– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక, నియంతృత్వ పాలన సాగిస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండలో దాడికి గురైన బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎమ్మెల్యేలు మరియు ఇతర సీనియర్ నాయకులను హౌజ్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీజేపీని చూసి భయపడుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా అధ్యక్షుడి నివాసంపైనా, బీజేపీ రాష్ట్ర కార్యాలయంపైనా దాడులు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోకుండా బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా ప్రజల సమస్యలపై, బాధితుల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుందని, కాంగ్రెస్ అహంకార పూరిత వైఖరికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





