– భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
– పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
– డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మంత్రి పొంగులేటి టెలికాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : తీవ్ర వాయుగుండం, చురుగ్గా ఉన్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాస్ధాయిలో రెవెన్యూ యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ(డిజాస్టర్ మేనేజ్మెంట్) అధికారులతో ఆయన గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, రాబోయే రెండు రోజుల్లో కురిసే వర్షాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వాగులు, వంకలు, చెరువులు, జలాశయాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రవాణా, విద్యుత్, తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా(హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నాలుగు రోజుల క్రితం వరకు రాష్ట్రంలో 30% మేర ఉన్న వర్షపాతం లోటు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భర్తీ అయి దాదాపు సాధారణ స్థాయికి చేరుకుందని మంత్రి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం గురు, శుక్రవారాల్లో (జూలై 30, 31) రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వివిధ జిల్లాలకు అలర్టులు జారీ అయ్యాయని మంత్రి తెలిపారు. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని, అలాగే నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశామని తెలిపారు. ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
భారీ వర్షాలు కురిసే అవకాశం
తీవ్ర వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి నిజామాబాద్‌తోపాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌తోపాటు హనుమకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





