– కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో రైతు వికాసం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన చార్జిషీట్‌పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుల వినాశనం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రైతు వికాసం దిశగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. రైతుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ నాయకులకు సంక్షేమంపై మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. హామీ ఇచ్చిన విధంగానే రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తూ 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.20,616.89 కోట్లు జమ చేశామని మంత్రి తెలిపారు. సాంకేతిక లోపాలున్న ఖాతాలను కూడా సరిచేసి మరో రూ.2,747.67 కోట్లు రుణ మాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.36,000 కోట్ల రైతుభరోసా నిధులను అందించిందని, ఇటీవలే కేవలం తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో స్థూల సాగుభూమి 5 శాతం పెరిగి 220.77 లక్షల ఎకరాలకు చేరిందని, ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగనుందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయని పంటలను సైతం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుందని, రూ.6,000 కోట్లతో మొక్కజొన్న, రూ.2,000 కోట్లతో జొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ విజయవంతమవ్వడంతో దాన్ని ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ‘ఫెర్టిలైజర్ ఫెయిర్ సేల్ (ఎఫ్ఎఫ్ఎస్) యాప్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ముందుగా తమ పదేళ్ల రైతు వ్యతిరేక పాలనపై ప్రజలు వేసిన చార్జ్‌షీట్‌కు సమాధానం చెప్పాలన్నారు. గతంలో యూరియా కోసం క్యూలలో నిలబెట్టి, వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేసి రైతులపై వేల కోట్ల వడ్డీ భారం మోపిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని ఎద్దేవా చేశారు. నిలిచిపోయిన 19 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించి రూ.917.30 కోట్లు మంజూరు చేయించామని, ఆయిల్‌పామ్ సాగులో 58.5 శాతం వృద్ధి సాధించామని మంత్రి తుమ్మల వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





