ఆగస్ట్ 11 నాటికి అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ప్రతిష్టంభనలో ఉండటంతో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువైంది. జూలై ప్రారంభంలోని కనిష్ఠ స్థాయితో పోలిస్తే చమురు ధర దాదాపు 25 శాతం పెరిగిందని తాజా మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి. ఇక్కడే ఈ యుద్ధంలోని ఆర్థిక వైరుధ్యం కనిపిస్తుంది. అమెరికా ఇరాన్‌ను సైనికంగా, ఆర్థికంగా బలహీనపరచాలని ప్రయత్నిస్తుంటే, ఆ పోరాటం వల్ల పెరుగుతున్న ఇంధన ధరల రూపంలో అమెరికా వినియోగదారుడే మూల్యం చెల్లించాల్సి వొస్తున్నది. .”
యుద్ధంలో విజయం అంటే ప్రత్యర్థి సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం, గగనతల ఆధిపత్యం సాధించడం, ఆయుధ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మాత్రమే కాదు. ఆధునిక ప్రపంచంలో ఒక దేశం యుద్ధాన్ని ఎంతకాలం ఆర్థికంగా భరించగలదన్నదీ విజయానికి ప్రధాన ప్రమాణంగా మారింది. ఈ కోణంలో చూస్తే ఇరాన్‌తో సాగుతున్న ఘర్షణలో అమెరికా కొన్ని సైనిక పోరాటాల్లో పైచేయి సాధించినా, దీర్ఘకాలంలో అది ఒక ప్రమాదకరమైన ఆర్థిక యుద్ధంలో చిక్కుకుంటోందా? అన్న ప్రశ్న మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఆగస్ట్ 11 నాటికి అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ప్రయత్నాలు ప్రతిష్టంభనలో ఉండటంతో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్లకు చేరువైంది. జూలై ప్రారంభంలోని కనిష్ఠ స్థాయితో పోలిస్తే చమురు ధర దాదాపు 25 శాతం పెరిగిందని తాజా మార్కెట్ నివేదికలు సూచిస్తున్నాయి. ఇక్కడే ఈ యుద్ధంలోని ఆర్థిక వైరుధ్యం కనిపిస్తుంది. అమెరికా ఇరాన్‌ను సైనికంగా, ఆర్థికంగా బలహీనపరచాలని ప్రయత్నిస్తుంటే, ఆ పోరాటం వల్ల పెరుగుతున్న ఇంధన ధరల రూపంలో అమెరికా వినియోగదారుడే మూల్యం చెల్లించాల్సి వొస్తున్నది .
ఇరాన్ ఆయుధం—చమురు మార్కెట్
సంప్రదాయ సైనిక బలంలో అమెరికాతో ఇరాన్‌ను పోల్చడం కష్టం. కానీ ఇరాన్‌కు ఉన్న అత్యంత కీలకమైన వ్యూహాత్మక శక్తి భౌగోళిక స్థానం. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు చమురు, గ్యాస్ రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఏర్పడే ప్రతి అంతరాయం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తుంది.
అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా హోర్ముజ్ ద్వారా చమురు రవాణాలో అంతరాయాలు ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపగలవని గుర్తించింది. అయితే అధిక ధరల కారణంగా ప్రపంచ చమురు డిమాండ్ తగ్గడం కొంతవరకు ధరల పెరుగుదలను నియంత్రించవొచ్చని అమెరికా ఇంధన వనరుల శాఖ జూన్‌లో అంచనా వేసింది. అంటే ఇరాన్‌కు అమెరికాను సైనికంగా ఓడించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉండకపోవొచ్చు. యుద్ధాన్ని పొడిగించడం, చమురు సరఫరాపై అనిశ్చితిని కొనసాగించడం, రవాణా–బీమా వ్యయాలను పెంచడం ద్వారా అమెరికా సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచగలిగితే చాలు. ఇది ఒకరకమైనఅసమాన ఆర్థిక యుద్ధ వ్యూహం.
అమెరికా బలమైన దేశమే… కానీ అప్పుల భారంతో
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యంత శక్తివంతమైన సైన్యం, ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అయిన డాలర్—ఇవన్నీ అమెరికాకు అసాధారణమైన ఆర్థిక సామర్థ్యాన్ని ఇస్తాయి. అందువల్ల అమెరికా తక్షణమే ఆర్థికంగా కుప్పకూలుతుందని భావించడం వాస్తవికం కాదు.కానీ సమస్య అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో కాదు; ఇప్పటికే దానిపై ఉన్న భారంలో ఉంది.
కంగ్రేషనల్ బుడ్జెట్ ఆఫీసు- Congressional Budget Office (సీబీఓ) అంచనాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడరల్ బడ్జెట్ లోటు సుమారు 1.9 ట్రిలియన్ డాలర్లు, అంటే జీడీపీ లో 5.8 శాతం. ప్రజల చేతుల్లో ఉన్న ఫెడరల్ రుణం జీడీపీ లో సుమారు 101 శాతంకు చేరుతోంది. అంతేకాదు, 2026లో ప్రభుత్వ నికర వడ్డీ చెల్లింపులే సుమారుఒక ట్రిలియన్ డాలర్లు ఉండవచ్చని సీబీఓ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితిలో దీర్ఘకాలిక యుద్ధం అదనపు సైనిక వ్యయాన్ని మాత్రమే కాదు, ప్రభుత్వ రుణభారం, ఆయుధాల పునఃనిర్మాణం, ప్రాంతీయ సైనిక మోహరింపులు, మిత్రదేశాల రక్షణ వంటి పరోక్ష ఖర్చులను కూడా పెంచుతుంది.అందుకే ప్రశ్న “అమెరికా యుద్ధానికి డబ్బు ఖర్చు చేయగలదా?” అన్నది కాదు. ఖచ్చితంగా చేయగలదు. అసలు ప్రశ్న—ఎంతకాలం, ఎలాంటి ఆర్థిక పరిణామాలను భరిస్తూ చేయగలదు?
చమురు ధర నుంచి ద్రవ్యోల్బణం వరకు
యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రధాన మార్గం ఇంధనం. చమురు ధర పెరిగితే పెట్రోలు, డీజిల్ మాత్రమే ఖరీదవవు. ట్రక్కుల రవాణా వ్యయం పెరుగుతుంది. విమానయానం ఖరీదవుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, పారిశ్రామిక ఉత్పత్తి, ప్లాస్టిక్స్, రసాయనాలు, ఎరువులు—అనేక రంగాల్లో వ్యయం పెరుగుతుంది. చివరకు ఆ భారం వినియోగదారుడి మీద పడుతుంది. దీంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుతం మార్కెట్లు కూడా ఇరాన్ సంక్షోభం వల్ల చమురు ధరలు, ద్రవ్యోల్బణం, అమెరికా వడ్డీరేట్లపై ఏర్పడుతున్న ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.
ఇక్కడ అమెరికాకు మరో చిక్కు ఎదురవుతుంది. ఆర్థిక వృద్ధి మందగిస్తున్న సమయంలో ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే ఫెడరల్ రిజర్వ్ కు వడ్డీరేట్లు తగ్గించడం కష్టమవుతుంది. అధిక వడ్డీరేట్లు కొనసాగితే గృహ రుణాలు, కార్పొరేట్ రుణాలు, ప్రభుత్వ రుణంపై వడ్డీ భారం పెరుగుతుంది.అంటే యుద్ధ ప్రభావం ఒక గొలుసులా సాగుతుంది:యుద్ధం → చమురు ధరలు → ద్రవ్యోల్బణం →అధిక వడ్డీరేట్లు → మందగించే పెట్టుబడులు, వినియోగం → పెరిగే ప్రభుత్వ వడ్డీ భారం.
ఇరాన్‌కు నష్టం లేదా? అపారమే!
ఇక్కడ మరో వాస్తవాన్ని విస్మరించకూడదు. ఆర్థిక యుద్ధంలో అమెరికానే నష్టపోతోందని చెప్పడం అతిశయోక్తి అవుతుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం, ఆంక్షలు, చమురు ఎగుమతుల అంతరాయాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. తాజా నివేదికలు ఇరాన్‌లో అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం, ఉత్పత్తి–ఉపాధి నష్టాలను సూచిస్తున్నాయి.అందువల్ల ఇది “ఇరాన్ గెలుస్తోంది–అమెరికా ఓడుతోంది” అనే సరళమైన సమీకరణ కాదు. బదులుగా ఎవరు ఎక్కువకాలం నష్టాన్ని భరించగలరు? ఎవరి రాజకీయ వ్యవస్థ ముందుగా ఒత్తిడికి లోనవుతుంది? అన్నదే అసలు పోటీ.
నిరంకుశ వ్యవస్థలు ప్రజలపై ఆర్థిక భారాన్ని ఎక్కువకాలం మోపగలవు. ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రం పెట్రోలు ధర నుంచి ఉద్యోగాల వరకు ప్రతి ఆర్థిక సమస్య ఎన్నికల రాజకీయాల్లో వెంటనే ప్రభావం చూపుతుంది . అందువల్ల అమెరికాకు యుద్ధభూమిలో సైనిక విజయం సాధించడం కంటే, దేశీయంగా యుద్ధానికి రాజకీయ–ఆర్థిక మద్దతును నిలబెట్టుకోవడం కష్టమైన పరీక్ష కావచ్చు.
అమెరికా ‘ఓవర్‌స్ట్రెచ్’ సమస్య
అమెరికా ఇరాన్‌తో మాత్రమే వ్యవహరించడం లేదు. యూరప్ భద్రత, ఇండో–పసిఫిక్‌లో చైనా, తైవాన్ భద్రత, మధ్యప్రాచ్యంలో మిత్రదేశాలు, ప్రపంచవ్యాప్తంగా సైనిక స్థావరాలు—అమెరికా వ్యూహాత్మక బాధ్యతలు ఇప్పటికే విస్తృతంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మరో దీర్ఘకాలిక మధ్యప్రాచ్య యుద్ధం అమెరికా సైనిక వనరులతో పాటు ఆర్థిక వనరులను కూడా విస్తృతంగా వినియోగిస్తుంది. చరిత్రలో మహాశక్తుల బలహీనత చాలాసార్లు ఒకే యుద్ధంలో ఓటమి వల్ల రాలేదు. తమ ఆర్థిక సామర్థ్యానికి మించి ప్రపంచవ్యాప్తంగా బాధ్యతలను విస్తరించుకోవడం—సామ్రాజ్యవిస్తరణ ఆకాంక్ష —వారి శక్తిని క్రమంగా క్షీణింపజేసింది.అమెరికా విషయంలో ఇప్పుడే అలాంటి ముగింపు వచ్చిందని చెప్పడంతొందరపాటు. కానీ హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయలేం.
యుద్ధంలో గెలిచి… శాంతిలో ఓడిపోవొచ్చా?
అంతిమంగా ఇరాన్ యుద్ధం ప్రాధాన్యం ఎన్ని క్షిపణులు కూల్చారు, ఎన్ని స్థావరాలు ధ్వంసమయ్యాయి అనే గణాంకాల్లో ఉండకపోవొచ్చు. ప్రపంచ చమురు మార్కెట్, అమెరికా ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, ప్రభుత్వ రుణం, డాలర్‌పై విశ్వాసం, మిత్రదేశాల రాజకీయ సహనం—వీటిపై ఈ యుద్ధం ఎంతకాలం ప్రభావం చూపుతుందన్నదే నిర్ణాయకం కావొచ్చు. అమెరికా వద్ద ఇరాన్ కంటే అనేక రెట్లు అధిక సైనిక, ఆర్థిక వనరులు ఉన్నాయి. కానీ మహాశక్తులకు అసలు ప్రమాదం సాధారణంగా వనరులు లేకపోవడం కాదు—తమ అపారమైన వనరులను అపరిమితమైనవిగా భావించడం.
అందుకే ఇరాన్ యుద్ధం నుంచి ఉద్భవిస్తున్న అసలు ప్రశ్న ఇదే: అమెరికా యుద్ధభూమిలో విజయాలు సాధిస్తూ, అదే సమయంలో తన ఆర్థిక ఆధిపత్యానికి పునాదులైన తక్కువ ద్రవ్యోల్బణం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, నియంత్రిత రుణభారం, ప్రపంచ విశ్వాసాన్ని క్రమంగా బలహీనపరుచుకుంటోందా?ఈ యుద్ధానికి చరిత్ర ఇచ్చే తీర్పు బహుశా యుద్ధభూమిలో రాయకపోవొవచ్చు. పెట్రోలు బంకుల్లో, బాండ్ మార్కెట్లలో, వ డ్డీరేట్లలో, ప్రభుత్వ బడ్జెట్‌లో—చివరకు అమెరికా వోటర్ల జేబుల్లో నిక్షిప్తం కావొచ్చు.
-హసీనా





