ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15న, ఈ విద్యా సంవత్సరం నుంచి ₹2,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ముందుగానే నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే విద్యార్థులకు మొత్తం అందేలా వ్యవస్థ రూపొందిస్తామని, ఇప్పటికే ₹250 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇది అమలైతే తెలంగాణ ఉన్నత విద్యా రంగంలో గణనీయమైన విధాన మార్పు అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు–ప్రైవేటు కళాశాలలు–ప్రభుత్వం మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు ప్రత్యక్ష నగదు బదిలీ ఒక పరిష్కారం కావొచ్చు. ఫీజు చెల్లింపులలో ఆలస్యం కారణంగా పాఠశాలలు మరియు కళాశాలలు తుది డిగ్రీలను లేదా ఉత్తీర్ణత ధృవపత్రాలను నిలిపివేయకుండా నివారించడానికి ఈ విధానం దోహదపడుతుందనడంలో సందేహం లేదు. అయితే విద్యార్థి ఖాతాలో డబ్బు పడిన తర్వాత అది కళాశాలకు చేరే విధానం, ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ, కళాశాలలు అదనపు మొత్తాలు వసూలు చేయకుండా పర్యవేక్షణ, పాత బకాయిల పరిష్కారం వంటి అంశాలు స్పష్టంగా ఉండాలి. ఈ కారణంగానే ప్రకటనకంటే అమలు విధానం కీలకం.
“ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థి హక్కుగా మారాలి…ప్రభుత్వ దయగా కాదు” అన్న రీతిలో దీనికి చట్టబద్ధత కల్పిస్తే అది ప్రశంసనీయమైన మరియు సానుకూలమైన పరిణామమే కాగలదు. నిజానికి ఇది చాలా అవసరం కూడా. ఇప్పటివరకు ప్రాథమిక విద్య మాత్రమే ప్రాథమిక హక్కుగా ఉంది. ఉన్నత విద్యను కూడా విద్యార్థుల హక్కుగా మార్చడం ద్వారా, పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా కాలేజీ చదువులకు దూరం కాకుండా ప్రభుత్వం భరోసా ఇచ్చినట్లవుతుంది. ఆర్థిక స్థోమత లేని దళిత, గిరిజన, వెనుకబడిన మరియు అల్పసంఖ్యాక వర్గాల విద్యార్థులకు ఇది పెద్ద అండగా నిలుస్తుంది.ధనవంతులతో సమానంగా పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ విద్యాసంస్థల్లో నచ్చిన కోర్సులు చదివే అవకాశం లభిస్తుంది.ఫీజు బకాయిల పేరుతో మేనేజ్‌మెంట్లు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపడం చట్టవిరుద్ధం అవుతుంది.ఫీజులు సకాలంలో విడుదలవుతాయనే నమ్మకం విద్యార్థులలో, వారి తల్లిదండ్రులలో మానసిక ప్రశాంతతను పెంచుతుంది.
నిజానికి వివిధ రాజకీయ పార్టీలు సంక్షేమం పేరుతో విచ్చలవిడిగా ఉచితాలు ప్రకటించి రాష్ట్ర ఖజానాను దివాలా తీయిస్తున్నాయి. వీటివల్ల వోట్లు పడతాయేమో కాని, రాష్ట్రం మాత్రం అభివృద్ధి చెందదు. అదే విద్యపై ఖర్చు చేసే ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. భావితరాలకు ఉత్తమ విద్య అందడమే కాకుండా, దేశాభివృద్ధిలో వారు కీలకపాత్ర పోషించగలుగుతారు. అందువల్ల ఫీజు రీయింబర్స్ మెంట్‌ను విద్యారంగంపై పెట్టే పెట్టుబడిగానే ప్రభుత్వం పరిగణించాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ హక్కుగా మారినప్పుడు ప్రభుత్వం కొన్ని కీలక సవాళ్లను ఎదుర్కోక తప్పదు. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కచ్చితంగా కేటాయించాల్సి వొస్తున్నది .నిధుల కొరత వల్ల చెల్లింపులు ఆలస్యమైతే, కాలేజీల నిర్వహణ కష్టంగా మారుతుంది.
అటువంటప్పుడు ఉత్పత్తికి ఎంత మాత్రం దోహదం చేయని కొన్ని సంక్షేమాలను రద్దు చేసైనా సరే రీయింబర్స్ మెంట్‌కు ప్రాధాన్యత నివ్వడం రాష్ట్రహితం కోసం అత్యవసరం కూడా! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చట్టబద్ధమైన హక్కుగా మార్చడంతోపాటు, ఇది దుర్వినియోగం కాకుండా కేవలం అర్హులైన వారికే అందేలా పారదర్శకమైన నిబంధనలు అమలు చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి విద్యార్థి దరఖాస్తు, మంజూరు, చెల్లింపు స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గత బకాయిలపై ప్రత్యేక కాలపరిమితి ప్రకటించి ఆ ప్రకారం చెల్లింపులు జరపాలి. చెల్లింపులు జరుపుతున్నది కనుక ఫీజుల విషయంలో ప్రైవేటు కళాశాలలపై ప్రభుత్వ నియంత్రణ అప్రకటితంగా పెరుగుతుంది. ఇది ప్రైవేటు కళాశాలల విచ్చలవిడితనాన్ని అడ్డుకోవడానికి మంచి అస్త్రంగా పనిచేస్తుంది.
2026-27 విద్యాసంవత్సరం నుండి కొత్త విద్యార్థులకు అడ్వాన్స్/డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం అమలవుతుండటం ప్రభుత్వం తీసుకున్న మరో సానుకూల చర్య. ప్రభుత్వం నుంచి విద్యార్థి బ్యాంక్ ఖాతాలో ఫీజు రీఇంబర్స్‌మెంట్ డబ్బులు పడిన 7 పని దినాల లోపు ఆ మొత్తాన్ని కాలేజీ యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం డబ్బులు వేసినా విద్యార్థి కాలేజీకి ఫీజు కట్టకపోతే, వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం 30 రోజుల్లోనే నిధులు విడుదల చేయడంవల్ల కళాశాలల నిర్వహణ గాడిన పడుతుంది.
అంతవరకు బాగానే వుంది. అయితే ఫీజు వసూలు చేసుకునే బాధ్యత కాలేజీలదే! ఇక్కడే తిరకాసుంది. ఒకవేళ విద్యార్థి తన ఖాతాలో పడిన ఫీజు మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకున్నా, నిర్దేశిత ఏడు రోజుల్లోగా కళాశాలకు చెల్లించకపోయినా ఇబ్బందులు తప్పవు. ఫీజు కట్టని విద్యార్థుల సర్టిఫికెట్లను ఇప్పుడు ఆపడానికి వీల్లేదు. అందువల్ల రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సి వొస్తే కాలేజీలు కోర్టులు మరియు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వొస్తుంది . ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీలు, బ్యాంకులు మరియు ఈ-పాస్ పోర్టల్‌ను అనుసంధానం చేస్తూ ఒక పటిష్టమైన ఆటోమేటిక్ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని ప్రైవేట్ యాజమాన్యాలు కోరడం సమంజసమే!.





