హన్మకొండ, ప్రజాతంత్ర సెప్టెంబర్ 3: భీమారం ఎస్సార్ హైస్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలు (Sri Krishnashtami celebrations ) గురువారం ఘనంగా జరిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. పలువురు చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేయగా పాఠశాల ప్రాంగణం బృందావనాన్ని తలపించింది. చిన్నారులు ఉత్సాహంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణులు, గోపికల వేషధారణలో చేసిన నృత్య ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అమితంగా ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు పాల ఉట్టిని కొట్టేందుకు ఉత్సాహంగా పోటీపడ్డారు.
ఈ సందర్భంగా ఎస్ఆర్ పాఠశాలల జోనల్ ఇన్చార్జ్ రాజేశ్వర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సంజయ్ గాంధీ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుని జీవితాన్ని ప్రతిబింబించే ధర్మం, ప్రేమ, స్నేహం, సత్యం వంటి విలువలను విద్యార్థులకు చిన్నప్పటినుండే తెలియజేసేందుకు ఈ వేడుకలు తమ పాఠశాలల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. చిన్న వయసు నుంచే విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతపై అవగాహన కల్పించడం ద్వారా వారిలో నైతిక విలువలు పెరుగుతాయని వారు అన్నారు. చిన్నారుల నృత్యాలు, వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు సందడిగా సాగాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.





