చట్టబద్ధతతోనే దత్తత ప్రక్రియ

– అక్రమ దత్తతకు వీలు లేదు
– హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో బాలల సంరక్షణ కేంద్రాలు, సంక్షేమం, పునరావాసానికి సంబంధించిన వ్యవస్థల పనితీరుకు వివరాలపై హైకోర్టు బుధవారం ఆరా తీసింది. అక్రమ దత్తతకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా చట్టబద్ధ దత్తత ప్రక్రియ తప్పనిసరని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రెండు మాసాల నుంచి మూడేళ్ల వయసున్న చిన్నారులు అక్రమ దత్తతకు గురైనట్లు ఆరోపణలతో నమోదైన ఎఫఐఆర్‌లలో అసలైన తల్లిదండ్రులను గుర్తించడంలో పోలీసుల వైఫల్యాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరణ వంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో వారంలోగా నివేదికను దాఖలు చేయాలని హోం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 2023లో దత్తత తీసుకున్న ఓ చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకుని స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ నల్గొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం.వెంకన్న దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన దత్తతను అనుమతించలేమంటూ సింగిల్ జడ్జి పిటిషన్‌ను కొట్టివేయడంతో వెంకన్న ఈ అప్పీల్ చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌తోపాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రుతి ఓజా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేందిర బోయిలు వర్చువల్‌గా హాజరై స‌మాధానాలిచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నివేదిక సమర్పించేందుకు సీనియర్ న్యాయవాది బి.మయూర్‌రెడ్డిని అమికస్ క్యూరీగా హైకోర్టు నియమిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *