కౌలు రైతుల‌కు గుర్తింపు కార్డులివ్వాలి

– ప్ర‌భుత్వ స‌బ్సిడీలు, ప‌థ‌కాలు అందించాలి
– కౌలు రైతుల గుర్తింపు సాధ‌న క‌మిటీ డిమాండ్‌
– క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌

వికారాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 17: తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కౌలు రైతుల సమావేశం వికారాబాద్ లో శుక్ర‌వారం జరిగింది. తొలుత‌ కౌలు రైతులు, సాధన కమిటీ నాయకులు కలెక్టర్ దీపక్ తివారీని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. తమ కమిటీ ఇటీవల చేసిన కౌలు రైతుల సర్వే రిపోర్టును స్వీకరించిన కలెక్టర్ కు రైతులు తీవ్ర సమస్యలలో ఉన్నారని అంగీకరించి వారి గుర్తింపున‌కు తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం వుంద‌న్నారు. ప్రభుత్వానికి లేఖ రాసి విధానపరమైన నిర్ణయం తీసుకొని కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాలని వ్యవసాయ శాఖని కోరతాన‌ని కౌలు రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం సాధన కమిటీ నాయకుల, కౌలు రైతుల, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బషీరాబాద్, తాండూరు, కొడంగల్, మోమిన్‌పేట, మర్పల్లి, పూడూరు, పెద్దేముల్, వికారాబాద్, యాలాల నుండి కౌలు రైతులు వచ్చి తమ చెప్పుకున్నారు. రాష్ట్రస్థాయి కమిటీ తరఫున రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు విస్సా కిరణ్ కుమార్, బి.కొండల్ రెడ్డితోబాటు వి.భార్గవి, ఎస్.అనూష, మహిత, ప్రణీత హాజరయ్యారు. కమిటీ వికారాబాద్ జిల్లా సభ్యులు వి.అమరేశ్వర్, ఎస్.యాదయ్య, కే.కరుణానిధితోబాటు భారతీయ కిసాన్ యూనియన్ ఎ), న్యూ డెమోక్రసీ పార్టీ, పి.ఓ.డబ్ల్యు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్, కొండల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 36 శాతంపైగా ఉన్న కౌలు రైతులు పంటల ఉత్పతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు కానీ రైతులకు అందే సౌకర్యాలు కౌలు రైతులకు అందడం లేదు. ప్రభుత్వం నుండి గుర్తింపు లేకపోవడం వల్ల‌ సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, పంట నష్టపరిహారం, రైతు బీమా – ఆఖరికి తమ పంటను ప్రభుత్వ ఏజెన్సీలకు అమ్ముకునే అవకాశం కూడా కౌలు రైతులకు లభించట్లేదని. ప్రభుత్వం నిర్లక్షం వల్లనే కౌలు రైతుల ఆత్మహత్యలు  కొనసాగుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ అనేక ప్రజా సంఘాలు, ప్రముఖులతో ఏర్పడి ఈ విషయంలో విస్తృత ప్రచారం చేసి ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నదని తెలిపారు. ఇటీవల కౌలు రైతుల పరిస్థితి పై సాధన కమిటీ రాష్ట్రవ్యాప్త సర్వే నిర్వహించింది. 22 జిల్లాలు, 47 మండలాలు, 58 గ్రామాలలో 1816 మంది కౌలు రైతులను ప్రత్యక్షంగా కలిసి చేసిన ఈ సర్వేలో వెల్లడి అయిన ముఖ్యాంశాలను కొండల్ రెడ్డి వివరించారు. సర్వే నివేదిక తయారు చేసి ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సదస్సులు నిర్వహించి రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజా సంఘాలు, వ్యవసాయ అనుబంధ రంగాల వారికి సమర్పించారు. మోమిన్‌పేట మండలం అమరదికలాన్ నుండి సలావుద్దీన్ ఇబ్రహీం, మౌలానా, జీవంగీ సర్పంచ్ బాలప్ప, అంగడి రాయచూర్ ఉప సర్పంచ్ కృష్ణ శ్రీనివాస్, అల్లాపురం ఉప సర్పంచ్, గుండప్ప, జయసింగ్, సంగమేశ్వర్, బసప్ప, నర్సింలు, భారతి, సత్తార్ అజీమ్ వంటి అనేకమంది కౌలు రైతులు పాల్గొన్నారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు సాగుదారులకు యేటా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గుర్తింపు పొందిన కౌలు సాగుదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని కౌలు రైతులు డిమాండ్ చేశారు. తమకు గతంలో అందిన కార్డుల వలన పంట రుణాలు, ప్రభుత్వ పథకాలు లభించాయని బషీరాబాద్ మండలం జీవంగి సర్పంచ్ అన్నారు. ప్రతి పథకానికి ఫోన్ యాప్ లలో భూ యజమానికి ఓటీపీ పంపే వ్యవస్థ వలన కౌలు రైతులకి చాలా ఇబ్బంది కలుగుతున్నదని, సీజన్ మొదట్లోనే కౌలు రైతులకు గుర్తింపు ఇచ్చి అన్ని పథకాలలోనూ లబ్ధి కలిగించాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *