండకారణ్యంలోకి ముందు నుంచే శతాబ్దాల తరబడి ఆదివాసులు, గిరిజనులు తమ హక్కుల కోసం పాలక వర్గాలు, ప్రభుత్వ వర్గాలతో పోరాటం చేస్తున్నారు. అస్తిత్వం, జల్‌-జంగిల్‌-జమీన్‌ కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మైదాన ప్రాంతం నుంచి షెల్టర్‌ కోసం వెళ్లిన అన్నలు ఆదివాసుల పోరాటాలకు దిశ నిర్దేశం చేశారు తప్ప వాళ్ల పోరాటాలకు నాయకత్వం వహించలేదు. ఏ విధంగానైతే ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసం అన్నలు షెల్టర్‌ కోసం అడవికి వెళ్లారో. ఇప్పుడు మళ్లీ మైదాన ప్రాంతానికి వచ్చారు. కానీ అడవిబాట పట్టడానికి వారిలో కనిపించిన ప్రజా ప్రయోజనాలు రావడంలో కనిపించడం లేదు. సరే అది వ్యక్తిగత కారణం కావచ్చు. నాటి చైతన్యం నేడు లోపించవచ్చు. తాము లేకపోతే ఆదివాసి పోరాటాలే లేవన్నట్లు మాట్లాడవచ్చు. దానికి ప్రజా మద్దతు లేదని చెప్పవచ్చు. అటు పాలక వర్గాలు కూడా ఆదివాసులు అభివృద్ది ముసుగులో జరుగుతున్న విధ్వంసానికి రెడ్ కార్పెట్‌ పరుస్తున్నారని ప్రకటిస్తున్నారు.

అయితే అటు పాలక దోపిడీ వర్గం, ఇటు రహస్య జీవితాలు గడిపి, త్యాగాల పోరాటాలు ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చినవారు చెపుతున్నదంతా పచ్చి అబద్దమని చరిత్ర, వర్తమానం ప్రజలు తమ పోరాటాలతో నిరూపిస్తున్నారు. ప్రజలు చైతన్యంతో ఉన్నారని. దండకారణ్యంలో ఆదివాసి పోరాటాలు అనేకం కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌లో గిరిజనులు తమ భూములు, అడవులు మరియు జీవనోపాధిని రక్షించుకోవడానికి, ముఖ్యంగా బొగ్గు గనుల తవ్వకాలు, అటవీ నిర్మూలనకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన చట్టపరమైన రక్షణలను, చట్టాలను పాలక వర్గాలు పక్కనపెడుతోందని, పర్యావరణ కట్టుబాట్ల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని పోరాటం చేస్తున్నారు.

దండకారణ్యం మధ్య భారత్‌లో కీలకమైన ప్రాంతమేకాదు, భారతదేశపు ఊపిరితిత్తులుగా పిలుచుకుంటారు. అలాంటి జీవగాలిచ్చే మధ్య భారతంలో పాలక వర్గాలు దోపిడీ వర్గాలతో చేతులు కలిపి విధ్వంసం సృష్టిస్తున్నారు. మైనింగ్‌ పేరుతో అడవులను నరికేస్తూ సహజ వనరులను దోపిడీ చేస్తూ పచ్చని ప్రాంతాన్ని ఎడారిగా మార్చుతూ దేశం ఊపిరి తీస్తున్నారు. చత్తీస్‌గడ్‌లో రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ , అదానీ ఎంటర్‌ప్రైజెస్ అక్కడ మైనింగ్‌ చేస్తున్నాయి. పాలకుల తీరుకు వ్యతిరేకంగా ఆదివాసులు సంఘటితంగా ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్ పోరాటం చేస్తుంది. ఈ సిఫార్సు ఈ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆదివాసి, గిరిజన వర్గాలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.హస్డియో అరణ్య బచావో సంఘర్ష్ అంటూ హస్డియో ఆత్మ కోసం పోరాటం చేస్తున్నారు.

ఈ పోరాటం అభివృద్ధి, ఆదివాసీల హక్కులు మరియు భారతదేశ పర్యావరణ కట్టుబాట్ల మధ్య ఉన్న ఒక విస్తృత సంఘర్షణను స్పష్టం చేస్తోంది. అటు ఛత్తీస్‌గఢ్ లోనే మరో ప్రాంతంలో అంబికాపూర్ లో బొగ్గు గనుల విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన చేస్తున్నారు.మొత్తంగా మధ్య భారత్‌లో ఎక్కడైతే విలువైన ఖనిజ సంపద, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయో..అక్కడ పాలక వర్గం దోపిడీ వర్గంతో కలిసి అడవులును ఆదివాసుల జీవితాలను విధ్వంసం చేస్తున్నారు. సెమిలిగుడ మరియు పొట్టంగి బ్లాక్‌ల పరిధిలోని కోటియా, మాలిపుట్, ఖుదీ, నువాగావ్, పొట్టంగి మరియు సోరిషా అనే ఆరు పంచాయతీలకు చెందిన వందలాది మంది గ్రామస్తులు సెరుబంధ పర్వత సురక్ష సమితి పేరుతో ఒకటయ్యారు. సెరుబంధ కొండలలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకంగా పోరాడుతున్నారు.కోరాపుట్ జిల్లాలో పంచపత్మలి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సహజ వనరుల తవ్వకాలను అనుమతించబోమని హెచ్చరిస్తూ నాల్కో గో బ్యాక్ మూమెంట్‌ను ఉతృతంగా కొనసాగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీ, గిరిజన ప్రాంతంలో కూడా ప్రజలు జల్‌ జింగిల్ జమీన్‌ కోసం పోరాటం చేస్తున్నారు. తమ హక్కులు ఆస్తిత్వం కోసం ఆందోళనలు చేస్తున్నారు. మైదాన ప్రాంతం నుంచి ఎవరో వస్తారు తమకు మద్దతుగా పోరాటం చేస్తారని చూడకుండా తమకు జరుగుతున్న అన్యాయంపై తమదైన స్టైల్‌లో తమకు వారసత్వంగా వచ్చిన పోరాట స్పూర్తిని కొనసాగిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పాడేరులో ఆదివాసీలు తమ హక్కుల కోసం కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. 1/70 చట్టం అమలు చేయాలని, ఏజెన్సీలో మైనింగ్‌ ఆపాలని, జల విద్యుత్ ప్రాజెక్టులను, బాక్సైట్ త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు.ప్రభుత్వాలు స్పందించకపోవడంతో గిరిజనులు లాంగ్‌ మార్చు నిర్వహించారు. వేలాది మంది ఐటీడీఏను ముట్టడించారు. తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఫారెస్ట్‌ అధికారులకు మధ్య వైరం కొనసాగుతోంది. పాము ముంగిసలా నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంది. తమ పోడు హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకూ ఆదివాసి గిరిజనులు పోరు పోరు చేస్తున్నారు. .అటు దేశ రాజధానికి కూత వేటు దూరంలో ఉన్న హర్యానాలో కార్మికులు తమ హక్కులకై పోరాటం చేస్తున్నారు. కార్మికులు ఆదివాసి గిరిజనులే కాదు దేశ వ్యాప్తంగా శ్రమైక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆందోళనలు చేస్తున్నారు.

అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే..దేశంలో ఏ ప్రజా పోరాటలను కేంద్రం అణచివేసిందని గొప్పగా చెప్పుకుంటుందో..ఆదివాసి దళిత బహుజన వర్గాల పక్షానా పోరాటాలు చేస్తుందని నిషేధిత పార్టీతో అణచివేసిందో ఆ పార్టీ లేకుండానే ఆదివాసీ పోరాటాలు దండకారణం, ఏజెన్సీల్లో బలంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు మావోయిస్ట్‌ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసి, ప్రజలు చైతన్యం కావడం లేదు. గత కొంతకాలంగా దేశ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ప్రజలు పోరాటాలు చేసేందుకు సంసిద్దంగా లేరని బహిరంగా జీవతంలోకి వచ్చి చెప్పుతు మావోయిస్ట్‌ పార్టీ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుందని చెపుతున్న ఈ సందర్భంలోనే గతంలో కంటే ఎక్కువ ప్రజలు చైతన్యమై తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.  ప్రజలు ఉద్యమాలను నిర్మిస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలు చైతన్యంకాలేదు.పోరాటాలు చేసేందుకు సిద్దంగా లేరని చెప్పే వారికి హర్యానా మొదలు మధ్య భారత్‌ మీదుగా పాడేరు వరకూ ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకూ ఆదివాసులు, కార్మికులు చేస్తున్న ప్రత్యక్ష పోరాటాలు అటు పాలక వర్గాలకు ఇటు బహిరంగా జీవితంలోకి వచ్చిన మాజీ మావోయస్టులకు కనువిప్పు కలిగించాలి. ప్రజా పోరాటాలు లేవు, ప్రజలు చైతన్యం కావడం లేదు, పోరాటాలకు సిద్దంగా లేరంటూ ప్రచారం చేయడం సరైంది కాదు.

దేశ ద్రోహులు, ఖలిస్తాన్‌, పాక్‌ ఎజెంట్లు, దైవ ద్రోహులు, విదేశీ కుట్ర దారులంటూ ప్రభుత్వాలు ప్రజలను అణిచివేస్తుంటే, మాజీ మావోయిస్టులు మాత్రం ప్రజలను కలవకుండానే, వారిలో ఉన్న అసంతృప్తి తెలుసుకోకుండానే వాళ్లు చైతన్యం కావడం లేదు. ఆదివాసులకు అవగాహన లేదు, విద్యార్థి నిరుద్యోగులు పోరాటం చేసే పరిస్థితి లేదంటూ పాలక వర్గాల నీడలో ఉన్న సో కాల్డ్ మాజీలు ప్రజా చైనత్యానాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తూ దోపిడీ వర్గాల గోంతుకై మాట్లాడుతున్నారు. ఇవాళ దేశంకదనోత్సాహంతో ముందుకు సాగుతోంది. దోపిడీదారులు పంచనా చేరి ప్రజా చైతన్యాన్ని నీరుగార్చే పాలక వర్గాలుగా మారకండి..మీరు నిర్ణయించుకోండి ప్రజల పక్షమా..?.పాలకుల పక్షమా..?.అంతేకానీ మాజీల ముసుగులో రాజీలేని పోరాటాలను తక్కువ చేసి మాట్లావద్దు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపోచ్చేమోగానీ, పోలీసులతో ,ఇనుప బూట్ల అణచివేతలతో ప్రజా చైతన్యాన్ని, ప్రజా పోరాటాలను ఆపడం సాధ్యం కాదు. చైతన్య రూపాలు, పోరాట రూపాలు మారుతాయి కానీ పోరాటాలు మాత్రం ఆగిపోవు..!!

-తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *