స్మరించుకున్నప్పుడల్లా
ఒళ్లంతా ఉవేత్తున ఎగిసిన
నది అలాయి నడుస్తుంది,
మనిషిగా నన్ను కవిగా!
మనిషి కోసమే కదా అతడు
నదులను కలుపుకొని త్రాగింది
కాళ్లకు సముద్రాన్ని జోడు చేసుకుని
నడిచింది
అతడు ఎప్పుడు చీకటి మీద
చిటికెసినప్పుడల్లా, శబ్దం పద్యమై
పులి, పిల్లోడిని కూర్చోబెట్టుకొని వచ్చినట్లు
సూర్యుడిని మోసుకొచ్చేది
పులికి, పిల్లోనికి, ఇలాంటి వీరునికి
సూర్యుడికి, సూర్యుడి లాంటి మనిషికి,
మనిషిలాంటి ఒంటరికి, ఒంటరి లాంటి సమూహానికి,
అవును… అతడు, పద్యానికి
ప్రాణం పోసిన శబ్దానికి ప్రతినిధి
రేపటి చరిత్రతో ఒక వారిది!
చూడు, కళ్ళు నలుపుకుంటూ
కాళోజిని తలుచుకుంటేనే
అల మీద పావురాలు గుంపులుగుంపులుగా
అలా అలా ఎగురుతున్నవి.
తల మీద చిలుకలు చూడు
ప్రేమ గూడు అల్లుకుంటున్నవి.
హౌరా కవి!
కాలాన్ని జయించిన కాలం ముందు కవి
కవి నాయక కవి
జయహో కాళోజి కవి
జన జ్వాల
(సెప్టెంబర్ 12, మహాకవి కాళోజి జయంతి సందర్భంగా)





