ఔను వాళ్ళేమీ తత్వశాస్త్రాన్ని చదవలేదు
పదిహేను ఇరవై ఏళ్ళ మధ్య వారే
పుస్తకాలతో కుస్తీ పట్టి
ఈ దేశంలో నైపుణ్యత సాధించాలనే తపన గలవారే!
ఒకే ఒక్క లీక్ కాదు వందల లీకులు
భవిష్యత్ అంధకారమై పోతుందనే కోపం
ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ
ఇక లాభం లేదని అడుగులు రాజధానివైపు పడ్డాయి
ఒక్కో గొంతు పెగులుతుంటే
వెతుక్కున్నా దొరకని జవాబులు
అంధభక్తి లో కూరుకుపోయి
వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్న వైనం
చేతిలో లాఠీ సైతం నివ్వెరపోతుంది చేతనాన్ని చూసి
మేను కాయలు కాస్తున్నా అరుస్తూనే వున్న గొంతులు
మరో ప్రపంచపు గుమ్మానికి తోరణాలై తీరతాయి
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న జంతర్ మంతర్
న్యాయం దక్కేదాకా ఆవేశం గొంతుల్లో ప్రతిధ్వనిస్తుంది
ఆలోచన చిన్ని బుర్రల్లో పుట్టి ఏ జెండాలు పట్టుకోకుండా
ఒకే ఎజెండా గా వణికిస్తుంది
పసి గుండెలపై మోదుతుంటే రాలిన కన్నీటి చుక్కలు
వరదలై ఉప్పెనై ఎగసిపడుతుంటే
మండుతున్నాయి గుండెలు
ఆకలి లేదు దప్పిక లేదు
ఉన్నదల్లా నిరంకుశత్వ కోరలు పీకటమే!
ఖాకీల ముసుగులో
రాజ్యం గూండాలు చెలరేగి పోతుంటే
ఒక్కో స్మార్ట్ ఫోన్ ఒక్కో అరాచకాన్ని
అంతర్జాలం లో వదిలేస్తుంటే
భారతం రుధిరం సలసల కాగుతుంది
నియంతల నిగ్గు తేల్చేదాకా
పట్టు సడలించకూడదనే తెగువ
ఆ కూనల కళ్ళల్లో కనిపిస్తుంది
అదే ప్రజాస్వామ్య ఊపిరి.





