అధికంగా తీసుకున్న‌ ఫీజులు వాపస్ చేయాలి

– బీజేపీ అధ్యక్షుడికి ‘నీట్‌’ విద్యార్థుల తల్లిదండ్రుల వినతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : ఎంబీబీఎస్ నాలుగున్నరేళ్ల అకాడమిక్ కోర్సుకు మాత్రమే ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని టీఏఎఫ్ఆర్‌సీ, ఎన్ఎంసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కొన్ని కాలేజీలు ఇంటర్న్‌షిప్ కూడా కలుపుకుని పూర్తి ఐదేళ్లకు ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయని నీట్, ఎంబీబీఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో విద్యార్థుల సమస్యలపై వారి తల్లిదండ్రుల ప్రతినిధి బృందం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుని కలిసి వినతిపత్రం సమర్పించింది. విద్యార్థులను తరగతులకు అనుమతించకపోవడం, బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనివ్వకపోవడం, పరీక్షల హాల్ టికెట్లు నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని తెలిపారు. కొన్ని కళాశాలలు విద్యార్థులకు చెల్లించాల్సిన స్టైఫండ్‌ను నిలిపివేయడం లేదా చెల్లించిన స్టైఫండ్‌ను తిరిగి తీసుకుంటున్నాయని కూడా ఫిర్యాదు చేశారు. అధికంగా వసూలు చేసిన ఫీజులను తక్షణమే తిరిగి చెల్లించాలని, నిబంధనల ప్రకారం విద్యార్థులకు స్టైఫండ్ అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతినిధి బృందం కోరింది. దీనిపై రామచందర్ రావు స్పందిస్తూ బాధిత విద్యార్థులకు బీజేపీ అండగా నిలుస్తుందని, వారి సమస్యలను బలంగా ప్రస్తావిస్తుందని హామీ ఇచ్చారు. టీఏఎఫ్ఆర్‌సీ, ఎన్ఎంసీ ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేసి బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *