మనసు ఫౌండేషన్ కృషి అభినందనీయం

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రశంసలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17 : రాష్ట్ర మీడియా అకాడమీ చేపడుతున్న డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మనసు ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం చర్చలు జరిపారు. మీడియా అకాడమీ పాత తెలుగు, ఆంగ్ల, ఉర్దూ వార్తాపత్రికలను డిజిటలైజ్ చేసి జర్నలిస్టులు, పరిశోధకులు, విద్యార్థులు, ఇతర ఆసక్తిగల వారికి లక్షలాది పేజీల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు సంబంధించిన సుమారు ఎనిమిది లక్షల పేజీలు డిజిటల్ ఆర్కైవ్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విలువైన సమాచారాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ఆర్కైవ్స్‌ను మరింత అభివృద్ధి చేయడం, సమాచార శోధనను సులభతరం చేయడం వంటి అంశాలపై మనసు ఫౌండేషన్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చలు జరిగాయి. సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ రాయుడు, సభ్యులు చంద్రమౌళి, దాము బాలాజీ, వి.శేషతలపతి సాయి, ఎ.వి.రమణమూర్తి, జగన్ పాల్గొన్నారు. మీడియా అకాడమీ తరఫున కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు, అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణచందర్ రావు, అకాడమీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనసు ఫౌండేషన్ దాదాపు 28 లక్షల పేజీల చారిత్రక వార్తాపత్రికలు, పుస్తకాలు, గెజెట్లు, మ్యాగజైన్లు, ఇతర విలువైన పత్రాలను డిజిటలైజ్ చేసి భద్రపరిచిన విశిష్ట సేవలను అకాడమీ అభినందించింది. భవిష్యత్ తరాలకు చారిత్రక సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.సమావేశంలో డిజిటలైజేషన్ ప్రక్రియలో కాపీ రైట్ నిబంధనలను పాటించడం, సంబంధిత అధికారుల అనుమతులు పొందడం, అరుదైన పుస్తకాలు, వార్తాపత్రికలు, గెజెట్లు, మోనోగ్రాఫ్‌లు, ఇతర చారిత్రక పత్రాలను డిజిటల్ రూపంలో భద్రపరచడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే డిజిటల్ ఆర్కైవ్స్‌ను మరింత విస్తరించే దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, డిజిటలైజ్ చేసిన పత్రాలకు సమగ్ర ఇండెక్సింగ్, డాక్యుమెంటేషన్ నిర్వహించడం, ప్రత్యేక డిజిటల్ ఆర్కైవ్స్ వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడం, డేటా భద్రత కోసం ప్రత్యామ్నాయ కాపీలను భద్రపరచడం, జాతీయ స్థాయి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఉత్తమ విధానాలను అనుసరించడం వంటి అంశాలపై సూచనలు చేశారు. డిజిటల్ ఆర్కైవ్స్, ఆర్కైవ్ నిర్వహణ, మీడియా పరిశోధన, జర్నలిజం చరిత్ర, డాక్యుమెంటేషన్ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించాలని మనసు ఫౌండేషన్ ప్రతినిధులు సూచించారు. చారిత్రక మీడియా సంపదను సంరక్షించడం, పరిశోధనకు ప్రోత్సాహం అందించడం, డిజిటల్ ఆర్కైవ్స్‌ను మరింత బలోపేతం చేసేందుకు మీడియా అకాడమీ, మనసు ఫౌండేషన్ పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *