ఎఫ్‌టీఈల సమస్యల పరిష్కారానికి సానుకూలం

– పే స్కేల్ అంశంపై సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చిస్తా
– గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : జీ రామ్ జీ చట్టం ద్వారా రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపినప్పటికీ ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగుల(ఎఫ్‌టీఈ) దశాబ్దకాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. హైదరాబాద్ బి.ఆర్.కే.ఆర్ భవన్‌లో ఉపాధి హామీ ఎఫ్‌టీఈ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో మంత్రి సీతక్క గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పే స్కేల్ అమలు, కేడర్ స్ట్రెంగ్త్ ఖరారు, బదిలీల విధానం, ఇతర సర్వీస్ అంశాలను జేఏసీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. 2006లో డీఎస్సీ ద్వారా ఎంపికై దాదాపు రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నప్పటికీ ఇప్పటికీ పే స్కేల్ అమలు కాలేదని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇది కేవలం జీతాల సమస్య కాదని, తమ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. మొత్తం 3,800 మంది పనిచేస్తున్నామని, తమకు పేస్కేల్ అమలు చేస్తే నెలకు రూ.2.5 కోట్ల చొప్పున అదనపు భారం పడుతుందని తెలిపారు. రాబోయే నాలుగు నుంచి అయిదేళ్లల్లో పలువురు ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నందున ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం కూడా క్రమంగా తగ్గుతుందని వివరించారు. ఉద్యోగుల సమస్యలపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందిస్తూ పే స్కేల్ అంశాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిల దృష్టికి తీసుకెళ్లి చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే మరోసారి ఉద్యోగ సంఘాలతో సమావేశమై తదుపరి చర్యలపై చర్చిస్తామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే పే స్కేల్ అమలుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని అంచనా వేసిందని, అది ఏడాదికి రూ.30 కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఉద్యోగులు తొందరపాటు చర్యలకు దిగొద్దని, ప్రభుత్వం సమస్య పరిష్కారానికి సానుకూలంగా ఉన్నందున ఆందోళన అవసరం లేదని మంత్రి సూచించారు. జపాన్ తరహాలో ఎక్కువ పని చేసి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించే మార్గాలు కూడా ఉన్నాయని, పని నిలిపివేయడం కంటే బాధ్యతాయుతమైన పద్ధతుల్లో సమస్యలను పరిష్కరించుకోవడం మంచిదని సూచించారు. ఎఫ్‌టీఈ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఉపాధి హామీ ఉద్యోగుల జీతాలు

కేంద్ర ప్రభుత్వ వాటా చెల్లించనందున మూడు నెలలుగా జీతాలు నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా జీతాలు చెల్లించి అనంతరం కేంద్రం నుంచి ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేసుకునే ప్రతిపాదన చేసినప్పటికీ కేంద్రం అంగీకరించలేదని మంత్రి తెలిపారు. ఈ కారణంగానే జీతాలలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, సమావేశం జరుగుతుండగానే సీఎం కార్యాలయాన్ని సంప్రదించి ఈ అంశంపై ఆయ‌న‌తో చర్చించేందుకు సమయం కోరినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. వీలైనంత త్వరగా పే స్కేల్ అమలుకు కృషి చేస్తామని హామీ ఇవ్వగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని కోరిన కూలీలందరికీ పని కల్పించేందుకు అదనపు సమయాన్ని వెచ్చించడానికి కూడా సిద్ధమని అన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, ఎఫ్‌టిఈ జేఏసీ సభ్యులు ఎలబద్రి లింగయ్య, ఎ.అంజిరెడ్డి, ఎం.విజయ్ కుమార్, ఈ. వెంకట్రామిరెడ్డి, ఎం.మోహన్ రావు, ఇతర నేతలు పాల్గొన్నారు.

జయశంకర్ జయంతి వేడుకలు  

బీఆర్‌కే భవన్‌లోని ‘సెర్ప్‌’ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జరిగాయి. మంత్రి సీతక్క జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ‘సెర్ప’ సీఈవో దివ్యా దేవరాజన్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *