‘శుద్ధీకరణ’ పేరిట దళిత ఆత్మగౌరవంపై దాడి

– ఉత్తరాఖండ్ ఘటనపై మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను శుద్ధి చేయడం కోట్లాది దళితుల ఆత్మగౌరవంపై జరిగిన ఘోర దాడి అని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఖర్గే ప్రసంగించిన వేదికపై శ్రీరామ్ సేన సభ్యులు ‘శుద్ధీకరణ’ నిర్వహించడాన్ని అంటరానితనానికి మరో రూపంగా అభివర్ణిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై ఉత్తమ్ మండిపడ్డారు. తప్పు చేసిన వారిని పక్కన పెట్టి సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించిన రాహుల్‌పై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని తలకిందులు చేయడమేనని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నది కాంగ్రెస్-బీజేపీల మధ్య అధికార పోరాటం కాదని, రాజ్యాంగ సమానత్వానికి, సామాజిక వివక్షకు మధ్య జరుగుతున్న సైద్ధాంతిక సంగ్రామమని మంత్రి అభివర్ణించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను భయపెట్టేందుకు వ్యవస్థలను రాజకీయ ఆయుధాలుగా వాడుతున్నారని ఆరోపించారు. ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం సాగిస్తున్న పోరాటాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. వేదికలను కాదు, సమాజంలో ఇంకా మిగిలి ఉన్న వివక్షాపూరిత మనస్తత్వాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *