పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై పిటిషన్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్,డిసెంబర్5 (ఆర్‌ఎన్‌ఎ) : తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అంశంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.పాఠశాలల్లో తప్పనిసరిగా విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందించాలని ఆదేశించింది. భోజనం వికటించిన విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలకు సంబంధించిన నివేదిక సమర్పించాలంటూ విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా భోజనం వికటించిన ఘటనల్లో ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసిందని ధర్మాసనానికి ఏఏజీ వివరణ ఇచ్చారు.
ఈ ఘటనల్లో బాధ్యులైన వారిని ఇప్పటికే సస్పెండ్ చేశామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40శాతం పెంచినట్లు తెలిపారు. పిటిషర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ప్రధానమంతి పోషణ్ పథకం కింద గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలు ఉండాల్సి ఉందని.. కమిటీల పర్యవేక్షణ సరిగా లేపకపోవడం వల్లే భోజనం వికటించే ఘటనలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కమిటీలు సరిగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి ఏఏజీ కమిటీ అన్ని బాగానే పని చేస్తున్నాయని బదులివ్వగా.. హైకోర్టు వివరాలను నమోదు చేసుకున్నది.