కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం భ్రమ
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఉన్న ప్రధాన లోపం ప్రతిపక్ష పార్టీ లేకపోవటమే అనేది అందరూ వర్ణించేది, దేశం స్వతంత్రమే దాదాపు 40 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తీరనిదీ అయిన విశేషమే. ఎన్నికలు గెలిచి అధికారానికి వచ్చిన పార్టీపైననే పటిష్టమైన ప్రతిపక్షాన్ని నిర్మించే బాధ్యత ఉంటుందో లేదో కాని అధికారం చేయించే తప్పుడు పనులకు ప్రజలు కినిసి ప్రతిపక్షావిర్భావానికి దోహదం కావచ్చు. ప్రతిపక్షంగా నిలదొక్కుకొనటం సంగతి అట్లా ఉంచండి. అధికార పార్టీ చేతలకు కినిసి గద్దెదించి పళ్లెంలో పెట్టి అర్పించినప్పటికి నిల్పుకోలేకపోయిన ఘనత కూడ మన దేశంలోని ప్రతిపక్షాలకే వర్తిస్తుంది. నిజానికి వీరందరూ ప్రతిప్రక్ష వాచ్యులే కాని ప్రతిపక్షం కాదు. కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ మాత్రమే నిజమయిన ప్రతిపక్షాలు, ప్రత్యామ్నాయంగా అవతరించగల అర్హత కూడ ఆ పార్టీలకే ఉంది. సత్తాలేక పోవటం వేరే విషయం.
స్వాతంత్య్ర సమర కాలంలో రకరకాల ధృక్పధాలు గల పార్టీల వ్యక్తుల నేతృత్వంలో పోరాటం జరిగినప్పటికీ భారత జాతీయ కాంగ్రెసుకు మహాత్మాగాంధీ. నేతృత్వం వహించి సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమం వంటి ఉద్యమాలతో భారత ప్రజల్ని ఏకత్రితం చేయగా ఆ ధాటికి తట్టుకోలేని తతిమ్మా పార్టీలన్నీ కాంగ్రెసు పార్టీలోనే గ్రూపులుగా ఉంటూ వచ్చినై. పోరాటం చివరి దశలో స్వంత పార్టీలు పెట్టుకున్నవారిలో కమ్యూనిస్టులు, సోషలిస్టులు కూడ ఉన్నారు. కాంగ్రెసు సంస్థ భారత జాతీయ సంస్థ కాగా, ఆ సంస్థ నాయకులు జాతీయ నాయకులే అయినారు. కాంగ్రెసు అధ్యక్షుణ్ని ఆ రోజుల్లో ‘‘రాష్ట్రపతి’’ అని పిలిచేవారు.
దేశ స్వాతంత్య్రం తరువాత నెహ్రూ నాయకత్వంలో భారత ప్రభుత్వం పరిపాలన చేపట్టింది. ఆయన నాయకత్వంలో కాంగ్రెసు అధికార పార్టీగా ఆమోదిస్తూ వచ్చిన తీర్మానాలు (ఆవడి, నాగపూర్, భువనేశ్వర్) సోషలిస్టు ఉద్యమాన్ని చితగ్గొట్టవేయగా హెచ్చుమండి కాంగ్రెసులో కలిసిపోయారు. కమ్యూనిస్టులు, లేదా వామపక్షాలు భారతీయ జనతాపార్టీ తప్ప పాత కాంగ్రెసు, కాంగ్రెసు(ఎస్) జనతాపార్టీ వంటి పార్టీలు కాంగ్రెసు నుండి చీలి వచ్చిన పార్టీలే, ఈ పార్టీలన్నీ ఇదివరకు జనతా పార్టీగా కలిసిపోయినప్పుడు, కమ్యూనిస్టులు కలిసిరాలేదు సరికదా ఆపత్సమయంలో సహకారం కూడ ఇవ్వలేదని అందరికీ తెలుసు. జనతా అనుభవం పొందిన ప్రజలు పార్టీలు ఇక అటువంటి పద్ధతిని కోరుకుంటారనుకోలేం. కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించి, ఆయారాష్ట్రాల పాలనాధికారం చేపట్టినై. ఈ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెసునకు తాము వ్యతిరేకం కనుక ప్రతిపక్షాలుగా మనుగడ సాగించి భావించాలనుకుంటున్నాయి.
తమిళనాడులో కీ.శే. అన్నామలై నేతృత్వాన ఆవతరించి, ఆ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన డి.ఎం.కె. ఆదిలో కాంగ్రెసు వ్యతిరేకత ద్వారానే నిలదొక్కుకునే యత్నం చేసింది. డి.ఎం.కె. అన్నా డి.ఎం.కె. రెండు కావటంతో ధోరణి మారి పోయింది. జమ్ము కాశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్సు అదేమార్గం త్రొక్కింది. ఆకాలీలు దాదాపు అదేదారికి వస్తున్నారు. అస్సాంలోని విడిపి మిజోరంలోని రాష్ట్రాలలో పార్టీలు కాంగ్రెసుకు వ్యతిరేక పక్షాల్ని పంపగలవా కావా విస్పష్టం కావటానికి మరి కొంతకాలం పట్టుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం శ్రీ ఎన్.టి. రామారావు గారి పార్టీయే కాంగ్రెసు వ్యతిరేక మార్గమే మాది అంటుంటారాయన. అంతేకాదు దేశంలోనిపైన పేర్కొన్న ప్రతిపక్షాలను కలిపేయత్నం ప్రారంభించి – భారతదేశం పార్టీ అని ఇప్పుడు సమాఖ్య అంటూ వస్తున్నారు. ఢిల్లీ లో ఈ సదాశయంతోనే ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని సమావేశ పరుస్తున్నారు. శ్రీ రామారావు గారు కానీయండి లేక మరో ప్రాంతీయపార్టీ లేక జాతీయ వామ- ప్రతిపక్ష పార్టీ కానీయండి. కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయం నిర్మించ గల్గడం సాధ్యమే కావచ్చు, కాని అసలు ఆ ఊహే సరికాదు. జాతీయస్థాయిలో ఒక పటిష్టమైన పార్టీ నిర్మాణానికి యత్నించాలి గాని కాంగ్రెసుకు ప్రత్యాన్నూయం కాదు.
వరంగల్ వాణి తేది. 14-5-1987
1987 మే 14న వరంగల్ వాణిలో ఎం. ఎస్. ఆచార్య రాసిన “కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం భ్రమ” అనే సంపాదకీయం, నేటి భారత రాజకీయాలను చూసినప్పుడు ఒక ఆసక్తికరమైన చారిత్రక పత్రంగా మాత్రమే కాకుండా, భారత ప్రజాస్వామ్య స్వభావంపై లోతైన రాజకీయ విశ్లేషణగా కనిపిస్తుంది. ఆచార్య గారు చేసిన ప్రధాన వాదన ఏమిటంటే—దేశానికి అధికార కాంగ్రెసును ఓడించే తాత్కాలిక కూటమి అవసరం కావచ్చు; కానీ “కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం” అనే ఒకే లక్ష్యంతో పార్టీని నిర్మించడం రాజకీయంగా సరైన ఆలోచన కాదు. దేశవ్యాప్తంగా తనదైన సిద్ధాంతం, సంస్థాగత బలం, ప్రజా ఆధారం కలిగిన పటిష్టమైన రాజకీయ శక్తి అవసరం.
నలభై సంవత్సరాల తరువాత భారత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ ఇక ఒకప్పుడు ఉన్న ఏకైక ఆధిపత్య పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాల్లో ప్రధాన ఆధిపత్య శక్తిగా ఎదిగింది. అయినప్పటికీ, ఆచార్య గారి అసలు ప్రశ్న మాత్రం ఇంకా సజీవంగానే ఉంది: ప్రజాస్వామ్యానికి అవసరమైనది కేవలం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కూటమా? లేక అధికారాన్ని సవాలు చేయగల, ప్రత్యామ్నాయ రాజకీయ దృష్టి కలిగిన పటిష్టమైన ప్రతిపక్షమా?
ఆచార్య గారి సంపాదకీయం వెలువడిన కాలాన్ని గుర్తుంచుకోవాలి. అది అత్యవసర పరిస్థితి అనంతర కాలం. 1977లో కాంగ్రెస్‌ను ఓడించి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆ ప్రయోగం నిలబడలేదు. పరస్పర విభేదాలు, వ్యక్తిగత నాయకత్వ పోటీలు, భిన్న సిద్ధాంతాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల జనతా పార్టీ విచ్ఛిన్నమైంది. అందుకే ఆచార్య గారు, కేవలం “కాంగ్రెస్ వ్యతిరేకత” అనే నినాదంతో ఏర్పడిన రాజకీయ కూటమి శాశ్వత ప్రత్యామ్నాయం కాలేదని సూచించారు.
రాజకీయ ప్రశ్న: “బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి?”
నేడు అదే చరిత్ర మరో రూపంలో మన ముందున్నది. ఇప్పుడు ప్రశ్న “కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఎవరు?” కాదు. కాంగ్రెస్ స్థానాన్ని చాలావరకు భారతీయ జనతా పార్టీ ఆక్రమించింది. అందువల్ల నేటి ప్రధాన రాజకీయ ప్రశ్న: “బీజేపీకి ప్రత్యామ్నాయం ఏమిటి?” 2024 లోక్‌సభ ఎన్నికలు ఈ ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాయి. బీజేపీ 240 స్థానాలకు పరిమితమై, స్వంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కాంగ్రెస్ 99 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాది పార్టీ 37, తృణమూల్ కాంగ్రెస్ 29, డీఎంకే 22 స్థానాలు గెలవడం ద్వారా ప్రతిపక్ష రాజకీయాలు పూర్తిగా అంతరించిపోలేదని స్పష్టమైంది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పడటానికి ఎన్డీయేకు 293 స్థానాల మెజారిటీ లభించింది. ఇది ఆచార్య గారి వాదనకు కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఒక పార్టీకి ప్రత్యామ్నాయంగా మరో పార్టీని నిలబెట్టడం కంటే, ప్రజాస్వామ్యంలో అధికార కేంద్రీకరణను నియంత్రించగల రాజకీయ శక్తుల సమతుల్యత అవసరం.
( రేపటి సంచికలో ఎన్.టి. రామారావు ప్రయత్నం నుంచి INDIA కూటమి వరకు}





