రేపు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం

– జూలై 4న 13 రాష్ట్రాల సమాహారంగా అమెరికా ఏర్పాటు

వాషింగ్టన్‌,‌ జూలై 3: అగ్రరాజ్యం అమెరికా జూలై4న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటోంది. అమెరికాకు 1776లో స్వాతంత్య్రం లభించింది. మరి అంతకుముందు అది ఒకే దేశంగా ఉండేది కాదు!  బ్రిటిష్‌ ‌పాలనలోని 13 వలస రాజ్యాల సమాహారంగా ఉన్న ప్రాంతం తదుపరి ప్రత్యేక దేశంగా, అమెరికాగా అవతరించింది.  ’ప్రాతినిధ్యం లేనిదే పన్ను లేదు’ అనే నినాదంతో ఈ రాజ్యాలన్నీ బ్రిటిష్‌ ‌పాలనకు ఎదురు తిరిగాయి. చివరకు 1776 జులై 4న పదమూడు వలస రాజ్యాలు స్వాతంత్య్రం ప్రకటించుకొని.. అన్నీ కలిసి అమెరికాగా అవతరించాయి. అమెరికాలో ప్రస్తుతమున్న రాష్టాల్ర సంఖ్య 50. కానీ స్వాతంత్య్రం  వచ్చేనాటికి అట్లాంటిక్‌ ‌తీరంలోని 13 రాష్ట్రాలు  మాత్రమే అందులో భాగంగా ఉండేవి. అనేక కొనుగోళ్లు, యుద్దాలు, ఒప్పందాలతో మిగతా రాష్ట్రాలను వాషింగ్టన్‌ ‌దక్కించుకుంది. 1803లో ఫ్రాన్స్ ‌నుంచి లూసియానాను కొనుగోలు చేసింది. దాంతో దేశ భూభాగం దాదాపు రెట్టింపైంది. 1819లో స్పెయిన్‌ ‌నుంచి ప్లోరిడా దక్కింది. టెక్సాస్‌ ‌తొలుత స్వతంత్ర దేశంగా ఏర్పడి.. 1845లో అమెరికాలో విలీనమైంది. మెక్సికోతో యుద్ధం తర్వాత అమెరికాలో కాలిఫోర్నియా, ఆరిజోనా, నెవాడా, ఉటా చేరాయి. 1867లో రష్యా నుంచి అలాస్కాను కొనుగోలు చేశారు. 1959లో హవాయి 50వ రాష్ట్రంగా మారింది. భౌగోళిక విస్తరణ‌తో అమెరికా ఆర్థిక, సైనిక శక్తికి పునాది అయింది. దేశానికి విస్తారమైన వ్యవసాయ భూములు, ఖనిజ సంపదతో పాటు రెండు మహాసముద్రాలపై ఆధిపత్యాన్ని కట్టబెట్టింది. అమెరికా 1861-65 మధ్య అంతర్యుద్ధంతో అతలాకుతలమైంది. బానిసత్వమే అందుకు ప్రధాన కారణం. దక్షిణ రాష్ట్రాల వ్యవసాయం ఆఫ్రికన్‌ ‌బానిసల శ్రమపై ఆధారపడగా.. ఉత్తర రాష్ట్రాలు పారిశ్రామికీకరణ వైపు వెళ్లి బానిసత్వాన్ని వ్యతిరేకించాయి. ఈ విభేదాలు దేశాన్ని రెండు శిబిరాలుగా చీల్చాయి. అబ్రహాం లింకన్‌ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో 11 దక్షిణ రాష్ట్రాల విడిపోయి ప్రత్యేక సమాఖ్యను ఏర్పాటుచేశాయి. అంతర్యుద్ధంలో ఆరు లక్షల మందికిపైగా మరణించారు. 1863లో లింకన్‌ ‌బానిసల విముక్తి ప్రకటన జారీ చేయడంతో అంతర్యుద్ధం.. స్వేచ్ఛ కోసం పోరాటంగా మారింది. ఉత్తర రాష్ట్రాల విజయంతో బానిసత్వం రద్దయింది. అయితే జాతి వివక్ష వెంటనే అంతరించిపోలేదు. సమాన హక్కుల కోసం నల్లజాతీయులు మరో శతాబ్దం పాటు పోరాడాల్సి వచ్చింది. అయినప్పటికీ అంతర్యుద్ధమే అమెరికాను శాశ్వతంగా ఏకీకృత దేశంగా నిలబెట్టిందని చెప్పొచ్చు. అందుకే చరిత్రకారులు దీనిని అమెరికా రెండో జననంగా పిలుస్తారు. ఇలా దేశం విస్తరించడానికి అప్పటి నాయకుల కృషి ఎనలేనిది. ఇప్పుడు ట్రంప్‌ ‌కూడా రాజ్య విస్తరణ కాంక్షను వదులుకోవడం లేదు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *