హైడ్రోజన్‌ ‌రైలుతో నూతన శకం ఆరంభం

– భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి
– తొలి రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
– అనేక ప్రత్యేకతలతో పర్యావరణహితంగా తయారీ

న్యూదిల్లీ, జులై 17 : భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైందనే చెప్పాలి. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు శుక్రవారం పట్టాలెక్కింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. హరియాణాలోని జింద్‌-‌సోనిపట్‌ ‌మధ్య 89 కిలోటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా హైడ్రోజన్‌ ‌ఫ్యూయల్‌ ‌సెల్‌ ‌సాంకేతికతను రైల్వేలో వినియోగిస్తున్నారు. హైడ్రోజన్‌ ‌ద్వారా విద్యుదుత్పత్తి చేసి రైలును నడిపే ఈ సాంకేతికతను డీజిల్‌ ‌ట్రైన్స్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్‌లో హైడ్రోజన్‌ ‌నిల్వ, ఇంధనం నింపే ప్రత్యేక సదుపాయాలనూ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ’హైడ్రోజన్‌ ‌రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో భారత్‌ ‌చేరడం గర్వకారణం. స్వచ్ఛమైన, సుస్థిర సాంకేతికతను రైల్వే రంగంలో విస్తరించేందుకు ఇది కీలక అడుగుగా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.

————————————————————————————————-

హైటెక్ సిటీ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభం
– దేశవ్యాప్తంగా 75 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని 

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరం ఒక బుల్లెట్ రైల్ హబ్‌గా మారబోతోందని తెలిపారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా రూ.35.61 కోట్లతో సర్వాంగ సుందరంగా ఆధునికీకరించిన హైదరాబాద్ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆధునికమైన హైటెక్ సిటీ స్టేషన్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకు స్థానిక రైల్వే అధికారులకు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. గత పన్నెండేళ్ల కాలంలో రైల్వే చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అద్భుతమైన ప్రగతి, మార్పులు జరిగాయని రామచందర్ రావు పేర్కొన్నారు. గతంలో రైల్వే స్టేషన్ అంటే పాత భవనాలు, కనీస వసతులు లేని ప్రదేశాలుగా భావించేవారమని, కానీ నేడు అధునాతన ఇంజనీరింగ్‌తో విమానాశ్రయాలను తలపించేలా సుందరీకరణ జరుగుతున్నదని కొనియాడారు. రాష్ట్రంలోనే దాదాపు 41 రైల్వే స్టేషన్లను ఎలివేటర్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు వంటి అత్యాధునిక వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించినట్లు వివరించారు. విదేశాల్లోని యూరో రైల్ సిస్టమ్ కంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఈరోజు భారతదేశం ఉపయోగిస్తోందని, దేశవ్యాప్తంగా బ్రాడ్‌గేజ్ పనులు పూర్తవుతూ రైల్వే వ్యవస్థ రూపురేఖలు మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక పక్షపాతాన్ని బడ్జెట్ కేటాయింపులతో రామచందర్ రావు వివరించారు. భారీ కేటాయింపుల వల్లే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, మహా ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తెలంగాణలో ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, భవిష్యత్తులో మూడు బుల్లెట్ రైళ్లు, మూడు హైస్పీడ్ రైళ్ల కారిడార్లు రాబోతున్నాయని, దీనికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ప్రకటించారు. తాను రైల్వే డిగ్రీ కాలేజీ విద్యార్థినేనని చెబుతూ రైల్వే వ్యవస్థతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *