మా పాలనలోనే సామాజిక న్యాయం

– ఇది బహుజనుల తెలంగాణ
– పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్
– ఆయన స్ఫూర్తి ఎప్పటికీ ప్రజలకు ఉండాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్తు 18 : ఇది బహుజనుల తెలంగాణ.. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయం ఎదుట సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన స్ఫూర్తిని పంచాలని చాలాకాలంగా గౌడ సోదరులు అడుగుతున్నారని, ట్యాంక్ బండ్‌పై ఉన్న పర్యాటక కార్యాలయాన్ని కూల్చివేసి పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించానని చెప్పారు. పర్యాటకులు, సందర్శకులు ట్యాంక్ బండ్‌పైకి వచ్చినప్పుడు పాపన్న గౌడ్ దర్శనం జరిగి ఆయన స్ఫూర్తి వారిలో నిండాలని కోరుకున్నానన్నారు. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన తన కులం, కుటుంబం కోసమే పనిచేయక బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలన్నారు. మహారాష్ట్రలో శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో తెలంగాణలో బహుజనులు కూడా పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారన్నారు. బ్రిటిష్ లైబ్రరీలో పాపన్న గౌడ్ విశేషాలు ఉన్నాయని, అక్కడినుంచే మనం ఆయన చరిత్రను తెలుసుకున్నామని చెప్పారు. బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కిందని వివరించారు. వందల ఏళ్లు గడిచినా ఆయనను తలుచుకుంటున్నామంటే ఆయన పోరాటం ఎంత అద్భుతమైనదో అర్థం చేసుకోవచ్చునన్నారు. ఈ అద్భుతమైన విగ్రహాన్ని కాపాడుకునే బాధ్యత గౌడ సోదరులదేనని అన్నారు. విగ్రహం దగ్గర మంచి వెలుగుల ఏర్పాట్లతోపాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇస్తున్నానన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం స్థాయిలో పాపన్న గౌడ్ విగ్రహానికి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసునంటూ అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. ఇది సామాజిక న్యాయం, సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అందరిది అన్నారు. బాలా గౌడ్, మల్లికార్జున్ గౌడ్ లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు. మహేష్ గౌడ్ గాంధీ భవన్‌లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు తాను, భట్టి విక్రమార్క రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రిగా తాను పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం అని రేవంత్ చెప్పారు. గౌడన్నలు నూటికి నూరు శాతం సహకరించాలని కోరారు. గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని, అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. ప్రభుత్వ పొలాల్లో ఈత, తాటి మొక్కలు నాటేలా చూస్తామన్నారు. కాల్వ గట్లపైన కూడా ఈత, తాటి మొక్కలు నాటాలన్నారు. పదేళ్లు పరిపాలించిన వాళ్లు తమ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో మీడియా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని విమర్శించారు. బర్రెలు, గొర్రెలు పెంచుకోండి, చెప్పులు కుట్టుకోండి.. చేపలు పట్టుకోండి అని గత ప్రభుత్వం చెప్పిందని, మనం బర్రెలు, గొర్రెలు పెంచుకుంటుంటే వాళ్ల పిల్లలు రాజ్యాలు ఏలుతారని ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. తరతరాల కులవృత్తితోనే పిల్లలను చదివించుకున్నారు. ఆ వర్గాల పిల్లలు చదివి వైద్యులు, న్యాయవాదులు, ఐఏఎస్‌లుగా మారి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆనాడు తాను చెప్పానన్నారు. ఈనాడు చైతన్యం వచ్చింది. చదువుకోవడం వల్ల మధు యాష్కీ గౌడ్ అమెరికా వెళ్లారు. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. కులవృత్తిని కొనసాగించండి, గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి. విద్యార్థుల కోసం ఎన్ని కోట్లైనా కేటాయిస్తాం. నాణ్యమైన విద్యతోపాటు భోజనం కూడా ఇస్తాం. గతంలో సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదు. తమ ప్రభుత్వం పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం, నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నది.. పాలు, రాగి జావ ఇస్తున్నాం.. మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం అని చెప్పారు. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి.. వాళ్లను చదివించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుంది సీఎం అన్నారు. ఏటీసీల్లో చేరేవాళ్లకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం ఇస్తున్నామన్నారు. గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం మనది అని చెప్పండి. రెండోసారి 117 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకు కేటీఆర్‌ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మహేష్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసింది.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు, కేటీఆర్ మంత్రులయ్యారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పొన్నం, వాకిటి, సీతక్క, కొండా సురేఖ మంత్రులయ్యారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే సంతోష్ రావును రాజ్యసభకు పంపారు. తాను ముఖ్యమంత్రి అయితే అనిల్ కుమార్ యాదవ్‌ను, వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఓడిపోయిన వినోద్ రావును ప్రణాళికా సంఘం చైర్మన్‌ను చేశారు.. తాను కోదండరామ్‌ను ఎమ్మెల్సీని చేశాను. కేసీఆర్ సీఎం అయితే తన బిడ్డను ఎంపీ, ఎమ్మెల్సీ చేశాడు.. తాను  వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలిని, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మలను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా నియమించానని గుర్తు చేశారు. కేసీఆర్‌ది కుటుంబ న్యాయం.. మాది సామాజిక న్యాయం.. కేసీఆర్‌ది దొరల న్యాయం.. మాది సామాజిక న్యాయం అని చెప్పారు. వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. తాము గ్రామగ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామంటూ కేసీఆర్ పదేళ్లలో కడితే 20 లక్షల ఇళ్లు నిర్మాణం అయ్యేవన్నారు. కానీ ఆయనకు పేదోడి ఇంటిపై ఆలోచన లేదని, దిశ సరిగా లేకపోతే దశ సరిగా ఉండదని అన్నారు. ఈ ప్రభుత్వం మీది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి అని పిలుపునిచ్చారు. అందెశ్రీ పాటకు విముక్తి కల్పించామని, గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపామని, బీసీ కులగణన చేశామని, ఎస్సీ వర్గీకరణ చేశామని, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నామని వివరించారు. రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పు మాకు ముప్పుగా మారిందన్నారు. ఏడాదికి రూ.75 కోట్ల వడ్డీని కేసీఆర్ అప్పులకు కడుతున్నామన్నారు. రూ.36 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చాం.. రూ.95 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం.. రూ.60 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాం అని చెప్పారు. యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం, క్రీడా అకాడమీని ప్రారంభించుకున్నామన్నారు. తాము చేసినవన్నీ చెబితే వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రారని, చెబుతున్న అబద్ధాలను నమ్మడం లేదని కర్ణాటక, తమిళనాడుకు వెళ్లి అఘోరా రావు చేతబడి పూజలు చేయించి వచ్చాడని సీఎం రేవంత్ విమర్శించారు. అధికారం కోసం ఇంతకు దిగజారుతారా అని ప్రశ్నించారు. ఏది ఉన్నా మాట్లాడుకుని ముందుకు వెళ్దాం.. ఈ ప్రభుత్వం మనది అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంత రావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, విప్ బీర్ల ఐలయ్య, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ప్రకాష్ గౌడ్, మందుల సామెల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ మట్టి బానిసత్వాన్ని భరించదు

సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే ప్రజా పాలన
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ మట్టి బానిసత్వాన్ని భరించదని, అణచివేతను అసలే సహించదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 17వ శతాబ్దంలోనే అణచివేతపై తిరుగుబాటు చేసి, బహుజనులను ఏకం చేసి గోల్కొండ కోటను సాధించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన బాటలోనే నేటి ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆవిష్కరించిన అనంతరం సచివాలయ ప్రాంగణంలో నిర్వహించిన పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సామాన్యులు సైతం కలలు కనే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చని నాడే సర్వాయి పాపన్న నిరూపించారని భట్టి విక్రమార్క కొనియాడారు. ‘కొడితే గోల్కొండ కోటనే కొట్టాలి’ అనే లక్ష్యంతో చిన్నచిన్న కోటలను గెలుచుకుంటూ ముందుకు సాగిన గొప్ప ధీరుడని, ఆయన ఆత్మగౌరవ పోరాటం మనందరికీ నిత్య స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా బహుజనులు, దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని, ఇటీవలే నెక్లెస్ రోడ్‌లో సావిత్రీబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలను కూడా ఆవిష్కరించుకున్నామని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలోని పేద, బలహీనవర్గాలు ఎవరి దగ్గరా ‘దేహీ అని అనకుండా స్వశక్తితో తల ఎత్తుకుని బతికేలా ఆర్థికంగా నిలబెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అందులో భాగంగానే ఒక్కో ఇంటికి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కోటి 6 లక్షల కుటుంబాలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేపడుతున్నట్లు వివరించారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నామని, కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ధీమానిచ్చేలా రూ.5 లక్షల పరిహారంతో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, ఫూలే, సర్వాయి పాపన్న వంటి మహనీయుల ఆలోచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నామని, బహుజనుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *