– ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత మాది
– కొబ్బరి కాయ కొట్టి చేతులు దులుపుకున్న బీఆర్ ఎస్ సర్కార్
– మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి
– మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి:
– స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్ 3 : పాత బస్తీ ప్రాంతం వెనుకబడిన ఓల్డ్ సిటీ కాదని, ఇది నగరానికి గుండెకాయ లాంటి ‘ఒరిజినల్ సిటీ’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. చంచల్‌గూడ – సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధికి ముఖ్యంగా ఈ ప్రాంత పురోగతికి ప్రజా ప్రభుత్వం పూర్తి నిధులను కేటాయిస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్‌కు కేవలం కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుందని, నిర్మాణానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిధులు ఇచ్చి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతీ గల్లీ తనకు తెలుసన్నారు. అసదుద్దీన్ అడిగిన ప్రతీ అభివృద్ధి పనులను మంజూరు చేయాలని ఈ వేదికగా అధికారులను ఆదేశిస్తున్నాఆపరేషన్ సిందూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ హిందుస్థాన్ కు మద్దతుగా నిలిచి దేశభక్తి చాటుకున్నారని తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు వేరు కావచ్చు.. దేశ భక్తి విషయంలో అందరం ఒక్కటేనని స్పష్ఠం చేశారు.
విద్యాభివృద్ధికి రూ.25 కోట్లు
ఎంఐఎం ఎమ్మెల్యే బలాల కళాశాల అభివృద్ధి కోసం ₹20 కోట్లు అడిగితే తమ ప్రభుత్వం ₹25 కోట్లు మంజూరు చేస్తోందని ప్రకటించారు. ఏడాదిన్నర కాలంలో ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేపైనే ఉందన్నారు. విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మీరాలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి
నగరంలో దుర్గం చెరువు తరహాలోనే మీరాలం చెరువుపై కూడా 3 కిలోమీటర్ల మేర అధునాతన కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.
మెట్రో రైలు విస్తరణ
వచ్చే ఎన్నికల నాటికి గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులను పూర్తి చేసి, మెట్రోలోనే వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను విస్తరించబోతున్నామని చెప్పారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
మూసీ నదిని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని ప్రోత్సహించడం ద్వారా ఇక్కడి పేద ముస్లింలకు, స్థానికులకు ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ అభివృద్ధి పనులను బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
మత సామరస్యం, సమాజ వికాసం
హిందూ, ముస్లింలు కలిసికట్టుగా నడిస్తేనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. దేశభక్తి విషయంలో అందరూ ఒక్కటేనని, ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ దేశానికి మద్దతుగా నిలిచి తన దేశభక్తిని చాటుకున్నారని గుర్తుచేశారు. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు ఉండాలని, ఎన్నికలు ముగిసిన తర్వాత అందరం కలిసికట్టుగా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





