నాణ్యమైన విద్య అందించేందుకు దీక్షబూనండి

– మండలం యూనిట్‌గా ప్రణాళికలు పంపండి
– ప్రతీ పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా పనిచేయాలి
– మీ పర్యటన అనుభవాలు విద్యార్థులకు మేలు చేయాలి
– విదేశీ విద్యకు ఏటా 10-15 మంది ఉపాధ్యాయుల ఎంపిక
– సమాజ మార్పునకే విద్యా శాఖ బాధ్యతలు
– ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : నాణ్యమైన విద్య రాష్ట్రానికి పునాది అయితే,నైపుణ్యాలు అంతస్తుల్లాంటివని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న ఐదేళ్లు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తామనే దీక్షను ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు. టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఎంసీఆర్‌ చ్‌ఆర్డీలో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై సగటున రూ.1.08 లక్షలు వ్యయం చేస్తున్నామని, అంత ఖర్చు చేస్తున్నా విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళుతున్నారో ఆలోచించాలన్నారు. తెలంగాణలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థ ఉండాలనే లక్ష్యంతోనే ఉపాధ్యాయులను విదేశీ పర్యటనలకు పంపుతున్నామని తెలిపారు. ఆయా దేశాల పర్యటనతో తెలుసుకున్న అంశాలను ఇక్కడ విద్యార్థులకు బోధించి ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా వారిని తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చేందుకు అయిదేళ్లపాటు పాటుపడేందుకు ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని కోరారు. ఆస్తులు లేకపోవడం వెనుకబాటుతనం కాదని, విద్య లేకపోవడమే వెనుకబాటుతనమని తాము నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల సర్వే తేల్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎకరాల కొద్ది భూమి, ఇతర ఆస్తులు ఉన్నా సమాజం ఎటు వెళుతున్నదో తెలియక వెనుకబడి పోతున్నారని, ఏ ఆస్తులు లేకపోయినా చదువుతో ఉద్యోగాలు సాధించిన వారు ప్రపంచంతో పోటీ పడుతున్నారని తెలిపారు. ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు రూపకల్పన చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచామన్నారు. 55 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మాదిరే ఏటా 10 నుంచి 15 మంది ఉపాధ్యాయులను విదేశీ విద్యకు పంపిస్తామని తెలిపారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి తాను పాటుపడతానని, విద్యార్థుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు తనతో కొట్లాడాలని సూచించారు. ఉపాధ్యా యులు ఏ మండలానికి ఆ మండలం యూనిట్‌గా తీసుకుని వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఆ మండలంలోని పాఠశాలల్లో ఏ వసతులు కావాలి, ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి, మెరుగైన విద్యా బోధనకు తీసుకోవాల్సిన చర్యలు.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరేందుకు ఏమి అవసరమనే అంశాలు ఆ ప్రణాళికలో ఉండాలని సూచించారు. డిసెంబరు ఆఖరుకు ఆ ప్రణాళిక అందజేస్తే దానికి అనుగుణంగా తాము కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించాలని అధికారులను ఆదేశిస్తూ ఆయా సూచనలు, సలహాలను అందులో పొందుపర్చాలన్నారు.

విద్యపై ఎంత ఖర్చుకైనా వెనుకాడం 

తమ ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయులకు మొదటి తేదీనే వేతనాలు అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందజేస్తున్నామని తెలిపారు. విద్యపై ఎంత మొత్తమైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఉన్న సమాజం, దేశమే అభివృద్ధి చెందుతాయన్నారు. విద్యార్థులు రోజులో అధిక సమయం పాఠశాలల్లోనే ఉంటారు కనుక వారికి మానవ సంబంధాల ప్రాధాన్యతను తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని అన్నారు. విద్య నైపుణ్యం కాదని, విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భాష సమాచార మార్పిడికి ఉపయోగపడుతుందని, నైపుణ్యం జీవనోపాధి కల్పిస్తుందని అన్నారు. చైనా, జపాన్, కొరియా, జర్మనీ దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే వారు 10 శాతం మించి ఉండరని, కానీ వారికున్న నైపుణ్యంతో ప్రపంచాన్ని శాసిస్తున్నారని తెలిపారు. జపాన్, జర్మనీ, కొరియా భాషలు కొంత నేర్చుకుని నైపుణ్యాలు నేర్చుకుంటే అక్కడ మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. 12వ తరగతి తర్వాత విద్యార్థికి ప్రపంచంపై సంపూర్ణ అవగాహన ఉండాలని, దాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు నిరక్షరాస్యత, కరవుకాటకాలతో దేశం సతమతమవుతున్నప్పుడు ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ విద్య, నీటిపారుదల రంగాలను ప్రాధాన్యతాంశాలు గా ఎంచుకుని ఆ సమస్యలను అధిగమించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐఐటీలు, ఐఐఎంలు, యూనివర్సిటీలు, సాగు నీటి ప్రాజెక్టులు నెహ్రూ దార్శనికతకు నిదర్శనమన్నారు. నాడు వేసిన పునాదులతో నేడు ప్రతి తండా, గూడెంలోనూ పాఠశాలలు ఏర్పాటయ్యాయని, ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సాంకేతిక విప్లవంతో వైట్ కాలర్ జాబ్‌లను మనం అందిపుచ్చుకున్నామని, కానీ ఇప్పుడు వాటికి కాలం చెల్లిందని అన్నారు. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో నైపుణ్యాలకు డిమాండ్ ఉన్నందున అక్కడి అవసరాలకు తగినట్లు మన విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే సంప్రదాయ కోర్సులతో ప్రభావం కోల్పోయిన ఐటీఐలను టాటా సంస్థ సహకారంతో ఏటీసీలుగా ఆధునీకరించామని, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉట్నూరు ఏటీసీలో శిక్షణ పొందిన వారంతా టాటా సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యారని సీఎం తెలిపారు.

సుభిక్షమైన దేశంగా తీర్చిదిద్దిన వారిపై విమర్శలా?

కరవు, కాటాకాలు, నిరక్షరాస్యతలో కూరుకుపోయిన దేశాన్ని సాగు నీటి ప్రాజెక్టులు, విద్యాలయాల ఏర్పాటుతో సుభిక్షమైన దేశంగా తీర్చిదిద్దిన నెహ్రూపైనా విమర్శలు గుప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసి గరిబీ హఠావో నినాదంతో పని చేసిన ప్రధానమంత్రి ఇందిరా గాంధీపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గరి నుంచి 2014 వరకు ప్రధానమంత్రులుగా చేసిన వారు రూ.51 లక్షల కోట్ల అప్పులు చేస్తే 2014 నుంచి 2026 వరకు 12 ఏళ్లలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.151 లక్షల కోట్లు అప్పులు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గోరంత పనులను కొండంతగా చెప్పుకుంటున్నారని, ఎన్నో యుద్దాలు, ఆకలి, నిరక్షరాస్యతలను అధిగమించిన విజయాలను ఎందుకు ప్రచారం చేయరని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ పి.వి.నరసింహారావు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని, తర్వాత కాలంలో అదే నవోదయ విద్యాలయాలకు, గురుకుల పాఠశాలలకు నమూనాగా నిలిచిందని సీఎం చెప్పారు. సాగు నీటి ప్రాజెక్టులను నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా వర్ణించారని, నాడు నిర్మించిన నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టుల ఫలితంగానే తెలంగాణలో ఈనాడు 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం(వరి) ఉత్పత్తి సాధ్యమైందని అన్నారు. ప్రతీ పేద విద్యార్థికి విద్యను అందించడంతో సరిపెట్టుకోకుండా వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలనేది తన ఆశయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొండారెడ్డిపల్లి వంటి మారుమూల పల్లె ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను రాష్ట్రంలోని 12 వేల పల్లెల్లోని పాఠశాల పిల్లలు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు.

సమాజ మార్పునకే విద్యా శాఖ బాధ్యతలు

విద్యా శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కొందరు విమర్శిస్తున్నారంటూ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నందుకా? టీచర్ల నియామకం, ప్రమోషన్లు సక్రమంగా చేపట్టినందుకా? ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా? స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా? ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్‌గా నియమించినందుకా? ఎందుకు తాను రాజీనామా చేయాలో వాళ్లు తెలపాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఓట్లు, రాజకీయం కోసం తాను పని చేయడం లేదన్నారు. సమాజ మార్పునకే తాను విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. సమావేశానికి ముందు ఫిన్‌లాండ్, జర్మనీల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం వీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ డైరెక్టర్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *