– డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా మీ-సేవ కేంద్రాలు
– చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి
– చిన్న వ్యాపారులకు డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందుబాటులోకి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24 : ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(మీ సేవ) ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా పేరొందిన మెటా సంస్థ సహకారంతో రాష్ట్రంలోని మీ-సేవ కేంద్రాలను డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా తీర్చిదిద్దే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు తక్కువ వ్యయంతో డిజిటల్ ప్రకటనల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో క్యూర్ ప్రాంతానికి చెందిన 150మందికి పైగా మీ-సేవా విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పాల్గొన్నారు. మెటా ప్లాట్‌ఫాంలలో (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్) ప్రకటనలను రూపొందించడం, వాట్సప్ బిజినెస్ అకౌంట్‌ను క్రియేట్ చేయటం, తమ ఉత్పత్తులను ఆ అకౌంట్ ద్వారా ప్రచారం చేయడం, వినియోగదారులను గుర్తించడం, డిజిటల్ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వంటి అంశాలపై వారికి శిక్షణ అందించారు. ఈ కార్యక్రమం ద్వారా కిరాణా షాపులు, పండ్ల వ్యాపారులు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు, మెడికల్ షాపులు, హాస్పిటల్స్, పాఠశాలలు, సెలూన్లు, మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, స్టార్టప్‌లు, ఎంఎసఎంఈలు, పెద్ద సంస్థలు తదితర అన్ని రకాల వ్యాపారాలు తమ సమీపంలోని మీ-సేవా కేంద్రాన్ని సంప్రదించి మెటా ప్లాట్‌ఫాంలలో ప్రొఫెషనల్ డిజిటల్ ప్రకటనలను రూపొందించి ప్రచారం చేసుకునే అవకాశం పొందుతాయి. మీ-సేవా నిర్వాహకులు ప్రకటనల రూపకల్పన, ప్రచార కంటెంట్ తయారీ, సరైన వినియోగదారుల ఎంపిక, ప్రకటనల ప్రచురణ తదితర అంశాల్లో పూర్తి సహాయాన్ని అందిస్తారు. దీంతో వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలకు మరింత ప్రచారం కల్పించుకొని,ఎక్కువమంది వినియోగదారులు చేరటం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీ-సేవ కమిషనర్ టి.రవి కిరణ్ మాట్లాడుతూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ప్రభుత్వం సాంకేతికత ద్వారా పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారుల అభివృద్దికి కృషి చేస్తోందన్నారు. మెటా సంస్థకు ఉన్న ప్రపంచస్థాయి డిజిటల్ అడ్వర్టైజింగ్ నైపుణ్యాన్ని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న మీ-సేవా కేంద్రాల నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా ఇప్పటివరకు డిజిటల్ మార్కెటింగ్‌కు దూరంగా ఉన్న చిన్న, గ్రామీణ వ్యాపారాలకు కూడా నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ వినూత్న భాగస్వామ్యంతో మీ-సేవా కేంద్రాలు ఇకపై కేవలం పౌర సేవలకే పరిమితం కాకుండా డిజిటల్ అడ్వర్టైజింగ్ హబ్‌లుగా రూపాంతరం చెంది చిన్న, మధ్య తరహా వ్యాపారాల అభివృద్ధికి తోడ్పడటంతో పాటు మీ సేవ కేంద్రాలను నడిపేవారికి కూడా అదనపు ఉపాధి, ఆదాయ అవకాశాలను కల్పిస్తూ రాష్ట్ర డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడనున్నాయి.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





