సిపిఎం దిగ్గజనేత సీతారాం ఏచూరీ కన్నుమూత

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఎయిమ్స్‌లో కన్నుమూత
  • సంతాపం ప్రకటించిన సిపిఎం పాలిట్‌ ‌బ్యూరో
  • పిఎం సహా పలువురు ప్రముఖుల సంతాపం…

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి(72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ ‌కారణంగా దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన అక ప్రముఖుడు లేని లోటు తీర్చలేనిది. ఆయన మృతికి ప్రధాని మోది, రాహుల్‌ ‌గాంధీ, సిపిఎం పోలిట్‌ ‌బ్యూరో సహా పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా గుర్తింపు పొందిన ఏచూరి..1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 32 ఏళ్లుగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగు తున్న ఏచూరి 2015లో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2005 – 2017 వరకు బెంగాల్‌ ‌నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ఆయన పూర్తిపేరు ఏచూరి సీతారామరావు. 1952 ఆగస్టు 12 చెన్నైలో వైదేహి బ్రాహ్మణులైన సర్వేశ్వర సోమయాజులు ఏచూరి,కల్పకం దంపతులకు జన్మించారు.

 

తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఆంధప్రదేశ్‌ ‌స్టేట్‌ ‌రోడ్‌ ‌కార్పొరేషన్లో ఇంజినీర్‌గా పని చేశారు. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారిగా ఉండేవారు. ఏచూరి బాల్యం ఎక్కువగా హైదరాబాద్‌లోనే సాగింది. భాగ్యనగరంలోని అల్‌ ‌సెయింట్స్ ‌హైస్కూల్లో ఆయన మెట్రిక్యులేషన్‌ ‌పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్‌ ‌స్కూల్లో చేరారు. 1970లో సీబీఎస్సీ సెకండరీ పరీక్షలో ఆల్‌ ఇం‌డియా ర్యాంకర్‌గా నిలిచారు. సెయింట్‌ ‌స్టీఫెన్స్ ‌కాలేజీలో ఎకనామిక్స్‌లో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అనంతరం అక్కడే పీహెచ్డీ కోర్సులో చేరారు. అయితే అప్పటికే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించడం..ఏచూరీని అరెస్ట్ ‌చేయడంతో పీహెచ్‌డీని కొనసాగించలేకపోయారు. సీతారామ్‌ ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. ఆయన మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌ ‌కాగా.. జర్నలిస్టు సీమా చిత్తీ రెండో భార్య. ఏచూరి రెండో భార్య సీమా చిస్తీ జర్నలిస్టు. తన భార్య తనకు ఆర్థికంగా సహకరిస్తుందని ఏచూరి ఒకసారి చెప్పారు. మొదటి భార్యకి ఒక కుమార్తె, కుమారుడు సంతానం ఉండేది. అయితే కుమారుడు ఆశిష్‌.. 2021 ఏ‌ప్రిల్‌ 22‌న కొవిడ్‌తో మరణించారు. తప్పు జరిగితే సహించలేని మనస్థత్వం ఏచూరిది.

 

అందుకే చిన్నప్పటి నుంచే రాజకీయాల్లోకి రావాలనే కుతూహలం ఉండేది. విద్యార్థిగా ఉన్నప్పుడే ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ ‌నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది.1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు కమ్మూనిస్టు భావజాలానికి ఆకర్షితులై సీపీఎంలో చేరారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ బాధితుల్లో ఏచూరీ కూడా ఒకరు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన్ని పోలీసులు అరెస్ట్ ‌చేశారు. జేఎన్‌యూ విద్యార్థి సమాఖ్యకు ఏచూరి మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ ‌కారత్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్షాలకు కంచుకోటగా మార్చారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ ‌ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు.1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు.

 

1990లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, 2005లో వెస్ట్ ‌బెంగాల్‌ ‌నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేరళ విప్లవ సూర్యుడు వీఎస్‌ అచ్యుతానందన్‌కి ఏచూరి అత్యంత సన్నిహితుడు. ప్రజా సమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ.. ఎగువ సభలో సీతారామ్‌ ఏచూరి గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వం కోసం ’కామన్‌ ‌మినిమమ్‌ ‌పోగ్రామ్‌’ ‌ముసాయిదాను రూపొందించడం లో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంతోపాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు.

ఏచూరి పోరాటాలు స్ఫూర్తిమంతం
తెలుగు వారిలో ఆయనది ప్రత్యేక స్థానం
సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంతాప

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని, ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని సీఎం రేవంత్‌ ‌రెడి అన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఎదిగిన అతికొద్ది మంది తెలుగువారిలో ఏచూరి ప్రస్థానం ప్రత్యేకమైనదని అన్నారు. వామపక్ష యోధుడు సీతారామ్‌ ఏచూరి మరణం పట్ల తెలంగాణ రేవంత్‌ ‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కార్మిక లోకానికి లౌకిక వాదానికి తీరని లోటు
ఏచూరి మరణం పట్ల మాజీ సిఎం కెసిఆర్‌ ‌సంతాపం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.  సీపీఎం ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరి మృతి పట్ల కేసీఆర్‌ ‌సంతాపం తెలిపారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. విద్యార్థి నాయకుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, సీపీఎం ప్రధాన కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజాపక్షం వహించారంటూ ఆయన సేవలను స్మరించుకున్నారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page