- మెరుపు తీగెలు
సభ మొదలయ్యింది.
సభికులు ప్రజలు కాదు, పాఠకులు. ఆ పాఠకులు కూడా వొకప్పటి రచయితలే. రచయితల సభలో రచయితలు కాక యెవరు యెందుకు వుంటారని గడుసుగా సమాధానం యివ్వగలరు కూడా నిర్వాహకులు. ఆమాటకొస్తే నిర్వాహకులు కూడా రచయితలే. అంచేత అందరూ రచయితలే అని చెప్పుకుంటే గొప్పగా గర్వంగా వుంటుంది. సాహిత్యోద్యమాలు జరిగిన నేలమీద సాహిత్య వుత్సవాలు జరగడంతో అందరూ వుత్సాహంగా వున్నారు. ప్రగతివాదులూ అభ్యుదయవాదులూ విప్లవవాదులూ సమస్త అస్తిత్వవాదులూ కార్పొరేట్ వాదులూ వొకప్పటి ప్రభుత్వకవులూ యిప్పటి ప్రభుత్వకవులూ నిత్య ప్రతిపక్షకవులూ స్వచ్చంద సంస్థల కవులూ యింకా అన్ని పీఠాలూ అన్ని ముఠాలూ అందరూ భాగం కావడంతో ఐక్యతానందం వెల్లివిరుస్తోంది.
అందరూ పాల్గొనడం వల్ల… సమయ పాలన మరీముఖ్యం కావడం వల్ల… సాహిత్యకారులు తమ ‘వాక్’ను నిముషాలు కాదు, సెకన్లతో సహా పాటిస్తున్నారు… వాచ్ చూసుకుంటూ పరుగులు తీస్తూ. కుండమీద కుండ కుండమీద కుండ పేర్చినట్టు సెషన్ మీద సెషన్ సెషన్ మీద సెషన్ జరిగిపోతున్నాయి. ఎవరి సంత… సారీ, యెవరికి నచ్చిన టాపిక్ దగ్గర వాళ్ళే. కొత్త సెషన్ మొదలైంది. వేదిక మీదికి పిలిచారు. “కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును రిజెక్ట్ చేసిన ప్రముఖ తమిళ రచయిత్రి…” చప్పట్ల మధ్య ఆమె పేరు వినిపించలేదు, వినిపించినా కొందరికి అర్థం కాలేదు. “ప్రముఖ కేంద్ర యువ పురష్కార గ్రహీత…” చప్పట్ల మధ్య ఆమె పేరూ వినిపించలేదు, కాని మనిషిని చూసి పేరు తెలుసుకున్నారు.
సాహిత్యానికి మంచిరోజులు వచ్చాయని సాహిత్య పిపాసకులు తెగ సంబరపడ్డారు. ‘ఎల్లలోకము వొక్క యిల్లై…’ అని మహాకవి వాక్కు నిజమైందని మరికొందరు కితాబిచ్చారు. “అంతా బావుంది… అవార్డు రిజెక్ట్ చేసినా గౌరవమే… తీసుకున్నా గౌరవమే!” అంది గుసగుసగా వో గొంతు. “మరి?, వారికి అవార్డు రిజెక్ట్ అవకాశం వుంది. వీరికి అవార్డు తీసుకొనే అవకాశముంది…” మరో గొంతు చెపుతుంటే, “ఆ యిరువుర్నీ సమంగా చూసే అవకాశం మన సాహిత్యకారులకి వుంది” అంది యింకో గొంతు. వారి మాటలకు మెచ్చుకోలుగా అన్నట్టు అప్పుడే కరతాళధ్వనులు! ఆ విధంగా సాహిత్య సభలు కళకళలాడుతూ విజయవంతమయ్యాయి!





