ఆస్తమా.. అప్రమత్తతే రక్ష!

– ఇన్‌హేలర్లపై అపోహలు తొలగితేనే నియంత్రణ
– రేపు ‘వరల్డ్ ఆస్తమా డే’

=శిశువుల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ఉక్కిరిబిక్కిరి చేసే సమస్య ఆస్తమా. కాలుష్యం, అలర్జీలు, మారుతున్న జీవనశైలి కారణాలతో దేశంలో ఆస్థమా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆస్తమా పై అవగాహన కోసం ప్రత్యేక కథనం.

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : ఆస్తమా(ఉబ్బసం) దీర్ఘకాలిక సమస్యే అయినప్పటికీ సరైన చికిత్సతో నియంత్రణలో ఉంచవచ్చు. మన దేశంలో ఆస్థమాపై సరైన అవగాహన లేకపోవడం, ముఖ్యంగా ఇన్‌హేలర్లపై భయాలు ఇంకా పెద్ద సమస్యగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే ఈ ఏడాది ‘వరల్డ్ ఆస్తమా డే‘ ఆస్థమా బాధితులందరికీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇన్‌హేలర్లు అందించడం నేటికీ ఒక అత్యవసర అవసరం అనే సందేశాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్తమా ఎందుకు వస్తుంది.. దాన్ని ఎలా గుర్తించాలి.. ఎలా నియంత్రించుకోవాలి.. ఆధునిక చికిత్సలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే అంశాలను బంజారాహిల్స్‌లోని రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ టి.వివేక్ వివరించారు.

ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మందికిపైగా  ఆస్తమాతో బాధపడుతున్నట్లు అంచనా. 4.5 లక్షలకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచ ఆస్తమా కేసుల్లో భారత్ వాటా దాదాపు 13 శాతం. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో ఆస్థమా కారణంగా మరణాల రేటు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 20 శాతం మంది చిన్నారులు ఆస్తమా లక్షణాలతో బాధపడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, ధూళి, ట్రాఫిక్, జీవనశైలి మార్పుల కారణంగా కేసులు మరింత పెరుగుతున్నాయి.
ఆస్తమా అంటే..
ఆస్తమా అనేది ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి. దుమ్ము, ధూళి, చల్లని గాలి, పొగ వంటి వాటి ప్రభావంతో గాలిగొట్టాలు అతిగా స్పందిస్తాయి. అలర్జీ లేదా ఇతర ప్రేరక కారణాల వల్ల గాలిగొట్టాల్లో వాపు ఏర్పడి శ్వాస మార్గం ఇరుకు అవుతుంది. అదే సమయంలో జిగురు ద్రవం (శ్లేష్మం) అధికంగా ఉత్పత్తి కావడంతో శ్వాస తీసుకోవడం, వదలడం కష్టమవుతుంది. ఫలితంగా దగ్గు, ఆయాసం, ఛాతీ బిగుసుకుపోవడం, గొంతులో పిల్లికూతల మాదిరిగా శబ్దం (వీజింగ్) రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కారణాలివే..
వంశపారంపర్యం, దుమ్ము, ధూళి, బూజు, వాతావరణ కాలుష్యం, సిగరెట్ పొగ, అలర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్లు, చల్లని వాతావరణం, మానసిక ఒత్తిడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, కొన్ని రకాల సువాసనలు, రసాయనాలు.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
తరచూ దగ్గు రావడం, రాత్రిళ్లు, తెల్లవారుజామున దగ్గు ఎక్కువ కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసం. ఛాతీ బిగుసుకుపోయినట్లు అనిపించడం, గొంతులో పిల్లికూతల మాదిరిగా శబ్దం రావడం, వ్యాయామం చేసినప్పుడు ఊపిరి ఆడకపోవడం, అలసట, నిద్రలేమి.
నిర్ధారణ ఎలా?
ఆస్తమాను నిర్ధారించేందుకు వైద్యులు కొన్ని పరీక్షలు సూచిస్తారు. వాటిలో స్పైరోమెట్రీ, పీక్ ఫ్లో మీటర్ పరీక్ష, అలర్జీ పరీక్షలు, ఛాతీ ఎక్స్-రే, ఫీనో (FeNO) పరీక్ష, వ్యాయామ పరీక్ష, రక్త పరీక్షలు, స్పుటం పరీక్ష
ఇన్‌హేలర్లపై భయాలు వద్దు
ఆస్తమా శాశ్వతంగా నయం కాకపోయినా సరైన చికిత్సతో నియంత్రణలో ఉంచుకోవచ్చు.ఆస్తమా నియంత్రణలో ఇన్‌హేలర్లు కీలక పాత్ర పోషిస్తాయి. చాలామంది ఇన్‌హేలర్లకు అలవాటు పడిపోతామని భావిస్తారు. కానీ అది  అపోహ మాత్రమే. ఇన్‌హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్ గాలి గొట్టాల్లోని వాపును నేరుగా తగ్గించి శ్వాస తీసుకోవడం సులభం అయ్యేలా చేస్తాయి. వైద్యులు సూచించిన విధంగా వాడితే ఆస్తమాను అదుపులో ఉంచడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. చికిత్సలో భాగంగా ఇన్‌హేలర్లు, నెబ్యులైజేషన్, యాంటీ అలర్జీ మందులు, శ్వాసాభ్యాసాలు, జీవనశైలి మార్పులు అవసరం. ఇన్‌హేలర్లే ఎందుకు ప్రభావవంతం అంటే మందు నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. త్వరగా ఉపశమనం లభిస్తుంది. దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కాలుష్య ప్రాంతాల్లో మాస్క్ వాడాలి
చల్లని గాలిలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలర్జీ కలిగించే పదార్థాలను నివారించాలి. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఇన్‌హేలర్లను సరైన పద్ధతిలో వినియోగించాలి.
 సాధారణ జీవితం సాధ్యమే
ఆస్తమా ఉందని భయపడాల్సిన అవసరం లేదు. సరైన చికిత్స, అవగాహన, జాగ్రత్తలతో సాధారణ జీవితం గడపవచ్చు. తరచూ దగ్గు లేదా శ్వాస ఇబ్బందిని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి వైద్యులను సంప్రదించాలి. క్రమం తప్పకుండా మందులు వాడటం, వైద్యుల సూచనలు పాటించడం ద్వారా అత్యవసర పరిస్థితులను చాలావరకు నివారించవచ్చు.

– డాక్టర్ టి.వివేక్                       
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.

——————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *