– అమరవీరులకు తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ నివాళులు
– తెలంగాణ సమరయోధుల చరిత్రను విస్మరించిన కాంగ్రెస్, బీఆరఎస్‌లు
– తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ కన్వీనర్ శ్రీవర్ధన్ రెడ్డి
వీరబైరాన్‌పల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 27: వీరబైరాన్‌పల్లి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 1947 ఆగస్టు 27న రజాకారుల దాడిలో వీరబైరాన్‌పల్లిలో 118మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. నిజాం, రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ప్రాణాలు ఒడ్డి పోరాడారని తెలిపారు. రజాకారుల దమనకాండను రెండు దఫాలుగా ఎదుర్కొని వీరబైరాన్‌పల్లి ప్రజలు, అమరవీరులు చూపిన ధైర్యసాహసాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానంలో నిజాం నిరంకుశ పాలన కొనసాగిందని తెలిపారు. తెలంగాణ ప్రజలపై సాగిన దమనకాండకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వీరబైరాన్‌పల్లి ఘట్టం విషాదకరమైనదైనా ప్రజల పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందన్నారు. వీరబైరాన్‌పల్లి పోరాట ఘట్టంతోపాటు తెలంగాణ విమోచన పోరాటంలోని చారిత్రక సంఘటనలను నేటి, భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చరిత్రను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అనేక సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్, గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆరఎస్ తెలంగాణ విమోచన పోరాట చరిత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని శ్రీవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎంకు భయపడి, ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ ప్రజల గొప్ప పోరాట చరిత్రను మరుగునపరిచారని ఆరోపించారు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం, చరిత్ర గురించి మాట్లాడిన గత పాలకులు అధికారంలో ఉన్న సమయంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించేందుకు ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణ విమోచన చరిత్రకు తగిన గౌరవం కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో సెప్టెంబర్ 17ను అధికారికంగా ఘనంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అమరవీరుల త్యాగాలు, తెలంగాణ విమోచన పోరాట చరిత్రను ప్రజలకు విస్తృతంగా తెలియజేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
చరిత్రను వాస్తవాలతో ప్రజలకు తెలియజేయాలి
మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ తెలంగాణ విమోచన పోరాట చరిత్రను వాస్తవాలతో ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. అమరవీరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కమిటీ సభ్యుడు కప్పర ప్రసాద్ మాట్లాడుతూ విమోచన పోరాట చరిత్రను వాస్తవాలు, చారిత్రక ఆధారాలతో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ పార్టీల పాత్రను కూడా చారిత్రక ఆధారాలతో ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి వారిని సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. వీరబైరాన్‌పల్లి పోరాట ఘటనలను చిన్న తనంలో ప్రత్యక్షంగా చూసిన పెద్దలతో మాట్లాడారు. అమరవీరుల కుటుంబాలకు తగిన గౌరవం, గుర్తింపు కల్పించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి కేవీఎలఎన్ రెడ్డి, సురేష్, కార్యక్రమ కన్వీనర్ శ్రీనివాస్, కో-కన్వీనర్ సురేష్, అమరవీరుల కుటుంబ సభ్యులు, నాటి సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన పెద్దలు, బీజేపీ గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




