విమెన్‌ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా ఆందోల్‌

‌యువతులు అన్నిరంగాల్లో రాణించాలి..
•నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభోత్సవంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 :  అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యమైనదని, భార్యగా, తల్లిగా, అక్కగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది మహిళలేనని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు విజ్ఞానవంతులైతే సమాజం గుణాత్మక అభివృద్ధి వైపు పురోగమిస్తుందని చెప్పారు. చదువుతో పాటు సమాజంపై అవగాహన, సంస్కృతిపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆందోల్‌ ‌లో గురువారం నర్సింగ్‌ ‌కాలేజీని ప్రారంభించిన అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. మహిళలు, యువతులు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో బతకాలలని. తప్పొప్పులను సరిద్దికుంటూ ముందుకు సాగాలని కోరారు. మనం పెరిగిన సమాజానికి, ప్రాంతానికి తిరిగి సాయం చేసే గుణం అలవర్చుకోవాలన్నారు.

ఆందోల్‌ అమ్మాయిలకు ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా మారుతోందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే అమ్మాయిలకు సంబంధించిన అన్నిరకాల విద్యా సంస్థలు ఇక్కడున్నాయి.. ఈరోజు కొత్తగా నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభించుకున్నామని తెలిపారు. .భవిష్యత్తులో ఇక్కడి విద్యా సంస్థలను గర్వపడే స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు ఆందోల్‌కు వొచ్చి చదువుకుంటున్నారని, వాళ్లంతా మంచిగా చదివి, ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో సక్సెస్‌ ‌కావాలంటే చదువుతో పాటు క్రమశిక్షణ, నిరంతర కృషి చాలా అవసరమని చెప్పారు.

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుందన్నారు. తల్లిదండ్రులు, గురువులు ఆ నైపుణ్యాలను గుర్తించి విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను పిల్లలు గౌరవించాలన్నారు. అంతకు ముందు, తన బర్త్‌డే సందర్భంగా విద్యార్థినుల సమక్షంలో మంత్రి కేక్‌ ‌కట్‌ ‌చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఎంపీ సురేష్‌ ‌షెట్కార్‌, ‌మునిసిపల్‌ ‌చైర్మన్‌ ‌జి.మల్లయ్య తదితరులతో కలిసి మంత్రి వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినులను మంత్రి అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *