కేయూ ఫార్మసీ కళాశాలను సందర్శించిన ఫార్మకాలజీ నిపుణుడు ప్రొఫెసర్ ఆఫ్తాబ్

  • అంతర్జాతీయ పరిశోధనా సహకారానికి అంగీకారం!
  • కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ద్వారా పరిశోధనా నిధులు, ఫెలోషిప్, ఎంయూవోకు హామీ
  • కేయూ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జానాపరెడ్డి కృష్ణవేణి, అధ్యాపక బృందం ఆధ్వర్యంలో సన్మానం

హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌ : సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న ప్రతిష్ఠాత్మక కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్, ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆఫ్తాబ్  అహ్మద్ (Prof Aftab Ahmad) గురువారం కాకతీయ విశ్వవిద్యాలయములోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌ను సందర్శించారు. ఆచార్య గాదే సమ్మయ్య ప్రత్యేక ఆహ్వానం మేరకు భారత పర్యటనలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఆయన, కళాశాలలోని పరిశోధనా ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలు, విద్యా సౌకర్యాలను పరిశీలించారు.  కళాశాలలోని పరిశోధనా మౌలిక సదుపాయాల నాణ్యతతో పాటు ప్రిన్సిపాల్ జానాపరెడ్డి కృష్ణవేణి, ప్రొఫెసర్ సమ్మయ్య, ఇతర అధ్యాపకులు నిర్వహిస్తున్న పరిశోధనలను ఆయన ప్రశంసించారు.

అలాగే ప్రొఫెసర్ అహ్మద్ పీహెచ్‌డీ పరిశోధకులు, మాస్టర్స్ విద్యార్థులు, అధ్యాపకుల కోసం ఒక అకడమిక్ ఉపన్యాసాన్ని కూడా అందించారు. వినూత్నమైన, కఠినమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన పరిశోధనలను చేపట్టి ఫార్మాస్యూటికల్, హెల్త్ సైన్సెస్ రంగాలకు అర్థవంతమైన సేవలందించాలని ఆయన విద్యార్థులు, యువ పరిశోధకులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆప్తాబ్ అహ్మద్   కొలాబరేషన్ రీసెర్చ్, పరిశోధన సహకారాన్ని చేయడానికి ఉత్సాహంగా ఉన్నానని,  జెడ్డాలోని కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీ ద్వారా కొలబరేషన్ రీసెర్చ్‌కు , పరిశోధనకు  అయ్యే ఖర్చును,  ఒక ప్రాజెక్టు అసిస్టెంట్  కోసం ఫెలోషిప్ ఇప్పించడానికి తన యూనివర్సిటీ ద్వారా ఎంఓయూ తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్శనలో కెయు  ఫార్మ‌సీ విభాగానికి చెందిన అధ్యాపకులతో కలిసి పరిశోధనా సహకారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రొఫెసర్ అహ్మద్ అంగీకరించారు.

ఈ సందర్భంగా ఆచార్య గాదే సమ్మయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ ఆప్తాబ్ అహ్మద్‌కు 25 ఏళ్ల‌కు పైగా అకడమిక్, పరిశోధనా అనుభవం ఉంద‌ని  తెలిపారు.   ప్రొఫెసర్ ఆఫ్తాబ్ అహ్మద్ ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ రంగాలలో విశిష్టమైన విద్యావేత్త, పరిశోధకుడు, రచయిత, పరిశోధనా సలహాదారుగా గుర్తింపు పొందారని తెలిపారు.  బోధన, శాస్త్రీయ పరిశోధన, విద్యార్థుల పర్యవేక్షణ, అకడమిక్ అభివృద్ధి రంగాలలో ఆయనకు 25 ఏళ్ల‌కు పైగా అనుభవం ఉందని, ప్రస్తుతం ఆయన సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీలో ఫార్మకాలజీ ప్రొఫెసర్‌గా సేవ‌లందిస్తున్నారని, అలాగే, కింగ్ అబ్దులఅజీజ్ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఫర్ డ్రగ్ రీసెర్చ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా ఉన్న ఫార్మాకోవిజిలెన్స్ మెడికేషన్ సేఫ్టీ యూనిట్‌తో కూడా ప‌నిచేస్తున్నార‌ని చెప్పారు.

ఆయన పరిశోధనా  ఫార్మకాలజీ, ఫార్మాకోవిజిలెన్స్, ఔషధ భద్రత, హెర్బల్ మెడిసిన్, ఫైటోకెమిస్ట్రీ, సహజ ఉత్పత్తులు, ఆక్సిడేటివ్ స్ట్రెస్, మెటబాలిక్ డిజార్డర్స్, క్యాన్సర్ ఫార్మకాలజీ, న్యూరోఫార్మకాలజీ, కార్డియోవాస్క్యులర్ ఫార్మకాలజీ, మాలిక్యులర్ డాకింగ్, అధునాతన ఔషధ పంపిణీ వ్యవస్థలు ఉన్నాయి. సహజంగా లభించే బయోయాక్టివ్ సమ్మేళనాల చికిత్సా సామర్థ్యం మరియు వాటి చర్యా విధానాలను అధ్యయనం చేయడానికి ఆయన ప్రయోగాత్మక ఫార్మకాలజీని కంప్యూటేషనల్ విధానాలతో సమన్వయం చేస్తూ బహుళశాఖల పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ అహ్మద్ 150కు పైగా శాస్త్రీయ పరిశోధనా వ్యాసాలకు రచయితగా, సహ రచయితగా ఉన్నారు. అదనంగా, అనేక పుస్తక అధ్యాయాలు, అకాడమిక్ పుస్తకాలను కూడా రచించారు. ఆయన పరిశోధనా వ్యాసాలలో ఎక్కువ భాగం వెబ్ ఆఫ్ సైన్స్, స్కోపస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ డేటాబేస్‌లలో ఇండెక్స్ చేయబడిన ప్రతిష్ఠాత్మక జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. వీటిలో అనేక జర్నల్స్ క్యూ1, క్యూ2 క్వార్టైల్ ర్యాంకింగ్‌లను కలిగి ఉన్నాయి.

కాకతీయ యూనివర్సిటీతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ను ప్రొఫెస‌ర్ ఆఫ్తాబ్‌ సందర్శించారు. ఆచార్యులు డాక్టర్ రమా, డాక్టర్ నందకిషోర్ కుమార్ ను కలిశారు. ప్రొఫెసర్ ఆఫ్తాబ్ అహ్మద్ ను ఫార్మసి కళాశాల ప్రిన్సిపాల్ జానప రెడ్డి కృష్ణవేణి, ఇతర ఆచార్యులు నరసింహారెడ్డి, ప్రసాదు, సమ్మయ్య నాగరాజు, స్వరూప రాణి, షాయదా, సునీత, ఉషా కిరణ్ మై, ప్రియాంక, సుకన్య, సుజాత, సంగీత్, భాగ్య, శశిధర్, విద్యార్థిని విద్యార్థులు  శాలువా, మెమెంటోతో  ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *