ప్రూస్ట్ జ్ఞాపకాల చిత్రకారుడు-నాగినీ కందాల

మార్సెల్ ప్రూస్ట్‌ తన నవల “In Search of Lost Time” గురించి జాన్ కోక్టోతో “My book is a painting” అని అన్నారట! ప్రూస్ట్ వచనంలో శైలీ, స్వభావాల్ని చెప్పడానికి ఇంతకంటే సంక్షిప్తమైనమాట మరొకటి ఉంటుందనుకోను. ఆయన దృష్టిలో పెయింటింగ్‌, రైటింగ్‌ రెండూ వేర్వేరుకావు, పదాలతో పూర్తిస్థాయి ప్రపంచాన్ని చిత్రించడం. చిత్రకారుడు రంగులతో కాన్వాస్‌ పై చిత్రాలను సృష్టించినట్లే, ప్రూస్ట్ జ్ఞాపకాలు, అనుభూతులు, కాలం, మనుషులు, ప్రకృతి, ప్రేమ వంటివాటిని తనవాక్యాలతో వర్ణించారు. బహుశా అందుకే, ప్రూస్ట్ లో చిత్రకారుడిలా రాయాలనే కోరిక పుస్తకమంతా అనేకదశల్లో కనిపిస్తుంది. ఈ నవలలో ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల పేర్లు, వారి పెయింటింగ్స్ పదేపదే ప్రస్తావనకు వస్తాయి.

ప్రూస్ట్ వచనంలో కనిపించేవి కథ, కథనాలు అనేకంటే, “దృశ్యానుభవం” అనొచ్చు. ఈ నవలలో పాత్రలు ఒకేరంగుతో వేసిన చిత్రాలుకాదు, వెలుగుమారే కొద్దీ రంగులుమారే చిత్రంలా, కాలం, జ్ఞాపకాల ప్రభావంతో అవి కొత్తరూపాలను సంతరించుకుంటాయి. ప్రూస్ట్ ప్రపంచంలో వస్తువులు కూడా నిశ్చలస్థితిలో ఉండవు. ఉదాహరణకు మార్సెల్ బాల్యం గడిచిన కాంబ్రే చర్చి గోపురం ఉదయకాంతిలో ఒకవిధంగా, సంధ్యవెలుగులో మరోవిధంగా కనిపిస్తుంది. పారిస్ లో మార్సెల్, గిల్బెర్టెను కలవడానికి వెళ్ళే Champs-Élysées దారిలో ప్రకృతి సౌందర్యం మాత్రమేకాదు, ఆ కుర్రవాడి తొలిప్రేమ పొంగు, ఉత్సాహం, విరహం- ఇవన్నీ కోల్పోయిన జ్ఞాపకాల తాలూకు మాధుర్యాన్ని పరిచయం చేస్తాయి. ప్రూస్ట్‌కు ‘జ్ఞాపకం’ కళాకారుడి కుంచెతో సమానం.

అందుకే ప్రూస్ట్ వచనంలో గతాన్ని కనుమరుగైపోయిన విషయంగా చూడడం సరికాదు. సాయంత్రం టీలో ముంచుకుని తిన్న మెడెలైన్ కేకుల రుచో, గాలీ వెలుతురూ చొరబడని గదిలోని ఉక్కపోత వాసనో, మరోమనిషి స్వరమో, వర్షమో, మరేదో చిన్న అనుభూతో అకస్మాత్తుగా ఆ గతాన్ని మేల్కొలుపుతుంది, పాఠకుల మనసులో ఆ అనుభవం పునఃసృష్టించబడుతుంది. పాఠకులం గతకాలపు అనుభవాలపై కాలగతిలో పేరుకున్న పొరలను తొలగిస్తూ, ఆ ప్రపంచాన్ని మళ్ళీ చూస్తాము. ఈ మొత్తం ప్రక్రియలో రచయిత కేవలం తన జ్ఞాపకాలను పొందుపరిచే వ్యక్తిగా కాకుండా, వాటిద్వారా మరో కొత్తవాస్తవాన్ని సృష్టించే చిత్రకారుడిగా మారతాడు. అందుకే “In Search of Lost Time” కేవలం ఒకనవల కాదు, అది సుమారు “నాలుగువేల పేజీల విశాలమైన సాహిత్య కాన్వాస్” అంటాను.

చాలామంది రచయితల్లాగా ప్రూస్ట్ తన ఇంటలెక్చువల్ సుపీరియారిటీని చాటిచెప్పడానికి ఆ పెయింటింగ్స్ ని తనరచనలో కేవలం అలంకారప్రాయంగా వాడుకోలేదు. వాటిని తన వర్ణనలకు సందర్భోచితమైన ప్రతీకలుగా ఉపయోగించారు. చిత్రకళ ప్రూస్ట్ వచనంలో వ్యక్తీకరణకు అత్యవసరమైన నిర్మాణాత్మకమైన అంశం. అంటే ప్రూస్ట్‌ నవలలో పెయింటింగ్ కేవలం కనిపించదు, అది నవల ముందుకు నడవడంలో కీలకపాత్ర పోషిస్తూ, దాని అంతర్భాగంగా, కథలో ఫిజికల్ రియాలిటీని అణువణువునా ప్రభావితం చేస్తూ వస్తుంది. అందుకే ఈ నవలలో ప్రూస్ట్ మాటల్లోనే చెప్పాలంటే, “కళకు సంబంధించిన అనేక పొరలు” కనిపిస్తాయి.

వచనాన్ని పొరలుగా రాయడం ప్రూస్ట్‌ రచనాశైలిలో కీలకం. అనుభూతిని ఒక్కమాటతో చెప్పడం కాకుండా దానిమీద మరో జ్ఞాపకపుపొర, ఇంకో భావోద్వేగపు పొర, మరింకో దృశ్యం, ఇంకేదో పోలిక, కళాకృతి, అనుభవం- ఇలా ఒకదానిపై ఒకటి వేస్తూపోవడం. దానివల్ల ఆయన వచనంలో ఒక రకమైన మల్టీ డైమెన్షనల్ వెలుగుతో నిండిన “luminous” స్వభావం కనిపిస్తుంది. ఈ సందర్భంలో క్లాడ్ మోనే పెయింటింగ్స్ గురించి కూడా చెప్పుకోవాలి. క్లాడ్‌ మోనే ‘ఇంప్రెషనిజం’ ప్రూస్ట్‌ను చాలాలోతుగా ప్రభావితం చేసిందంటారు. మోనే చిత్రాల్లో ఒకేవిషయం పదేపదే కనిపిస్తుంది. ఉదాహరణకు, మోనే ల్యాండ్ స్కేప్స్, వాటర్ లిల్లీస్ లాంటివి పదేపదే చిత్రించేవారు. కానీ మనం గమనిస్తే ప్రతి పెయింటింగ్ లోనూ వెలుగు మారుతుంది, వాతావరణం మారుతుంది, సమయం మారుతుంది, తత్ఫలితంగా మన కంటికి కనిపించే దృశ్యం కూడా మారుతుంది. విషయం అదే అయినా, మనం దాన్ని చూసే అనుభవం ప్రతిసారీ కొత్తది. మోనే లాగే ప్రూస్ట్‌ కూడా తనకున్న ఒకే జీవితాన్ని, ఒకే ప్రపంచాన్ని వివిధ వెలుగుల్లో, దశల్లో, మానసికస్థితుల్లో వెనక్కు తిరిగి మళ్ళీమళ్ళీ చూశారనిపిస్తుంది. అందుకే “In Search of Lost Time” ఒకకథలా కాకుండా, అనేకచిత్రాల, జ్ఞాపకాల, అనుభూతుల, కాలాల విస్తారమైన నిర్మాణంలా, ఒక ఇంప్రెషనిస్ట్‌ శ్రద్ధగా వేసిన పెయింటింగ్‌లా అనిపిస్తుంది. ‘కళ’ కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోకుండా, మనుషులు తమతోబాటు ఒకరినొకరు అర్థంచేసుకునే పరిభాషగా మారిపోతుంది.

స్వాన్- ఓడెట్ ల ప్రేమలో ఆకర్షణ అంతా ఓడెట్ ఎంత అందంగా ఉందన్న దానికంటే స్వాన్ ఆమెను ఎలా చూస్తున్నాడన్న విషయంలోనే ఉంటుంది. తొలిచూపులో స్వాన్ కు ఓడెట్‌ పట్ల ఎటువంటి ఆకర్షణా కలగదు. కానీ ఒకరోజు బొట్టిసెల్లీ చిత్రించిన “The Trials of Moses”లోని Zipporah అనే స్త్రీని చూసి ఆమె అచ్చం ఓడెట్‌లాగే ఉందని అనుకుంటాడు. అంతే, ఆ క్షణంనుండీ స్వాన్ దృష్టిలో ఓడెట్ ఒక్కసారిగా మారిపోతుంది. అప్పటివరకు సాధారణంగా కనిపించిన స్త్రీ కాస్తా బొట్టిసెల్లీ చిత్రంలోని పవిత్రమైన బైబిల్ పాత్రలా కనిపిస్తుంది. ఇక్కడ స్వాన్ ప్రేమలో బొట్టిసెల్లీ చిత్రకారుడు మాత్రమేకాదు, స్వాన్ కు ఓడెట్ ను ప్రేమించడానికి ప్రత్యేకమైన ప్రేమ పరిభాషను సృష్టించి ఇచ్చిన లింగ్విస్ట్ గా మారిపోతాడు. మనకు ఒకమనిషి ఎలా కనిపిస్తాడనే దానికంటే, మనమనసులో అతని ఇమేజ్ ఎలా తయారైందన్నదే ముఖ్యమని ప్రూస్ట్ భావన.

ఈ నవలలో చాలాచోట్ల మార్సెల్, స్వాన్- ఇద్దరూ తమచుట్టూ ఉన్న మామూలుమనుషుల్ని పాత పెయింటింగ్స్ తో, కళాకృతులతో పోల్చడం గమనిస్తాం. మార్సెల్ కాంబ్రేలోని తన అత్త లియోనీ దగ్గర వంటమనిషి ఫ్రాంకోయిస్ ముఖాన్ని Giotto యొక్క “Charity” చిత్రంలోని స్త్రీతో పోలుస్తాడు. ఇద్దరిముఖాల్లోనూ ఒకరకమైన మొరటుతనం, జీవశక్తి కనిపిస్తుందంటాడు. మార్సెల్ కు ఉన్న అదే అలవాటు స్వాన్ కి కూడా ఉంటుంది. అతనికి Antonio Rizzo చెక్కిన “Doge Loredan” శిల్పంలో తన కోచ్‌మన్ ముఖంతో ఆశ్చర్యకరమైన పోలిక కనిపిస్తుంది. అదేవిధంగా Tintoretto వేసిన ఒక పోర్ట్రెయిట్లో స్వాన్ తన డాక్టర్ Dr. du Boulbon ముఖాన్ని చూస్తాడు. స్వాన్ లో కళాకృతుల్లో తనకు తెలిసిన మనుషుల శారీరకలక్షణాలను చూసే ఈ అలవాటే ఓడెట్ పట్ల వ్యామోహానికి కూడా కారణమవుతుంది. ప్రూస్ట్‌ కి సంబంధించి కళ అనేది కేవలం సౌందర్యాన్ని ఆస్వాదించే విషయంకాదు, మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని నేర్పే దృక్పథం.

మార్సెల్లో కళపట్ల ఇటువంటి అభిరుచికి కారణం అతని అమ్మమ్మ. ఆవిడ మనవడికి పుట్టినరోజు కానుకగా పుస్తకాలు బహుమతిగా ఇచ్చేటప్పుడు ఏవో కొన్నిపుస్తకాలు కాకుండా కళలపట్ల మార్సెల్ అభిరుచుల్ని తీర్చిదిద్దే ఉత్తమమైన రచనల్ని ఎంపికచేసి మరీ ఇచ్చేది. పఠనం కూడా నైతికమైన పనే అని నమ్ముతూ, మనం చదివే పుస్తకాలూ, పరిసరాలు మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయని మార్సెల్ గదిని చారిత్రకభవనాలు, అందమైన ప్రదేశాల చిత్రాలతో అలంకరించేది. కానీ గొప్పప్రదేశాలూ, పురాతన కట్టడాల ఫోటోలు తీసి గోడలకు తగిలించుకోవడమంటే ఆవిడకి తీవ్రమైన అయిష్టత ఉండేది. అందుకే నేరుగా వాటిఫోటోలను పెట్టకుండా, వాటి పెయింటింగ్స్ కొని మార్సెల్ గదిలో పెట్టేది. ఫొటోల్లో యాంత్రికత, వాణిజ్యపు వాసనలకు దూరంగా ఆ ప్రదేశాలను మార్సెల్ కళాకారుడి దృష్టిలోంచి చూడాలని తపనపడేది. ప్రూస్ట్ తర్వాత ఈ “మల్టీ లేయర్డ్ వ్యూ”ని “Thicknesses of art” అంటారు. ఉదాహరణకు, Corot చూసిన Chartres Cathedral, Hubert Robert చూసిన Fountains of Saint-Cloud, Turner చూసిన Vesuvius లాంటివి మార్సెల్ కు అలా పరిచయమయినవే. నిజానికి అమ్మమ్మకు కావలసింది ఆ ప్రదేశం ఫోటోకాదు, ఆ ప్రదేశాన్ని కళాకారుడి దృష్టితో చూడటం.

ఇక్కడే ప్రూస్ట్ పాఠకులను ఆలోచనలో పడేస్తారు. మనకళ్ళకు మనుషులు నిజంగా కనిపిస్తారా? లేక మన అవసరాలు, కోరికలు, జ్ఞాపకాలు, ఊహలు- ఇవన్నీ కలగలిసిన రంగుల్లోనే వాళ్ళను చూస్తామా? స్వాన్ కు చిత్రకారుడు బొట్టిసెల్లీ అద్దంకాదు, ఒక ప్రిజం. ఆ ప్రిజంతో అతను ఓడెట్ ను చూడటంలేదు, తన అంతఃప్రపంచపు వెలుగుని ఆమెమీదకి ప్రసరింపజేస్తున్నాడు. తద్వారా బొట్టిసెల్లీ చిత్రం అతనికి “transitional object”లా, అంటే మధ్యవర్తిత్వం చేసే వస్తువులా, ఓడెట్ కూ, స్వాన్ ఊహల్లోని ‘ఐడియల్ ఇమేజీకీ’ వంతెనగా మారుతుంది.

స్వాన్ ప్రేమలో ఐరనీ ఏంటంటే, అతను తాను సృష్టించుకున్న భ్రమతోనే ప్రేమలో పడతాడు. అలాగని స్వాన్ ఏదో డెల్యూషనల్ అనో, పిచ్చివాడనో అనుకోలేం! అతనిది చాలా “ఆధునికమైన ప్రేమ” దాన్ని కళ, సంస్కృతి, ఎస్థెటిక్స్, చరిత్ర- ఇవన్నీ వాడుకుని మరీ సమర్థించుకుంటాడు. సాధారణమైన వ్యామోహాన్ని పూర్తిస్థాయి కళాత్మక అనుభవంగా మార్చుకుంటాడు. కవి రిల్కే కూడా ప్రేమను మనలోపలి ప్రపంచాన్ని విస్తరించే అనుభవంగా చూస్తారు. కానీ రిల్కే, ప్రేమలో దూరాన్ని గౌరవించమని నేర్పుతారు. దీనికి భిన్నంగా, స్వాన్ ఆ దూరాన్ని తట్టుకోలేడు, అతనికి నిజమైన ఓడెట్ కంటే, తనకు అందుబాటులో ఉండే ఆమె తాలూకూ ఊహే అపురూపం. అది అతనికి ప్రాణవాయువుతో సమానం.

నిజానికి మనుషులందరూ ఇంతేనేమో! వారు తమ అనుభవాలకు అర్థం ఇవ్వకుండా ఉండలేరు. కానీ ఆ క్రమంలో మనసుకు నచ్చచెప్పుకునే కథే వాస్తవాన్ని కప్పేస్తుంది. మనకు వాస్తవం కంటే దానిగురించి తయారు చేసుకున్న కథే ఎక్కువ అవసరం, ఆసరా అవుతుంది. మనిషిలో మనం చూసే ప్రత్యేకత నిజంగా ఆ మనిషిలో ఉంటుందా? లేక మనలో ఉండే లోపాలూ, మన గతానుభవాలు, మనం చదివిన పుస్తకాలూ, ఆస్వాదించిన కళలూ, భావోద్వేగాలు, ఒంటరితనం- ఇవన్నీ కలిసి ఆ మనిషికి లేనిపోని ప్రత్యేకతను ఆపాదించాయా? ఒక సంబంధంలో మనం ప్రేమించేది ఎదుటివ్యక్తినా, లేక ఆ వ్యక్తిలో మనం చూడాలనుకుంటున్న మన ప్రపంచాన్నీ, రూపాన్నా? మిలియన్ డాలర్ ప్రశ్నే!

ప్రూస్ట్‌ను చదవడంలో ఒక విశేషం ఉంది. అసలు కథేమిటా అని వెతుక్కోకుండా ఆయన సృష్టించిన ప్రపంచంలో అలా నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటే దారిలో మనం ఊహించని అనేక అద్భుతాలు కనిపిస్తాయి. వాటిల్లో ప్రూస్ట్ పెయింటింగ్స్ గురించి రాసిన భాగాలు కొన్ని. ప్రపంచ ప్రఖ్యాతచిత్రాలు, చిత్రకారులు, సంగీతం, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్, ప్రదేశాలు- ఇలా సమస్తమైన ఆర్టిస్టిక్ ప్రపంచాన్నీ ఇవేమీ తెలీని పాఠకుల చేయి పట్టుకుని దగ్గరుండి మరీ సింహావలోకనం చేయిస్తారు. “In Search of Lost Time”లో ప్రూస్ట్ పెయింటింగ్స్ గురించి రాసిన వర్ణనలు చదువుతున్నప్పుడు అసలు కథలో పాత్రల కంటే వాటిదగ్గరే ఎక్కువసేపు ఆగిపోయేదాన్ని. ఒక్కోచిత్రాన్నీ ఆయన కళ్ళతో చూస్తుంటే, మామూలుదృష్టిని దాటిపోయే లేయర్స్ అన్నీ ఒక్కోపొరా విడదీసి చూస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రత్యేకం పెయింటింగ్స్ గురించిన ఈ భాగాలు చదువుతున్నప్పుడు మన ఎదురుగా ఉన్న మనిషిని వాస్తవంగానే చూస్తున్నామా లేక మనదైన ప్రత్యేకమైన ఫిల్టర్ లోంచి చూస్తున్నామా? అనే అనుమానం తప్పకుండా వస్తుంది. ఆ ఫిల్టర్లు ఏదో ఒకచిత్రమో, జ్ఞాపకమో, అనుభవమో, కోరికో- ఇలాంటివేవైనా కావచ్చు. అందుకేనేమో, ప్రూస్ట్‌ను చదవడం నాకు తెలీకుండానే వ్యక్తిగతమైన అనుభవంగా మారిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *