– కొత్త బ్లాకుల అభివృద్ధి, గనుల్లో భద్రతే లక్ష్యంగా కసరత్తు
– కేటర్పిల్లర్, కొమాట్సు సందర్శించిన డిప్యూటీ సీఎం, సింగరేణి అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సింగరేణి, జిమ్కో(జేఎంఎంకో లిమిటెడ్) సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ బృందం టెక్సాస్, అరిజోనా రాష్ట్రాల్లో ఉన్న ప్రఖ్యాత మైనింగ్ యంత్రాల తయారీ కేంద్రాలను గురువారం సందర్శించింది. అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సింగరేణికి తీసుకురావడం, తద్వారా గనుల్లో భద్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ పర్యటనకు శ్రీకారం చుట్టాయి. ముందుగా అరిజోనా రాష్ట్రం టక్సన్‌లోని కేటర్పిల్లర్ డెమాన్‌స్ట్రేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్‌ను ఉప ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. అక్కడ స్వయంచాలిత(అటానమస్), రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే భారీ మైనింగ్ యంత్రాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించింది. ఓసీల్లో ఉపయోగించే భారీ యంత్రాల విడిభాగాలు, ఆపరేటర్ల శిక్షణ విధానాలు, భద్రతా వ్యవస్థల పనితీరు గురించి సాంకేతిక నిపుణులతో అధికారులు లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో మనుషులు నేరుగా పనిచేసే విధానం తగ్గించేందుకు ఉపయోగపడే ‘టెలి-రిమోట్ ఆపరేషన్ టెక్నాలజీ’పై ప్రతినిధి బృందం ప్రత్యేక దృష్టి సారించింది. అనంతరం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ సమీపంలోని లాంగ్‌వ్యూలో ఉన్న కొమాట్సు మైనింగ్ కార్పొరేషన్ ఫెసిలిటీని కూడా బృందం సందర్శించింది. అక్కడ భారీ మైనింగ్ యంత్రాల తయారీ, అసెంబ్లింగ్ ప్రక్రియలను పరిశీలించింది. సింగరేణిలో యంత్రాల నిర్వహణ ఖర్చులు, డౌన్ టైమ్ తగ్గించడమే లక్ష్యంగా భవిష్యత్తులో సాంకేతిక సహకారం, విడిభాగాల లభ్యత, పరికరాల సరఫరా ఒప్పందాల తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆధునిక, స్వయంచాలిత యంత్రాలను వాడటం ద్వారా ఓపెన్‌కాస్ట్ గనుల్లో కార్మికుల భద్రతను గణనీయంగా పెంచడంతోపాటు ప్రమాదాల రేటును భారీగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
భవిష్యత్తులో సర్వీస్ యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశం
ప్రపంచస్థాయి తయారీదారులతో నేరుగా చర్చలు జరపడం వల్ల యంత్రాల కొనుగోలులో మెరుగైన నిబంధనలు, వేగవంతమైన సర్వీసు, స్థానికంగా నిర్వహణ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలు మెరుగుపడతాయి. సాంకేతిక బదిలీ ఒప్పందాల ద్వారా భవిష్యత్తులో తెలంగాణలోనే సర్వీస్ యూనిట్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీనిద్వారా సింగరేణి సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ లభించడంతోపాటు సంస్థ నిర్దేశించుకున్న దీర్ఘకాలిక కోల్-టు-క్లీన్-ఎనర్జీ పరివర్తన లక్ష్యాలతో అనుసంధానం అయ్యేలా ఈ పర్యటన దోహదపడుతుంది. సింగరేణి సంస్థ ఇటీవల కొత్తగా రెండు భారీ బొగ్గు బ్లాకులను దక్కించుకున్న నేపథ్యంలో అమెరికా పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తాడిచెర్ల ఓసీ-2 బ్లాక్ నామినేషన్ పద్ధతిలో సింగరేణికి కేటాయించగా మణుగూరు పరిధిలోని ‘పీకేఓసీ-2 డిప్-సైడ్’ బ్లాక్‌ను వేలం ద్వారా దక్కించుకుంది. తాడిచెర్ల బ్లాక్‌లో సుమారు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు, 40-50 ఏళ్ల జీవిత కాలం ఉండగా పీకేఓసీ-2 బ్లాక్‌లో 180 మిలియన్ టన్నుల నిల్వలు, 25 ఏళ్ల జీవిత కాలం ఉంది. సింగరేణి నిర్దేశించుకున్న వార్షిక వంద మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి ఈ బ్లాకులు కీలకం కానున్నాయి. ఫలితంగా రాబోయే రోజుల్లో ఈ భారీ ఓసీ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున షావెల్స్, డంపర్లు, డ్రాగ్ లైన్లు, డ్రిల్లింగ్ సిస్టమ్స్ వంటి భారీ యంత్రాల అవసరం ఏర్పడనుంది. కేటర్పిల్లర్, కొమాట్సు వంటి అంతర్జాతీయ సంస్థల టెక్నాలజీని ముందుగానే అంచనా వేయడం ద్వారా కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి ముందే యంత్రాల కొనుగోలు, ఫ్లీట్ విస్తరణ, ఆటోమేషన్ ప్రణాళికలను సింగరేణి సిద్ధం చేసుకోగలుగుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కార్యక్రమంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణ భాస్కర్, క్యాటర్‌పిల్లర్ ఇండియా ప్రతినిధి ఆర్కే మిశ్రా, డెన్నిస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





