– బాధిత కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ
కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: తుక్కుగూడలో దారుణ హత్యాచారానికి గురైన నర్సు ఉకే శిరీష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలోని శిరీష స్వగ్రామానికి వెళ్లిన మంత్రి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, మహిళా కమిషన్ సభ్యురాలు నునావత్ రాధాబాయితో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు స్వయంగా వచ్చినట్లు మంత్రి సీతక్క తెలిపారు. నిందితుడిని పోలీసులు వేగంగా అరెస్టు చేశారని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పేద ఆదివాసీ కుటుంబానికి చెందిన శిరీష నర్సుగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న సమయంలో ఇలాంటి దారుణం జరగడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక సాయం, పునరావాస హామీలు
బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.5 లక్షల చెక్కుతోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.లక్ష, ఐటీడీఏ నుంచి రూ.30 వేలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక తాను, ఎమ్మెల్యే ఆదినారాయణ కలిసి వ్యక్తిగతంగా రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశామన్నారు. బాధితులకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పరిహారంతోపాటు ఇందిరమ్మ ఇల్లు, సాగుభూమి, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగరాలకు వచ్చే గ్రామీణ, ఆదివాసీ యువతుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడతామని, అత్యవసర సాయం కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటునూ పరిశీలిస్తామని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





