– కొండా బర్తరఫ్‌తో పార్టీపై పట్టు బిగించినట్లేనా ?
– రేవంత్‌ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే ఆలోచ‌న‌లో అధిష్ఠానం
– మీనాక్షి నటరాజన్‌ స్థానంలో మరో సీనియర్ నాయకుడు

పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయనకు సమర్థవంతమైన అండదండలు అందించేందుకు పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజ్ స్థానంలో మరో సీనియర్ నాయకుడిని రాష్ట్రానికి పంపాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. అలాగే ఇంతకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో వెనుకాముందాడుతున్న సీఎం, అధిష్టానవర్గం ఇక తమకు ఎలాంటి అవరోదాలు ఎదురుకావన్న ధీమాతో ఉన్నట్లు తెలుస్తున్నది.

(మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి)

కొండా సురేఖను మంత్రి పదవినుండి బర్తరఫ్ చేయడంద్వారా సిఎం రేవంత్‌రెడ్డి పార్టీపై మరింతగా పట్టుబిగించినట్లేనా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుండీ ఆయన సొంత‌పార్టీనుండే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వలస నేతలు, ఒరిజనల్ నేతల మధ్య పొసగకుండాపోయింది. అచ్చపార్టీ పచ్చపార్టీ అంటూ పార్టీలో మనస్పర్థలు కొనసాగుతున్నాయి.  దశాబ్ధాలుగా పార్టీ జెండాను మోసిన వారినికాదని నిన్న మొన్న పార్టీలో చేరినవారికే పదవుల పందారంలో ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ఆరోపణను ఆయన నాటినుండి నేటి వరకు ఎదుర్కొంటూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమకాలంలో సీమాంధ్రపాలకులను కాదని నిలచిన వారిని పట్టించుకోవడంలేదన్న అపవాదు ఆయనపై ఉంది. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుండగా మిగిలిన మంత్రి పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో జరుగుతున్న జాప్యంపై  రెండవశ్రేణి నాయకుల అలక ఉండనేఉంది. ఇదిలాఉంటే పార్టీలో అంతర్గత కొట్లాటలకు పులిస్టాఫ్ లేకుండా పోయింది. సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డికి స్థానిక శాసనసభ్యుడు సంజయ్‌కుమార్ జగడం ముదిరి చివరకు జీవన్‌రెడ్డి పార్టీ వీడేవరకు వచ్చింది. రాజకీయంగా తనకు ఇబ్బంది కలిగించేందుకే తనతో కనీసం సంప్రదించకుండా సంజయ్‌కుమార్‌ను రేవంత్‌రెడ్డి తీసుకున్నాడన్నది జీవన్‌రెడ్డి ఆరోపణ. కొంతకాలం పార్టీని ఇబ్బందికి గురిచేసిన తుంగతుర్తి ఎంఎల్ఏ మందుల సాయిలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వివాదం, తనకు మంత్రి పదవి దక్కలేదంటూ రాజగోపాల్‌రెడ్డి వివాదగ్రస్త ప్రసంగాలు, అనిరుధ్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి తీరు, తాజాగా కొండా సురేఖ, చిన్నారెడ్డి కథనాలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఒక విధంగా ఈ పరిణామాలు విపక్షాలైన బిఆర్‌ఎస్, బిజెపి విమర్శలకు మరిన్ని ఆయుధాలను అందించినట్లైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీపైన, పాలనపైన పట్టు కోల్పోవడంవల్లే నాయకులమద్య అంతర్ కలహాలు శృతిమించు తున్నాయన్న ప్రచారం విస్తృతమైంది. అధిష్టానంకూడా రేవంత్‌రెడ్డిపట్ల అంతగా ఆసక్తిగాలేదని, సిఎంను మార్చే ఆలోచనలో ఉన్నట్లు కూడా కొన్ని పుకార్లు షికార్లు చేశాయి. కాని కొండా సురేఖ బర్తరఫ్ వాటన్నిటినీ పటాపంచలు చేశాయి. అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటకే ప్రాధాన్యమిచ్చిందనేకంటే రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించారన్నది సుస్పష్టం. గత సంవత్సరకాలంగా కొండా సురేఖ చేస్తున్న ఆరోపణలు, వివాదగ్రస్త ప్రసంగాలకు ఆమెను మంత్రివర్గంనుండి తొలగించాలనుకున్న ఆయన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. మూడు రోజులు ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ పెద్దల ద్వారా ఆయన అనుకున్నది సాధించుకున్నారు.  తన నాయకత్వాన్ని బలహీనపర్చాలనుకునేవారికి దీనిద్వారా ఆయన ఘాటైన సమాధానమిచ్చినట్లైంది. ఇకముందు ఎవరుకూడా తమ పరిధిదాటి అధిక ప్రసంగాలు చేయకుండా ఆయన అడ్డుకట్ట వేయగలిగారనే చెప్పవచ్చు.  స్థానిక నాయకులు ప్రతీ చిన్నవిషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుపోడమన్నది కాంగ్రెస్‌లో ఆనవాయితీగా వస్తున్నది. అయితే కొండా సురేఖ ఎపిసోడ్‌తో రేవంత్‌రెడ్డిపై  చేసే ఫిర్యాదులను అధిష్టానం పెద్దగా పట్టించుకోదన్నది దీనివల్ల స్పష్టమైంది. లాభంకన్నా నష్టమే జరుగుతుందన్న భయం ఫిర్యాదుదారుడిలో ఏర్పడింది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి వారు రేవంత్‌రెడ్డిపైనగాని, పార్టీపైనగాని విమర్శలు చేసేందుకు ఇకముందు వెనుకాడే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పరోక్షంగా  పార్టీ బలోపేతానికి ఇది దోహదపడే అవకాశం లేకపోలేదు. చాలాకాలంగా  అంతర్గత కలహాలతో పార్టీ బలహీనమైందన్న అపవాద కూడా దీనితో తొలగిపోతుందను కుంటున్నారు. పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఇప్పుడు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయనకు సమర్థవంతమైన అండదండలు అందించేందుకు తెలంగాణ పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజ్ స్థానంలో మరో సీనియర్ నాయకుడిని రాష్ట్రానికి పంపాలని అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లుకూడా తెలుస్తున్నది. అలాగే ఇంతకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో వెనుకాముందాడుతున్న సిఎం, అధిష్టానవర్గం ఇక తమకు ఎలాంటి అవరోదాలు ఎదురుకావన్న ధీమాతో ఉన్నట్లు తెలుస్తున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు