– మొదటి ప్రమాద హెచ్చరికను దాటిన ప్రవాహం
– సాయంత్రానికి 50 అడుగులు చేరుకునే అవకాశం
– లోతట్టు ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 31: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక దాటగా సాయంత్రం వరకు 50 అడుగులకు పెరిగే అవకాశం వున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. గురువారం సాయంత్రానికి 28 అడుగులు ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 41 అడుగులకు చేరుకుంది. ఇది వేగంగా పెరుగుతూ 10 గంటల సమయంలో 43 అడుగులు దాటి 9,74,666 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
మధ్యాహ్నానికి 45 అడుగులకు చేరుకుంది. కల్యాణకట్ట, స్నాన ఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. 48 అడుగులకు చేరుకుంటే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కాగా, ఎగువ ప్రాంతంలోని సమ్మక్క సారక్క బ్యారేజ్, ఇంద్రావతి, ప్రాణహిత ప్రాజెక్టు నుండి దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది. ఈరోజు సాయంత్రానికి 50 అడుగులు వచ్చే అవకాశం ఉన్నట్లు సిడబ్ల్యుసి అధికారులు చెబుతున్నారు. గోదావరి నీటిమట్టం వేగంగా పెరగటంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార వర్గాలు సూచించాయి. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేవిధంగా అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరూ కూడా గోదావరి వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
కాళేశ్వరం వద్ద ఉధృతి
కాళేశ్వరం : ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు సీడబ్ల్యూసీ కాళేశ్వరం స్టేషన్ వద్ద గోదావరి నీటిమట్టం 11.50 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వాతావరణం మేఘావృతమై ఉంది. మేడిగడ్డలోని లక్క్ష్మీ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 96.40 మీటర్లు నమోదైంది. బ్యారేజ్ వద్ద మొత్తం 8,35,800 క్యూసెక్కుల వరద ప్రవాహం ఇన్ఫ్లో, అవుట్ ఫ్లోగా కొనసాగుతుండగా, వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు 85 గేట్లను పూర్తిగా ఎత్తి ఉంచారు. ప్రస్తుతం గోదావరి నది బ్యారేజ్ వద్ద ఫ్రీ ఫ్లో పరిస్థితిలో ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద హెచ్చరికస్థాయి 12.210 మీటర్లు, ప్రమాదస్థాయి 13.460 మీటర్లుగా ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





