- ప్రజా ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులకే రక్షణ లేదు..
- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని, రేవంత్ రెడ్డి వెంటనే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యమని ఆయన ప్రశ్నించారు. గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ…హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని, తమ కార్యకర్తలను గృహ నిర్భంధం, అరెస్టులు చేశారని అన్నారు.
కానీ పైలెట్, ఎస్కార్ట్ ఇచ్చి తమ ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ వాళ్ళను దాడికి పంపారని, సిద్ధిపేటలో తన క్యాంపు కార్యాలయంపై దాడి జరిగిందని, ఖమ్మంలో వరద భాధితుల పరామర్శకు వెళ్తే తమపై దాడి చేశారని దుయ్యబట్టారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పింది అరికెపూడి గాంధీ కాదా…అంటూ ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేసి పోలీసులు ఏం చేస్తున్నారని, కౌశిక్ రెడ్డిపై దాడి రేవంత్ రెడ్డి చేయించారని హరీష్ రావు ఆరోపించారు. ఏసీపీ, సిఐను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడారని, పెట్టుబడులలకు స్వర్గధామంగా తీర్చదిద్దారని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలయిందని, ఇది రేవంత్ రెడ్డి వైఫల్యమని, రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నారంటూ హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఘటనలు చోటుచేసుకున్నాయని, తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్టపాలయిందని విమర్శించారు.
తమ సహనాన్ని చేతగాని తనంగా భావించవద్దని హరీష్ రావు హితవు పలికారు. తమకు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ముఖ్యమని తెలిపారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో స్పీకర్ స్పందించాలన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, మాటల్లో ప్రజా పాలన…రాహుల్ గాంధీ చేతుల్లో రాజ్యాంగం..కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మందలిస్తారా లేదా చెప్పాలని అన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దోపిడీ, మోసాలు, ఆరు గ్యారెంటీల గారడీని దేశం మొత్తం వివరిస్తామన్నారు. ఈ ఘటనపై సైబరాబాద్ సీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తారని హరీష్ రావు వెల్లడించారు.