డిగ్రీ, గురుకుల భవనాలు త్వరగా పూర్తిచేయాలి

– రెండు రోజుల పర్యటనకు కొడంగల్ విచ్చేసిన సీఎం
– నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
– మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఫేజ్-2కు త్వరగా టెండర్లు పిలవాలి
– మద్దూరు మున్సిపల్ కేంద్రంలో రేవంత్ పర్యటన

హైదరాబాద్, సెప్టెంబర్ 3 : తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని మద్దూరు మున్సిపల్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన మద్దూరులో రూపుదిద్దుకుంటున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గురుకుల భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న డిగ్రీ కళాశాల భవనాన్ని మార్చిలోగా వేగవంతంగా పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు తరగతులు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాల పురోగతిని పరిశీలించిన రేవంత్ రెడ్డి కళాశాల ప్రాంగణాన్ని మరింత విశాలంగా తీర్చిదిద్దేందుకు పక్కనే ఉన్న స్థలాన్ని వెంటనే సర్వే చేసి భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రియాంకను ఆదేశించారు. ఇదే సమయంలో గురుకుల భవన నిర్మాణానికి తమ అమూల్యమైన సొంత భూములను ఉచితంగా అందించిన దాతల ఉదారతను అభినందిస్తూ వారికి వెంటనే ‘ఇందిరమ్మ ఇళ్లు’ మంజూరు చేయాలని స్పష్టమైన సూచనలు చేశారు. నిర్మాణ పనుý నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు ఉండాలని, కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మద్దూరులో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పదేళ్ల క్రితం ప్రజల అవసరాల కోసం సొంత డబ్బులతో భూమిని కొనుగోలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
అదే స్థలంలో ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపట్టారు. ఆనాడు ముందుకు వచ్చి భూములు ఇచ్చిన రైతులను గుర్తించి ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులనూ పరిశీలించారు.

గోకఫసల్వాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి 

దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్‌లో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. అనంతరం దౌల్తాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులను కూడా పరిశీలించారు.
హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ మెడికల్ నర్సింగ్, ఫిజియో థెరపీ, పారామెడికల్ కాలేజీలు, 430 బెడెడ్ హాస్పిటల్, ఇతర నిర్మాణాలు పరిశీలించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో జరిగే అన్ని నిర్మాణాల విషయంలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిర్మాణాల్లో నాణ్యత, ఇతర సాంకేతిక అంశాల విషయాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాల సమయంలో నీరు నిలవకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి ల్యాండ్ స్కేపింగ్ పనులకు వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష 

గత సమీక్ష సమావేశంలో సీఎం సూచనలను పనుల్లో మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి పంప్ హౌస్ పనులు ముందుకు తీసుకెళుతున్నామని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలో అధికారులు సీఎంకు తెలిపారు. ఫేజ్-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రతీ సంవత్సరానికి అవసరమైన బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను పూర్తి చేయాలన్నారు. ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి, ఫేజ్-2 పనులను అక్టోబర్ 2028 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *