మైనారిటీల అభ్యున్నతికి పెద్దపీట

– విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం
– ఓల్డ్ సిటీ అభివృద్ధికి భారీగా నిధుల కేటాయింపు
– మైనారిటీ విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు మరింత విస్తృతం
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : మైనారిటీల అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాల కల్పనతోపాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత అసెంబ్లీ సమావేశంలో మైనారిటీల అభ్యున్నతి గురించి సమీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇచ్చిన హామీలో భాగంగా మైనారిటీ సంక్షేమ శాఖపై ప్రజాభవన్‌లో విక్రమార్క శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మైనారిటీల విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, విద్యాసంస్థల నిర్మాణాలు, స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఓల్డ్ సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మైనారిటీలకు విద్యావకాశాలను మరింత విస్తృతం చేసేందుకు నిధుల విడుదలలో ఎలాంటి జాప్యం, ఆంక్షలు ఉండబోవని భరోసా ఇచ్చారు. హజ్‌హౌస్ పక్కన అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. వివిధ రహదారుల విస్తరణ పనుల కోసం వినియోగించిన వక్ఫ్ భూములకు సంబంధించి జీహెచ్‌ఎంసీ నుంచి వక్ఫ్ బోర్డుకు రావాల్సిన నిధుల్లో రూ.25 కోట్లను ఈ భవన నిర్మాణానికి కేటాయించాలని ఆదేశించారు. నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. ఈ భవనంలో స్టడీ సర్కిల్‌తోపాటు మైనారిటీ సంక్షేమ శాఖకు చెందిన వివిధ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యాసంస్థల భవన నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదని స్పష్టం చేశారు. మైనారిటీల విద్యాభివృద్ధికి దోహదపడే పాఠశాలలు, స్టడీ సర్కిళ్లు, ఇతర విద్యాసంస్థలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మొఘల్‌పురా, బండ్లగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన రెండు స్టడీ సర్కిళ్లకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. వీటి నిర్వహణకు అవసరమైన భవనాలను అందించేందుకు అక్బరుద్దీన్ ఒవైసీ సంసిద్ధత వ్యక్తం చేయగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారికంగా సమర్పించాలని కోరారు. మైనారిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్య అభ్యాసానికి మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం పరిధిని విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులు వెళ్లగలిగే విదేశాల జాబితాలో ఈజిప్ట్, సౌదీ అరేబియాలను చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. మైనారిటీల సంక్షేమానికి సంబంధించిన షాదీ ముబారక్ పథకం, ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌కు ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపు, రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల విడుదల తదితర అంశాలపై కూడా చర్చించారు. క్రైస్తవ మైనారిటీలకు సంబంధించిన సమస్యలను సైతం పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అధికారులకు సూచించారు. మైనారిటీల విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధితోపాటు ఓల్డ్ సిటీలో మౌలిక వసతుల మెరుగుదల, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, కార్యదర్శి బి.షఫీఉల్లా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *