“ఆంతర్ రాష్ట్ర జల వివాదాల్లో ఒకటి రెండు అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఇరకాటంలో పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేయి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన 1480 టియంసిల్లో తెలంగాణ చెబుతున్నట్లు 968టియంసిలుగానూ ఆంధ్ర ప్రదేశ్ వాటా 516 టియంసిలుగా కేంద్ర జల సంఘం ప్రతి పాదించినది. పైగా ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికీ పట్టుబడుతున్న కొత్త ట్రిబ్యునల్ అవసరం లేదని కేంద్రం జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అంత వరకైతే ఫర్వాలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం బనకచర్ల అనుసంధానానికి చెందిన ప్రతిపాదనలను కేంద్ర జల శక్తి శాఖకు చెందిన నిపుణులు కమిటీ (ఈఎసి) తిప్పి పంపంది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా వుందని భాగస్వామ్య రాష్ట్రాలు అభ్యంతరం పెట్టాయని అందుకు నోట్ పెట్టింది..”
ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర జల వివాదాలు తిరిగి ఉప్పునిప్పుగా తయారయ్యే పరిస్థితులు రూపు దిద్దుకొంటున్నాయి. బిఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఇంత వరకు నిర్దిష్టంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు లొంగి పోయిన సందర్భం లేదు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి ఎత్తిపోతలను మొదలు పెడితే ఇరువురు మధ్య ఈ ఉద్రిక్తతత కొంత మేర తగ్గి పోతుంధి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వైషమ్యాలకన్నా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ మధ్య ఉప్పునిప్పుగా వుంది.ఆంతర్ రాష్ట్ర జల వివాదాల్లో ఒకటి రెండు అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఇరకాటంలో పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేయి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన 1480 టియంసిల్లో తెలంగాణ చెబుతున్నట్లు 968టియంసిలుగానూ ఆంధ్ర ప్రదేశ్ వాటా 516 టియంసిలుగా కేంద్ర జల సంఘం ప్రతి పాదించినది. పైగా ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికీ పట్టుబడుతున్న కొత్త ట్రిబ్యునల్ అవసరం లేదని కేంద్రం జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అంత వరకైతే ఫర్వాలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం బనకచర్ల అనుసంధానానికి చెందిన ప్రతిపాదనలను కేంద్ర జల శక్తి శాఖకు చెందిన నిపుణులు కమిటీ (ఈఎసి) తిప్పి పంపంది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా వుందని భాగస్వామ్య రాష్ట్రాలు అభ్యంతరం పెట్టాయని అందుకు నోట్ పెట్టింది.
ఈ పరిణామాలతో దిమ్మె తిరిగిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తోచని స్థితిలో ఈ నెల 18 వతేదీ జరిగే గోదావరి యాజమాన్య బోర్డు సమావేశం ఎజెండాలో గతంలో కేంద్ర ప్రభుత్వ వివిధ సంస్థలు తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టుల ఇచ్చిన అనుమతులు తిరిగి సమీక్షించాలనే అంశాన్ని చేర్పింది. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వుండటం గమనార్హం. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేపు నుండి స్పందన లేదు. అయితే బోర్డు సమావేశంలో గట్టిగా వ్యతిరేకించ వచ్చు. లేదా సమావేశాన్ని బహిష్కరించ వచ్చు.
ఈ లోపు బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు , కార్యనిర్వహక అధ్యక్షులు కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీకి జలాలు సాధించడం తప్ప మరో ముఖ్యమైన అంశం లేదన్నారు. కెసిఆర్ ఎంతో శ్రమ పడి సాధించిన అనుమతులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయించాలని చూస్తున్నదని 18 వతేదీ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరించాలని లేకుంటే ఆ రోజు జలసౌధను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. గత వారం రోజులుగా బిఆర్ఎస్ పార్టీ నేతలు ఈ అంశంపై చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఇర్రిగేషన్ మంత్రి గాని పట్టించుకోవడం లేదు. 18 జరుగనున్న సమావేశం ముందుగా ప్రభుత్వ నిర్ణయం వెల్లడి కావచ్చు.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రదేశ్ ను ఇరుకున పెడుతూ ఎజెండాలో పలు అంశాలు చేర్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుండి ఎత్తిపోతలు పథకాలను చేపట్టిందని వీటిని నిలుపుదల చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేసింది. 2025 కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు డిజైన్ లకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పురుషోత్తం పట్నం పట్టి సీమ చింతలపూడి ఎత్తిపోతలు పథకాలున్నాయని వాటి సమాచారం బోర్డుకు ఇవ్వలేదని ఎజెండా చేర్పింది. బిఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నట్లు బోర్డు సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహిష్కరీంచడం తక్కువ అవకాశాలు వున్నాయి. ఎందుకంటే బోర్డు సమావేశంలో ఇంకా కీలక మైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో ఈ అంశమే కాకుండా చాల ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా గోదావరి నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయో సర్వే చేయించాలని యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకొని కేంద్ర జల శక్తి శాఖను అనుమతి కోసం కోరింది. నదీ లోయ లోని.భాగస్వామ్య రాష్ట్రలన్నింటితో నీటి లభ్యత అంచనాకు సాంకేతిక కమిటీ ఒకటి నియమించాలని నిర్ణయింది. అంతే కాకుండా ఈ లోపు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో మరొక కమిటీ వేసి 75 శాతం నీటి లభ్యత కింద అంఛనా వేయించాలని నిర్ణయింది.ఈ పూర్వ రంగంలో బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు సమావేశాన్ని బహిష్కరించితే తెలంగాణ కూడా ఎంతో కొంత నష్ట పోక తప్పదు.
ట్రిబ్యునల్ తీర్పు తో సంబంధం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ పై ఒత్తిడి తెచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పథకానికి నిరభ్యంతర పత్రం పొంది కేంద్ర జల సంఘం వద్ద డిపిఆర్ ఆమోదం పొందాలని తీవ్ర ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలవరం బనకచర్ల అనుసంధాన పథకం తిరిగి వచ్చినందున ఈ ప్రయత్నాలకు గండి పడింది. తీరా ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ఈ వైఫల్యమంతా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాద్ దాస్ పై పడింది. సలహాదారు తప్పుడు సలహాలతో ఇలా జరిగిందని బిఆర్ఎస్ పార్టీ దండెత్తింది. పైగా ఆంధ్ర ప్రదేశ్ కు లింక్ బెట్టి గత కొంత కాలంగా ఆరోపణలు చేసే వారు. ఇప్పుడు మరీ ముమ్మరం చేశారు.





