కుల పంచాయితీ పేరుతో అమానుషం

– మ‌హిళ‌పై దారుణ హింసాకాండ‌
– చ‌ట్టానికి అతీతంగా వ్య‌వ‌హ‌రించిన కుల‌ పెద్ద‌లు
– సామాజిక మాధ్య‌మాల్లో వీడియోలు ప్ర‌చారం
– ఇప్ప‌టివ‌ర‌కు క‌లుగ‌జేసుకోని పోలీసులు
– స్వ‌యం ప్ర‌క‌టిత పెద్ద‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న ప్ర‌జ‌లు

ఇబ్రహీంపట్నం /కోరుట్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ సమీపంలో తమ సుఖాల కోసం, భవిష్యత్తు కోసం ఇద్దరు వ్యక్తులు తమ తమ కుటుంబాలను, పిల్లలను వదిలేసి వెళ్లారనే తీవ్ర ఆగ్రహంతో వారి ఆచూకీ కనుగొని బలవంతంగా గ్రామానికి రప్పించారు. పోలీసులకు అప్పగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన స్వయం ప్రకటిత పెద్దలు చ‌ట్టాన్ని పక్కనబెట్టి తామే న్యాయమూర్తుల్లా మారారు. ఊరవతల ఉన్న ‘పూదోట మల్లన్న గుట్ట’ పరిసర ప్రాంతాల్లో రచ్చబండను ఏర్పాటు చేసి స‌ద‌రు మహిళపై కుల పంచాయితీ పేరుతో అమానుషంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విచారణ పేరిట బాధితురాలు భయంతో బిగ్గరగా ఏడుస్తున్నా కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడుతున్నా అక్కడున్న కుల పెద్దల్లో గానీ, గుమిగూడిన జనాల్లో గానీ రవ్వంత కనికరం కూడా కలగలేదు. మహిళను బలవంతంగా వివస్త్రను చేసి, అత్యంత అమానుషంగా ఆమె జననాంగాల్లో కారంపొడి నింప‌డ‌మే కాక, తీవ్రమైన మంటను, గాయాన్ని కలిగించే జీడి గింజల రసాన్ని ఆమె మర్మాంగానికి పూసి అమానుషానికి పాల్ప‌డ్డారు. కుల పెద్దల అండ చూసుకుని సాటి కుల సంఘం మహిళలే ఒక బ్యాచ్‌గా ఏర్పడి ఈ దారుణాన్ని అమలు చేయడం, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఆమెను శారీరకంగా, మానసికంగా చిత్ర‌వ‌ధ‌ చేయడం సమాజపు నైతిక పతనానికి పరాకాష్టగా నిలిచింది. ఈ భయానక, అసభ్యకరమైన దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం వారి వికృత చేష్టలకు, అనాగరిక పోకడలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఓ వృద్ధుడు మహిళ, పురుషుడు ఇద్దరిపై సమానంగా వ్యవహరించాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తప్పు జరిగిందని భావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మహిళను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలించి పోలీసులు వాస్తవాలను వెలికి తీయాలి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *