– ప్యాకింగ్ ఆధునిక యంత్రాల కోసం రూ.5 కోట్లు అవసరం
– తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ జనరల్ మేనేజర్
– ‘ప్రజాతంత్ర’ కు స్పందన
ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 3 : పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ ఆధునిక యంత్రాల కోసం రూ.5 కోట్లు అవసరం ఉంది.. డెయిరీ భవనం కూడా శిథిలావస్థలో ఉంది.. వీటి ఆధునికీకరణకి డెయిరీలో ప్యాకింగ్ తాత్కాలికంగా నిలుపుదల చేసి హైదరాబాద్ లోని మెగా డెయిరీ నుండి పాలు, పాల ఉత్పత్తుల సరఫరా, పంపిణీదారులతో సరైన చర్యలు చేపట్టినట్టు హైదరాబాద్ లాలాపేట్ జనరల్ మేనేజర్ (పి అండ్ ఐ) ఒక ప్రకటనలోతెలిపారు. ‘ఖమ్మం విజయ పాల డెయిరీకి ఇడుపు కాయితం’ శీర్షికతో ‘ప్రజాతంత్ర’లో శుక్రవారం ప్రత్యేక కథనం వెలువరించిన విషయం విదితమే. దీనిపై రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య తరపున ఆయన వివరణ ఇచ్చారు. 50 ఏళ్ళ పైబడి ఖమ్మం డెయిరీలో నడుస్తున్న పాల శుద్ధికరణ, ప్యాకింగ్ పరికరాల వలన, ఆశించిన నాణ్యతతో వినియోగదారులకు పాలప్యాకెట్లు అందించే పరిస్థితి కొరవడింది. ఈ పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తో సమావేశం జరిగింది. జిల్లా యంత్రాంగం సహకారంతో డెయిరీకి నీటి సరఫరా అందడమే కాక నిరుపయోగంగా ఉన్న దుకాణాల సముదాయం అందుబాటులోకి వచ్చింది. జూలై 1న స్థానిక ఖమ్మం డెయిరీ ఉపసంచాలకులు ఇక్కడ పరికరాల దయనీయ స్థితి గురించి వివరంగా తెలియ చేస్తూ మరమ్మతులు చేపట్టాల్సిన ఆవశ్యకత తెలియజేశారు. ఖమ్మం డెయిరీ నుండి ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా అవుతున్న విజయ పాల నాణ్యతపై తరచూ ఫిర్యాదులు అందడమేకాక నానాటికి పెరుగుతున్న జనాభా అవసరాలు, ప్రైవేటు డెయిరీల నుండి పోటీ తట్టుకోవాలంటే, నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు అందచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిస్థితుల్లోతాత్కాలికంగా ఖమ్మం డెయిరీలో పాల శుద్ధీకరణ, ప్యాకింగ్ నిలిపివేసి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా, నిరంతరాయంగా పాలసేకరణ కొనసాగేలా చర్యలు చేపట్టామన్నారు. ఖమ్మం డెయిరీని పూర్తి స్థాయిలో త్వరితగతిన ఆధునికీకరించి ప్రజలకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందజేస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల విజయ తెలంగాణ పాలు, పాల ఉత్పత్తులు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో సరఫరా అవ్వడానికి మార్గం సుగమం కావడమే కాక పాల విక్రయాలు, పాల వినియోగం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో చాలామంది ఔత్సాహికులు విజయ డెయిరీ స్టాళ్లు స్థాపించుకున్నా అరకొర ఉత్పత్తుల లభ్యత వారిని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అంతేగాని డెయిరీ భూములు లక్ష్యంగా పాడి రైతులు ప్రయోజనాలు దెబ్బతీయడం కాదని, విజయ కార్యకలాపాలు పరిమితం చేయడం కాదని తెలియజేశారు. ఖమ్మం డెయిరీకి చెందిన భూములు ప్రభుత్వ ఆస్తి కావున వాటిని ఆక్రమించే అధికారం ఎవరికీ లేదని ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో బ్యాంకుల ద్వారా పాడి రైతులకు రుణాలు ఇప్పించి, వారికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి, వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు అందజేయాలనే సదుద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





