– కేసీఆర్ సరేనంటే ఎంత సమయమైనా కేటాయిస్తాం
– ఆయన వాదన సరైనదయితే ప్రాజెక్ట్ నిర్వహణ అప్పగిస్తాం
– కాళేశ్వరం కషన్ల ప్రాజెక్ట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి
– నిపుణుల సలహాలు పక్కన పెట్టడంతోనే సమస్యలు
– కేటీఆర్, హరీష్ రావులు ఆర్థిక ఉగ్రవాదులని విమర్శలు
– పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో రేవంత్ విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుపై మాజీ సీఎం కేసీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ ఎప్పుడు లెటర్ రాస్తే అప్పుడే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెడదామని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎంత సమయం మాట్లాడాలనుకుంటే అంత సమయం ఇస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ కేసీఆర్ వాదనలో బలముందని రుజువైతే రాబోయే మూడేళ్లపాటు కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ల బాధ్యతను, మేజర్ కాంట్రాక్ట్‌ను కేసీఆర్‌కే అప్పగిస్తామని.. ఆయన ఇష్టం వచ్చిన వాళ్లకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చంటూ సంచలన సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌లను ’ఆర్థిక ఉగ్రవాదులుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ కట్టిన ఇతర ప్రాజెక్టులను, ప్రజాభవన్, సెక్రటేరియట్లను తాము వాడుతున్నామని, కానీ, కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్లే అది నిరుపయోగంగా మారిందని మండిపడ్డారు. ప్రస్తుతానికి బ్యారేజీల్లో నీళ్లు నింపి ఎత్తిపోయాలని ఏ ఎక్స్‌పర్ట్స్ కమిటీ కూడా చెప్పలేదని రేవంత్ గుర్తుచేశారు. ఒకవేళ బలవంతంగా నీళ్లు నింపితే బ్యారేజీలు పూర్తిగా కూలిపోతాయని, భద్రాచలం నగరం మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకుండానే తాము అధికారంలోకి వచ్చాక వేల కోట్ల అప్పులు కట్టాల్సి వచ్చిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణుల కంటే ఎవరు మంచి సలహాలు ఇచ్చినా తీసుకుంటామని, కేసీఆర్ చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష పడకూడదని అన్నారు. ప్రజా సొమ్ము గోదారి పాలు కాకుండా కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా కాళేశ్వరంపై ఆనాడే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ అభ్యంతరం తెలిపిందని తెలిపారు. కమిటీ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టారని పేర్కొన్నారు. తనకు నచ్చినట్లు రిపోర్టు వచ్చేలా బాధ్యతలను వ్యాప్కోస్‌కు అప్పగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. రూ.38 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టును రూ.లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. నివేదిక మారినా ఆయకట్టు ఏ మాత్రం మారలేదన్నారు. ప్రాజెక్టుపై కొన్ని అపోహలను ప్రతిపక్షం సృష్టించిందని, అవి తప్పని అన్ని ఆధారాలతో సహా చూపించామన్నారు. ఈ మేరకు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ నివేదికను ప్రజల ముందుంచామని రేవంత్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఆనాడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును తలపెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి ద్వారా తాగు, సాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుగా ఆనాడు నామకరణం చేశారని, 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. అయితే, మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతాయని అభ్యంతరాలు వచ్చాయని, ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నీటిని తరలించాలని ఆనాడే వైఎస్‌ఆర్, కాంగ్రెస్ కృషి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కషన్ల కోసం కేసీఆర్ ప్రాజెక్టు రీడిజైన్ చేశారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదని, మానిప్యులేటర్లని రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. అబద్దాలతో మభ్యపెట్టడమే వారిద్దరి నైపుణ్యమని ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడంలో వారికి వారే సాటి అని మండిపడ్డారు. ప్రాజెక్టు అంచనా రూ.1.47 లక్షల కోట్లకు చేరిందని కాగ్ తెలిపిందన్నారు. అబద్దాల రావుల మాటలను నాటి గవర్నర్ నమ్మారని రేవంత్ చెప్పారు. డబ్బులు కొల్లగొట్టాలన్న ఆశతో ప్రాజెక్టును ప్రారంభించారని ధ్వజమెత్తారు. పక్క రాష్టాల్ర ముఖ్యమంత్రులను తీసుకొచ్చి యజ్ఞాలు చేశారని విమర్శించారు. కట్టిన ఏడాదిలోపే మేడిగడ్డ కుంగిపోయిందని, నాటి ప్రాజెక్టు ఏఈనే లోపాలను బయటపెట్టారన్నారు. సమస్యను గుర్తించకపోవడం వల్లే కూలిపోయిందని, 2022లో వరదలకు కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోయిందన్నారు. 2023 అక్టోబర్‌లో ఆరు పిల్లర్లు కూలిపోయాయని, బ్యారేజీలు, డ్యామ్‌లు కడితే 25 శాతం చొప్పున నింపుతారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. కేసీఆర్ మాత్రం కట్టిన ఏడాదికే బ్యారేజీలను నింపేశారన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద ఆయకట్టే లేదని, మేడిగడ్డను చూపించి బంగాళాఖాతాన్ని తెచ్చినట్టు చేశారన్నారు. నీళ్లు నింపడం వల్ల బ్యారేజీలపై ఒత్తిడి ఎక్కువైందని, ఇసుక మీదనే బ్యారేజీలు కట్టడం వల్ల ప్రాజెక్టు కుంగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





