– ఆదర్శంగా నిలిచిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : న్యాయస్థానాలు, చట్టం పట్ల అపారమైన గౌరవాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చాటుకుని ఆదర్శంగా నిలిచారు. నాటి కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు(రాఘవ) వేధింపుల కారణంగా నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణ కుమార్తె సాహితిని కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్‌లో పరామర్శించేందుకు భట్టి విక్రమార్క వెళ్లారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై నమోదు చేసిన కేసులో భట్టి విక్రమార్క నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు (ఎక్సైజ్ కేసెస్) విచారణ నిమిత్తం గురువారం హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఒక సాధారణ పౌరుడిలా ఆయన కోర్టుకు హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాత పాల్వంచకు చెందిన మీసేవ కేంద్ర నిర్వాహకుడు నాగ రామకృష్ణ(45) తల్లి, సోదరితో ఉన్న ఆస్తి వివాదాన్ని పరిష్కరించే నెపంతో నా భార్య శ్రీలక్ష్మి(40)ని తన వద్దకు పంపాలని రాఘవ కోరినట్లు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు విడుదల చేసిన సూసైడ్ సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమయ్యారు. మానప్రాణాలకు భంగం వాటిల్లడంతో వేరే మార్గం లేక రామకృష్ణ 2022 జనవరి 3 అర్ధరాత్రి దాటిన తర్వాత భార్య శ్రీలక్ష్మి, కవల కుమార్తెలు సాహిత్య(13), సాహితి(13)లపై పెట్రోల్ పోసి గ్యాస్ లీక్ చేసి నిప్పు అంటించారు. ఈ ఘటనలో రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య అక్కడికక్కడే మృతిచెందారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సాహితి కూడా చనిపోయింది. అంతకుముందు ఆమెను పరామర్శించేందుకు నాటి సీఎల్పీ నేతగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కాంగ్రెస్ నేత ఎడవెల్లి కృష్ణలతో కలిసి 2022 జనవరి 4న కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లగా ఆ సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ బందోబస్తు విధుల్లో ఉన్న బ్లూకోల్ట్ కానిస్టేబుల్ నాగేశ్వర్‌రావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు భట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





