నిరంకుశ దర్పంపై ‘జిల్లపురుగుల’ దండయాత్ర!

“”న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠం నుంచి వచ్చిన ఒక నిరసనకార వ్యతిరేక వ్యాఖ్య, నేడు దేశంలో నిద్రాణంగా ఉన్న శ్రామిక, విద్యార్థి లోకాన్ని మేల్కొలిపింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికలలో గెలిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేకపోవచ్చు. కానీ పాలకుల తప్పుడు విధానాలను నిలదీయడంలో , ప్రజాస్వామ్య సంస్థల తటస్థతను ప్రశ్నించడంలో, నిరుద్యోగ యువతకు ఒక స్వతంత్ర గొంతుకను ఇవ్వడంలో ఈ వేదిక అద్భుతమైన విజయం సాధించింది. జీవ పరిణామ క్రమంలో “డైనోసార్ల వంటి మహాకాయాలు కూడా అంతరించిపోయినప్పటికీ, అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలిచిన ఏకైక జీవి “బొద్దింక”. అదేవిధంగా అధికార దర్పంతో పౌరులను కించపరిచే నిరంకుశ శక్తులు ఎంత బలంగా ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంచుకునే నిరసన రూపాలు ఎప్పటికీ అంతరించిపోవు. 500 ఏండ్ల క్రితం నాటి డచ్ విప్లవకారుల వలె, ఆధునిక భారతీయ యువత కూడా పాలకుల ప్రతి అవహేళనను ఒక ప్రతీకార శస్త్రంగా మలచుకొని వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ప్రయాణిస్తున్నది..””

భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో 2026 మే 15న జరిగిన పరిణామాలు దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత అసాధారణమైన ప్రజా నిరసనకు దారితీశాయి. దిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాదుల హోదా కల్పనకు సంబంధించిన మార్గదర్శకాల ఉల్లంఘనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించడానికి నిరాకరించింది. ఆ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నిరుద్యోగ యువత, సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉండే వారిని, ఆర్టీఐ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఉద్యోగాలు దొరకని కొందరు యువకులు బొద్దింకల వలే వ్యవస్థపై దాడి చేస్తున్నారని, వారు సమాజానికి పట్టిన పరాన్నభుక్కులని వ్యాఖ్యానించారు. మరుసటి రోజున ఆయన వివరణ ఇస్తూ, తన వ్యాఖ్యలు తప్పుగా ఉటంకించబడ్డాయని, కేవలం నకిలీ డిగ్రీలతో వృత్తిలోకి ప్రవేశించే పరాన్నభుక్కులను మాత్రమే తాను విమర్శించానని పేర్కొన్నప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాజ్యాంగ రక్షకుడి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి పౌరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వచ్చిన ఈ పోలిక తీవ్ర ప్రజా ఆగ్రహానికి దారితీసింది.

 ఈ చారిత్రక అవమానాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మార్చాలని సంకల్పించిన 30 ఏండ్ల సామాజిక మాధ్యమ వ్యూహకర్త, బోస్టన్ విశ్వవిద్యాలయ ప్రజా సంబంధాల విభాగ పూర్వ విద్యార్థి అభిజీత్ దీప్కే, మరుసటి రోజే అంటే 2026 మే 16న “కాక్రోచ్ జనతా పార్టీ” (సీజేపీ) అనే వ్యంగ్య రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. కేవలం ఒక నిరసన ట్వీట్‌తో ప్రారంభమైన ఈ ప్రయోగం, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికత ద్వారా రూపొందించిన వెబ్‌సైట్, మ్యానిఫెస్టోతో క్షణాల్లో దేశవ్యాప్తంగా విస్తరించింది. “బద్ధకస్తులు, నిరుద్యోగుల గొంతుక” అనే ట్యాగ్‌లైన్‌తో సాగిన ఈ డిజిటల్ ప్రస్థానం, అధికార బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కంటే ఎక్కువ ప్రజాదరణ పొంది, అతి తక్కువ కాలంలోనే 2.2 కోట్లకు పైగా ఫాలోవర్లను, 3.5 లక్షల కంటే ఎక్కువ ఆన్‌లైన్ సభ్యత్వాలను నమోదు చేసుకున్నది. లక్షలాది మంది యువకులు ఈ లేబుల్ ను అవమానంగా భావించకుండా, తాము నిజంగానే వ్యవస్థను కదిలించే “నిరోధక శక్తి గల బొద్దింకలమే” అని గర్వంగా ప్రకటించుకున్నారు. మానవ చరిత్రలో ఒక సమూహాన్ని “బొద్దింకలు” లేదా “పరాన్నభుక్కులు” అని పిలవడం అనేది సాధారణంగా ఒక తీవ్రమైన అణచివేతకు,  హింసకు ముందస్తు సంకేతంగా ఉంటుంది. ఉదాహరణకు 1994 రువాండా నరమేధంలో టుట్సి పౌరులను రేడియో ప్రసారాల ద్వారా “ఇన్యెంజి” (బొద్దింకలు) అని పిలిచి వారి మానవీయ గుర్తింపును తొలగించారు. అలాగే నాజీ జర్మనీ యూదులను “పరాన్నభుక్కులు” అని పిలిచి వారిపై హింసను సమర్థించుకున్నది. అయితే ఆధునిక భారతీయ యువత ఈ భావజాలాన్ని తిప్పికొడుతూ, నిరంకుశ ధోరణులపై వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఒక నూతన ప్రజాస్వామ్య పోరాటానికి తెరలేపింది.

చరిత్రలో పాలకుల అహంకారాన్ని అణచిన కొన్ని అవహేళనలు పాలకుల అహంకారం, వారు చేసిన అవహేళనలే కాలక్రమేణా తిరుగుబాటు భావాలుగా మారి, చివరకు నూతన రాజ్యాల స్థాపనకు దారితీస్తాయని చెప్పడానికి ప్రపంచ చరిత్రలో బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ కోణంలో చూసినప్పుడు ఐదు వందల ఏండ్ల క్రితం నాటి డచ్ విప్లవం అత్యంత ప్రముఖమైనది. పదహారో శతాబ్దంలో నేటి నెదర్లాండ్స్ ప్రాంతం స్పానిష్ చక్రవర్తి ఐదో చార్లెస్ కుమారుడైన రెండో ఫిలిప్ నిరంకుశ పాలనలో ఉండేది. ఆయన స్థానిక కులీనుల అధికారాలను తగ్గించి, మతాధికారాన్ని కేంద్రీకృతం చేసి, తీవ్రమైన పన్నులను విధించడమే కాకుండా, స్థానిక ప్రొటెస్టంట్, కాల్వినిస్ట్ మత విశ్వాసాలను అణచివేసి కాథలిసిజాన్ని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించాడు. ఈ దుర్భర పాలనకు వ్యతిరేకంగా 1566 ఏప్రిల్ లో 400 మంది డచ్ కులీనులు, వ్యాపారవేత్తలు బ్రస్సెల్స్ లో సమావేశమై, మతపరమైన ఆంక్షలను రద్దు చేయాలని, పన్నులు తగ్గించాలని కోరుతూ సామంత రాణి మార్గరెట్ ఆఫ్ పర్మాకు ఒక విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించారు. ఆ భారీ సమూహాన్ని చూసి కంగారుపడిన రాణితో ఆమె సలహాదారు బెర్లేమోంట్, “కంగారుపడకండి రాణీ, వాళ్లు కేవలం ముష్టివాళ్లు” అని ఈసడించుకున్నాడు. ఈ అవమానకర పదాన్నే తిరుగుబాటుదారులు తమ బలాంగా మార్చుకున్నారు.

మూడు రోజుల తర్వాత వారు ఒక విందులో సమావేశమై, దేశ ప్రయోజనాల కోసం తాము “ముష్టివాళ్ల సైన్యం” (లీగ్ ఆఫ్ బెగ్గర్స్ – డచ్ భాషలో ‘యూజెన్’) అని గర్వంగా ప్రకటించుకున్నారు. బిచ్చగాళ్ల జోలె, చిప్పలను తమ చిహ్నాలుగా ధరించి, చివరకు 1588 లో స్పెయిన్ నుంచి విడిపోయి స్వతంత్ర డచ్ రిపబ్లిక్ ను స్థాపించారు. మరో ప్రముఖ ఉదాహరణ అర్జెంటీనాకు చెందిన “డెస్కామిసాడోస్” ఉద్యమం. అర్జెంటీనాలోని ఉన్నత సాంప్రదాయ వర్గాలు నిరుపేద శ్రామిక వర్గాన్ని “అంగీలు లేని నిరుపేదలు” అని హేళన చేసేవారు.1940లలో జువాన్ పెరోన్, ఆయన భార్య ఈవా పెరోన్ ఈ అవహేళనను స్వీకరించి, ఆ నిరుపేద వర్గాన్నే తమ రాజకీయ సామ్రాజ్యానికి పునాదిగా మార్చారు. ఈ అవమానం నుంచి పుట్టిన పెరోనిస్ట్ ఉద్యమం దశాబ్దాల పాటు అర్జెంటీనా రాజకీయాలను శాసించింది. అదేవిధంగా బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పటికీ మనుగడలో ఉన్న “విగ్స్” (స్కాట్లాండ్ పశువుల దొంగలు), “టోరీలు” (ఐరిష్ దారిదోపిడీ దొంగలు) అనే పేర్లు కూడా 17వ శతాబ్దంలో వారసత్వ వివాద సమయంలో ఒకరినొకరు నిందించుకోవడానికి వాడుకున్న పెజోరేటివ్స్  నుంచే ఉద్భవించి, చివరకు దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి.

కాక్రోచ్ జనతా పార్టీ మ్యానిఫెస్టో, డిమాండ్లు సామాజిక మాధ్యమాల్లో హాస్యభరితంగా ప్రారంభమైనప్పటికీ, కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని కీలక సామాజిక-రాజకీయ సమస్యలపై అత్యంత నిర్మాణాత్మకమైన, తీవ్రమైన డిమాండ్లను ఉంచింది. పదవీ విరమణ చేసిన ఏ ప్రధాన న్యాయమూర్తికీ రాజ్యసభ స్థానాన్ని బహుమతిగా ఇవ్వరాదని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడడం, ప్రలోభాలకు తావులేకుండా చేయడం తమ లక్ష్యమని తెలిపింది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన పౌరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తే, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ‛ఉపా’ చట్టం కింద అరెస్టు చేయాలని, వోటు హక్కును హరించడాన్ని ఉగ్రవాదంతో సమానమైన నేరంగా పరిగణించాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు, క్యాబినెట్ స్థానాల్లో మహిళలకు 50 శాతం  రిజర్వేషన్లు అమలు చేయాలన్నది. నిర్ణయాధికారంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడం కోసం ఇది తప్పనిసరి అన్నది.

అదానీ, అంబానీ గ్రూపుల యాజమాన్యంలోని మీడియా సంస్థల బ్రాడ్‌కాస్టింగ్ లైసెన్సులను రద్దు చేయాలని, ప్రసిద్ధ యాంకర్ల ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. కార్పొరేట్ శక్తుల నుంచి మీడియాను విముక్తం చేసి స్వతంత్ర పాత్రను పునరుద్ధరించాలన్నది. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులను (ఎంపీ లేదా ఎమ్మెల్యే) 20 ఏండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని, ప్రజా తీర్పును అపహాస్యం చేసే రాజకీయ అనైతికతను అడ్డుకోవడం కోసం ఇది తప్పనిసరి అన్నది. పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన ప్రతి విద్యార్థికి ప్రయాణ, మానసిక క్షోభల కింద రూ.10,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానాన్ని రద్దు చేయాలని, విద్యా పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, విద్యార్థుల హక్కులను రక్షించాలని డిమాండ్ చేసింది.

సీజేపీ వైపు యువత మొగ్గు భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి లభిస్తున్న భారీ ఆదరణ వెనుక దేశాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రమైన ఆర్థిక, విద్యా రంగ సంక్షోభాలు ఉన్నాయి. దేశంలో ఏటా 80 లక్షల మందికి పైగా పట్టభద్రులు విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నప్పటికీ, వారిలో నిరుద్యోగిత రేటు ఆందోళనకరంగా 29.1 శాతంగా నమోదవుతున్నది. ఇది నిరక్షరాస్యుల నిరుద్యోగిత రేటు కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. చదువుకున్న కొద్దీ ఉద్యోగాలు దొరకడం గగనంగా మారడం యువతలో తీవ్ర నిరాశను, నైరాశ్యాన్ని నింపుతున్నది. ఈ వినాశకర ఆర్థిక పరిస్థితులకు తోడు, జాతీయ స్థాయిలో పరీక్షల నిర్వహణ తీరు పూర్తిగా కుప్పకూలింది. మే 3, 2026న నిర్వహించిన నీట్-యూజీ ప్రవేశ పరీక్షలో రాజస్థాన్‌లోని సికార్ జిల్లా కేంద్రంగా వాట్సాప్‌లో లీకైన ప్రశ్నపత్రాలు అసలు ప్రశ్నపత్రంతో 120 కి పైగా ప్రశ్నలతో సరిపోలడం సంచలనం సృష్టించింది. ఈ అక్రమాలకు పాల్పడిన విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రొఫెసర్లు పి.వి. కుల్కర్ణి, మనీషా మంధారే వంటి వారు, ప్రభుత్వ సబ్జెక్ట్ నిపుణురాలు మనీషా హవల్దార్ అరెస్ట్ కావడం వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని బయటపెట్టింది.

మరోవైపు, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) వంటి విద్యార్థి సంఘాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) ని “నేషనల్ టార్చరింగ్ ఏజెన్సీ” గా అభివర్ణిస్తూ, గత ఎనిమిదేండ్లలో 89 పేపర్ లీకేజీలు, 48 పునర్విచారణలు జరిగాయని ఆరోపించాయి. ఈ నిరంతర వైఫల్యాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో పాలక వర్గాలు తమ బాధలను ఆలకించకుండా, తమను “బొద్దింకలు” అని గేలి చేయడం యువతలో తిరుగుబాటు భావాలను మరింత పెంచింది. ప్రభుత్వ ఉదాసీనతకు వ్యతిరేకంగా సీజేపీ పుణే విశ్వవిద్యాలయం, లక్నో ఎకో గార్డెన్, బెంగళూరు ఫ్రీడమ్ పార్క్, జైపూర్, హైదరాబాద్ ధర్నా చౌక్ లలో భారీ ఎత్తున వీధి నిరసనలను నిర్వహించింది. వాతావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్, నటుడు ప్రకాష్ రాజ్, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మమతా బెనర్జీ వంటి వారు సీజేపీ నిరసనలకు సంఘీభావం ప్రకటించగా, అధికార కూటమికి చెందిన పవన్ కల్యాణ్ వంటి నాయకులు ఈ ఉద్యమాన్ని “దేశ సమగ్రతను దెబ్బతీసే సంకుచిత మనస్తత్వం” గా విమర్శించారు. ఈ విధంగా సామాజిక సమీకరణలు వేగంగా మారుతుండడంతో, సంప్రదాయ రాజకీయాలపై విరక్తి చెందిన యువత ప్రత్యామ్నాయ శక్తుల వైపు మొగ్గు చూపుతున్నది.

ఇటలీ ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ తో పోలిక సామాజిక మాధ్యమాలు, వ్యంగ్యం కలయికతో జనించిన సీజేపీ రాజకీయ గమనాన్ని విశ్లేషించడానికి ఇటలీలోని “ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్” (ఎం5ఎస్) ఒక ప్రామాణిక నమూనాగా నిలుస్తుంది. 1980లలో ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకు టెలివిజన్ నుంచి బహిష్కరణకు గురైన ఇటాలియన్ హాస్యనటుడు బెప్పె గ్రిల్లో, ఇంటర్నెట్ సాయంతో తన గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాసాలెగ్గియో ఇంటర్నెట్ సంస్థ సహకారంతో 2005లో ఒక బ్లాగ్‌ను ప్రారంభించి, 2007 లో దేశవ్యాప్తంగా అవినీతిపరులైన ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నిర్వహించిన “వఫాంక్యులో డే” నిరసనలు ఇటలీ రాజకీయాలనే మార్చేశాయి. ఈ అసంతృప్తి నుంచి 2009 లో పుట్టిన ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఆన్‌లైన్ వోటింగ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక వంటి వినూత్న విధానాలతో 2013 నాటికి 25 శాతం కంటే ఎక్కువ ఓట్లను సాధించి దేశంలోనే అతిపెద్ద ఒంటరి పార్టీగా అవతరించింది.

అయితే సీజేపీ ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ మధ్య కొన్ని ప్రాథమిక వైరుధ్యాలు కూడా ఉన్నాయి. బెప్పె గ్రిల్లో నేతృత్వంలోని ఉద్యమం ఒక నిర్దిష్ట సమయానికి సంప్రదాయ రాజకీయ పార్టీగా నమోదు చేసుకొని ఎన్నికల బరిలోకి దిగింది. కానీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఈ ఉద్యమం కేవలం ఒక వ్యంగ్య, స్వతంత్ర ప్లాట్‌ఫారమ్‌గానే కొనసాగుతుందని, దీనిని సంప్రదాయ రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం గానీ, ప్రధాన స్రవంతి రాజకీయ నాయకులను చేర్చుకునే ఉద్దేశం గానీ తమకు లేదని స్పష్టం చేశారు. ఇటలీ ఉద్యమంలో కూడా ఆన్‌లైన్ ప్రజాస్వామ్యం వెనుక అంతర్గత నియంతృత్వం ఉన్నదని, నాయకత్వం తీసుకునే నిర్ణయాలే అంతిమంగా అమలవుతాయనే విమర్శలు ఉన్నాయి. సీజేపీ కూడా కేవలం ఒక వ్యక్తి ఆన్‌లైన్ వ్యూహంపై నడుస్తుండడంతో, సుదీర్ఘ కాలం పాటు ఒక బలమైన సంస్థాగత నిర్మాణం లేకుండా ప్రజా నిరసనలను కొనసాగించడం కష్టతరంగా మారే ప్రమాదం ఉన్నది.

సీజేపీ ఎన్నికల శక్తిగా మారగలదా? ప్రపంచవ్యాప్తంగా అవహేళనలు, నిరసనల నుంచి పుట్టిన ఉద్యమాలు ప్రజాదరణను పొందినప్పటికీ, అవన్నీ ఎన్నికలలో విజయాలు సాధించి అధికారంలోకి రాలేకపోయాయి. నెదర్లాండ్స్ లో 1566లో లీగ్ ఆఫ్ బెగ్గర్స్ (డచ్ విప్లవం) స్పానిష్ నిరంకుశత్వాన్ని సాయుధ పోరాటంతో ఎదుర్కొని, చివరకు స్వతంత్ర డచ్ రిపబ్లిక్ ను స్థాపించింది. భారత దేశంలో సాయుధ విప్లవాల కాలం ముగిసినట్టు కనిపిస్తున్న తరుణంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు రావాలంటే శాంతియుత నిరసనలు, ఎన్నికల పంథా అవసరం. అర్జెంటీనాలో 1946లో  డెస్కామిసాడోస్ (పెరోనిజం) శ్రామిక వర్గాన్ని వ్యవస్థీకరించి, జువాన్ పెరోన్‌ను అధ్యక్షుడిగా గెలిపించి దశాబ్దాల పాటు రాజ్యాధికారాన్ని అనుభవించింది. సీజేపీ ఒక బలమైన శ్రామిక సంఘంగా గానీ లేదా ఎన్నికల రాజకీయ పార్టీగా గానీ మారడానికి సిద్ధంగా లేదు. ఇటలీలో 2009లో ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ వచ్చింది. ఇది కేవలం డిజిటల్ మాధ్యమాలను నమ్ముకొని, సంప్రదాయ పార్టీలను ఓడించి 2018 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భారతదేశంలో డిజిటల్ డివైడ్ (పట్టణ-గ్రామీణ వ్యత్యాసాలు) ఎక్కువ కావడం వల్ల కేవలం ఆన్‌లైన్ క్రేజ్ వోట్లుగా మారదు. బంగ్లాదేశ్ లో 2026లో నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్ సీపీ) ఏర్పడింది. ఇది 2024 లో షేక్ హసీనాను గద్దె దించిన జెన్-జెడ్ విప్లవం నుంచి పుట్టి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బంగ్లాదేశ్ లో జరిగిన విప్లవాత్మక యువత ఉద్యమం ఎన్నికల రంగానికి వచ్చేసరికి పాత సంప్రదాయ పార్టీల వ్యూహాల ముందు నిలబడలేకపోయింది. దీనికి తోడు నేపాల్ లో 2025 లో జరిగిన లీడర్‌లెస్ విప్లవం వ్యవస్థను కుప్పకూల్చినప్పటికీ, ప్రజాస్వామ్యబద్ధంగా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నది.

2022 లో శ్రీలంకను కుదిపేసిన “అరగాలయ” నిరసనలు కూడా అధ్యక్షుడిని పారదోలాయి కానీ నూతన సుస్థిర ఆర్థిక విధానాలను ఆవిష్కరించడంలో పరిమితులను ఎదుర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ తక్షణమే అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎన్నికలలో పోటీ చేయకపోవడం, ప్రాంతీయ భాషల్లో బలమైన క్షేత్రస్థాయి నాయకత్వం లేకపోవడం, కేవలం ఒకే ఒక యువ నేత చుట్టూ తిరగడం వంటివి ఈ ఉద్యమానికి పెద్ద అడ్డంకులు. అయితే దేశంలోని ప్రస్తుత రాజకీయ, సామాజిక సంక్షోభాలు ప్రజలను సంప్రదాయ శక్తులపై అసంతృప్తికి గురిచేస్తూ, సీజేపీ లాంటి ప్రత్యామ్నాయ ఒత్తిడి సమూహాల వైపు మళ్లేలా చేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులకు ప్రజల సమస్యల పట్ల జవాబుదారీతనం లేనప్పుడు, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూసినప్పుడు తిరుగుబాటు తప్పదని చరిత్ర రుజువు చేస్తున్నది.

న్యాయవ్యవస్థ అత్యున్నత పీఠం నుంచి వచ్చిన ఒక నిరసనకార వ్యతిరేక వ్యాఖ్య, నేడు దేశంలో నిద్రాణంగా ఉన్న శ్రామిక, విద్యార్థి లోకాన్ని మేల్కొలిపింది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికలలో గెలిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేకపోవచ్చు. కానీ పాలకుల తప్పుడు విధానాలను నిలదీయడంలో , ప్రజాస్వామ్య సంస్థల తటస్థతను ప్రశ్నించడంలో, నిరుద్యోగ యువతకు ఒక స్వతంత్ర గొంతుకను ఇవ్వడంలో ఈ వేదిక అద్భుతమైన విజయం సాధించింది. జీవ పరిణామ క్రమంలో డైనోసార్ల వంటి మహాకాయాలు కూడా అంతరించిపోయినప్పటికీ, అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలిచిన ఏకైక జీవి “బొద్దింక”. అదేవిధంగా అధికార దర్పంతో పౌరులను కించపరిచే నిరంకుశ శక్తులు ఎంత బలంగా ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్యంలో ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎంచుకునే నిరసన రూపాలు ఎప్పటికీ అంతరించిపోవు. 500 ఏండ్ల క్రితం నాటి డచ్ విప్లవకారుల వలె, ఆధునిక భారతీయ యువత కూడా పాలకుల ప్రతి అవహేళనను ఒక ప్రతీకార శస్త్రంగా మలచుకొని వ్యవస్థను పునర్నిర్మించే దిశగా ప్రయాణిస్తున్నది.

✍️ మేకల ఎల్లయ్య – ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *