బీఆర్‌ఎస్ అవినీతి దాహానికి బలైన కాళేశ్వరం

– వినియోగంలోకి రాకముందే కూలిన ఏకైక ప్రాజెక్టు
– ‘పల్లె పల్లెకు సీతక్క’లో భాగంగా ములుగు నియోజకవర్గంలో పర్యటన

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 6 : బీఆర్‌ఎస్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. పల్లె పల్లెకు సీతక్క కార్యక్రమంలో భాగంగా ములుగు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆమె శుక్రవారం పర్యటించారు. తొలుత రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాలకు చేరుకున్న మంత్రికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పలు గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించిన మంత్రి ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతి కారణంగానే నిర్మాణం పూర్తయిన కొద్ది కాలానికే బ్యారేజీ దెబ్బతిన్నదని విమర్శించారు. రూ.లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు పరిస్థితి నేడు ఎలా ఉందో ప్రజలకు తెలుసన్నారు. కాళేశ్వరంబీళి రాజకీయాలు చేయడం మాని వాస్తవాలను బీఆర్‌ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరం వద్ద నీటిని నిల్వ చేస్తే ప్రమాదం ఉందని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అధికారులు సూచించారని మంత్రి తెలిపారు. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం ప్రాంతాలతోపాటు పినపాక, భద్రాద్రి ప్రాంతాలకు వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్న అధికారుల హెచ్చరికల నేపథ్యంలోనే నీటి నిల్వ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. గోదావరి జలాలు వృథా కాకుండా వివిధ మార్గాల ద్వారా అవసరమైన ప్రాంతాలకు తరలిస్తున్నామని సీతక్క తెలిపారు. దేవాదుల, తుపాకులగూడెం ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకునే చర్యలు చేపడుతున్నామని, నీటి ప్రవాహం అధికంగా ఉన్నప్పుడు సీతారామ ప్రాజెక్టులో నీటిని నింపుతూ అవసరమైన విధంగా వినియోగిస్తున్నామని చెప్పారు. రామప్ప చెరువును నింపడంతోపాటు, అక్కడినుంచి పరిసర మండలాలకు నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో తాగు, సాగునీటి అవసరాలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. గోదావరిలో లభ్యమయ్యే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి రైతులకు, ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. నీటి నిర్వహణకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. దేశంలోని అనేక ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇది ప్రకృతిలో వచ్చిన మార్పుల ఫలితమని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులు, పేదలకు అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు, ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని సీతక్క తెలిపారు. సన్న వడ్ల సాగు విషయంలో గతంలో బీఆర్‌ఎస్ అనేక విమర్శలు చేసినప్పటికీ నేడు సన్న బియ్యాన్ని ప్రజలకు అందించే స్థాయికి రాష్ట్రం చేరుకుందని గుర్తు చేశారు. రైతుల పంటకు గిట్టుబాటు, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం రెండింటికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల కష్టాలను గుర్తించి వారికి సహకారం అందించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *