ఈ పాపం ఈనాటిది కాదు

– ఉమ్మడి రాష్ట్రం నుంచే 22-ఎ సమస్య

– బీఆర్ఎస్ పాలకులు పరిష్కరించి ఉంటే ఈ సమస్య రాకపోను
– ఆన్ లైన్‌లో అప్‌లోడ్ చేసే సమయంలో పొరపాటు
– తప్పును సరిదిద్దాం
-మేం కొత్త‌గా ఏమీ చేర్చ‌లేదు
– రిజిస్ట్రేషన్‌ల ఆదాయం తగ్గిందనడం అవాస్తవం
– శాసనసభలో చర్చ.. మంత్రి పొంగులేటి సమాధానం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : 22-ఏ అనేది ఈ రోజు పుట్టింది కాదు.. 2007 నుండి ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిందని, అదే వ్యవస్థను బీఆ ర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ధరణి వచ్చిన తరువాత తయారు చేసిన 22-ఏ జాబితానే హైకోర్టు ఆదేశాల మేరకు 2025 డిసెంబర్ 3న ఆన్ లైన్‌లో అప్ లోడ్ చేసే సమయంలో పొరపాటు జరిగిందని, అయితే దాన్ని సరిదిద్దామని చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉన్నవాళ్ళు పరిష్కరించి ఉంటే ఈ రోజు ఈ సమస్య వచ్చి ఉండేది కాదన్నారు. శాసనసభలో 22-ఎపై శనివారం జరిగిన చర్చలో మంత్రి ప్రతిపక్షాలకు దీటుగా కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను వీడియో క్లిప్పింగ్‌లో చూపించి ప్రతీ అంశానికి ఆధారాలతో సమాధానం ఇచ్చారు. 22-ఏలో పెట్టి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని చేసిన ఆరోపణలపై రిజిస్ట్రేషన్ జరిగిన తేదీలను చదివి వినిపించారు. అలాగే, గత ప్రభుత్వంలో 22-ఏలో భూమికి జీహెచఎంసీ, హెఎండీఏ, డీటీసీపీ లే అఔట్‌లకు ఇచ్చిన అనుమతులకు సంబంధించి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉదాహరణలు ఇచ్చారు. 22-ఏ వల్ల గత మÖడు నెలల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందనే ప్రచారానికి గత ఏడాదికి ఈ ఏడాదికి ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.1,359 కోట్ల పెరిగిందని నెలల వారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలను సభ ముందుంచారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను వీడియోలు, ఇతర అధికారిక సమాచారంతో తిప్పికొట్టారు. సమగ్ర సమాచారాన్ని సభ ముందుంచారు. సీఎస్-7, సీఎస్-14లపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ, మాజీ మంత్రి హరీష్ రావు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారంటూ వాటిని వీడియోలో వివరిస్తూ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించాలని వాళ్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే హరీష్ రావు మాత్రం ఈ సమస్యను వక్రీకరిస్తున్నారని, ఈ ప్రభుత్వమే 22-ఏలో పెట్టిందని చేశారని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలకు 2013 నుంచి 22-ఏలో ఉన్నాయని ఆధారాలతో గెజిట్ నోటిఫికేషన్‌ను చూపించారు.
కాలనీల పేర్లు
హైదర్‌నగర్, శంషీగుడ గ్రామాలలోని భూములను నిషేధిత ఆస్తుల జాబితాలో కొత్తగా చేర్చారంటూ వచ్చిన కథనాలు, ఆరోపణలపై వాస్తవాలను వివరించారు. హైదర్‌నగర్ సర్వే నెం.145 (220.18 ఎకరాలు), సీబీసీఐడి, వసంతనగర్, భగత్‌సింగ్ నగర్, పటేల్ నగర్ మొదలైన కాలనీలు ఉన్న ఈ భూమి సీఎస్ 14 పరిధిలోకి వస్తుంది.. ఇవి పాత రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ/పైగా భూములు. సుప్రీంకోర్టులో సివిల్ అప్పీల్ నెం.1867/2023 పెండింగ్‌లో ఉన్నందున 2013 నుండి పీవోబీ జాబితాలోనే ఉన్నాయి. హైదర్‌నగర్ – సర్వే నెం.163 (175.06 ఎకరాలు) దుర్గామాత సొసైటీ, డ్రీమ్ వ్యాలీ, రామ్ నరేష్ కాలనీలు ఉన్న ఈ భూములు కూడా సీఎస్ 14 కింద ప్రభుత్వ భూములే. ఈ సర్వే నంబరు 2013 నుండి ఆన్‌లైన్ 22-ఎ జాబితాలోనే కొనసాగుతోంది. హైదర్‌నగర్ సర్వే నెం.172 (196.20 ఎకరాలు) త్రివేణి, శ్రీనివాస్, సిటిజన్ కాలనీ, జయ నగర్, బృందావన్ ఎస్టేట్స్ ఉన్న ఈ భూమి కూడా సీఎస్ 14 పరిధిలోనిదే. ప్రభుత్వ ప్రయోజనాలు, భూముల పరిరక్షణార్థం పాత 22-ఎ రిజిస్టర్ ప్రకారమే జాబితాలో కొనసాగుతోంది. శంషీగూడ సర్వే నెం.57 (274.33 ఎకరాలు) జన్మభూమి కాలనీ, ఇందిరా హిల్స్, వివేకానంద నగర్ ఉన్న ఈ భూమి సీఎస్ 7 పరిధిలోకి వస్తుంది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్‌పీ కేసులు పెండింగ్‌లో ఉన్నందున 2013 నుండి ఈ సర్వే నంబరు పీవోబీ జాబితాలోనే ఉంది. కూకట్‌పల్లి మండలం పరిధిలో ఏ ఒక్క పట్టా భూమిని కూడా 22-ఎ నిషేధిత జాబితాలో కొత్తగా చేర్చలేదు. రికార్డుల నవీకరణలో భాగంగా పాత ఆంక్షలను మాత్రమే ఆన్‌లైన్ 22-ఎ యాక్టివ్ లిస్ట్‌లో పునరుద్ధరించారు తప్ప కొత్తగా ఎలాంటి మార్పులు చేయలేదు.
22-ఏపై వాస్తవాలు
2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికి వివిధ రకాల భూములు కలుపుకుని 22ఏలో 1,02,52,690 ఎకరాలు ఉండగా ఈ ఏడాది ఆగష్టు 31 నాటికి 1,02,05,250 ఎకరాలు ఉంది. అంటే 47,440 ఎకరాలు తగ్గింది. వాస్తవం ఇలా ఉంటే 22-ఏలో లక్ష కోట్ల ఎకరాలు చేర్చారంటటూ విషప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి ప్రజలను అనవసరమైన ఆందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 40 వేల ఇంటి స్థలాలు 22-ఎలో చేర్చామనడం నిజం కాదన్నారు. ఇక్కడ సమస్య 40 వేల ఎకరాలు కాదని, 40 వేల ఇంటి స్థలాలు మాత్రమేనని తెలిపారు.  హైకోర్టు ఆదేశాల మేరకు 2025 డిసెంబర్‌లో జరిగిన డేటా అప్‌డేషన్ సమయంలో ఇంటి నంబర్‌తోపాటు లబ్దిదారుడి పేరును కూడా రికార్డులో చేర్చడం వల్ల సాంకేతిక సమస్య తలెత్తిందని వివరించారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలు తమ దృష్టికి తీసుకురాగానే  తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించామన్నారు. భువనగిరి పట్టణ పరిధిలో ఉన్న ఐదు రెవెన్యూ గ్రామాల్లో సుమారు 113 ఎకరాల వ్యవసాయేతర భూమిని 1980నుంచి పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఈ భూముల్లో దాదాపు 3,390 ఇంటి స్థలాలను ప్రజలకు కేటాయించినట్లు తెలిపారు. ఉదాహరణకు సర్వే నం.1025/1/2లో 7 ఎకరాలు, 1026/యూయూలో 5 ఎకరాలు, 1031లో 5 ఎకరాలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో 2007లో 22-ఎ నిషేధిత జాబితా అమల్లోకి వచ్చినప్పటి నుంచే ఈ సర్వే నంబర్లు ఆ జాబితాలో ఉన్నాయి. అంటే ఇవి ఇప్పుడు కొత్తగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములు కావని మంత్రి పొంగులేటి వివరించారు.
సింఫనీ కాలనీ- రిజిస్ట్రేషన్లే వాస్తవానికి నిదర్శనం
పటాన్‌చెరు పరిధిలోని సింఫనీ కాలనీ హోమ్స్ భూములను మొత్తం 22-ఏలో చేర్చారని ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చేసిన ఆరోపణలపై స్పష్టత ఇచ్చారు. 2000-01లో సర్వే నం.354 నుంచి 400 వరకు ఉన్న 55 ఎకరాల పట్టా భూముల్లో సింఫనీ కాలనీ ఏర్పడింది. ఇందులో సుమారు 850 ఇళ్లు ఉన్నాయి. అయితే సర్వే నంబర్లు 373, 386లో బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ కోసం సేకరించిన 4.15 ఎకరాల భూములు మాత్రమే 22-ఏ జాబితాలో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. మిగిలిన సర్వే నంబర్లలోని కాలనీ భూములు 22-ఏ నిషేధిత జాబితాలో లేవని స్పష్టం చేశారు. కాలనీలో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయని చేసిన ఆరోపణకు కూడా రిజిస్ట్రేషన్ గణాంకాలే సమాధానమని, 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం 21 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగస్టు 30న సింఫనీ కాలనీలో పర్యటించగా, అంతకు కేవలం 19 రోజుల ముందు ఆగస్టు 7, 11 తేదీల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయని అన్నారు.
ఇస్నాపూర్‌లో 2,000 ఇళ్లను 22-ఏలో చేర్చారన్నది అవాస్తవం
ఇస్నాపూర్ గ్రామం 18వ వార్డు పరిధిలోని సర్వే నం.496లో 2,000 ఇళ్లను 22-ఏ జాబితాలో చేర్చారన్న హరీష్ రావు ఆరోపణలపై ఆ నెంబరులో మొత్తం 173.31 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 120 ఎకరాలను ఇందిరమ్మ ఇళ్ల కోసం 850 ప్లాట్లకు, మరో 38 ఎకరాలను స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించారు. కేటాయించిన భూమిలో 28 ఎకరాల అసైన్డ్ భూమిని ఎన్‌వోసీ లేకుండా పదేళ్ల లాకఇన్ నిబంధనను ఉల్లంఘించి కొందరు లబ్దిదారులు రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల్లో సూర్యవంశీ, మల్లికార్జున, పినాకిల్, నాగార్జున తదితర రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ఏర్పడ్డాయి. ఈ భూములు 2016 నుంచే 22-ఏ జాబితాలో కొనసాగుతున్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. సరూర్‌నగర్‌లో 379.32 ఎకరాల పట్టా భూములు 22-ఏలో లేవు సరూర్‌నగర్ గ్రామం, మండలం పరిధిలోని సర్వే నం.9/1 భూములన్నింటినీ 22-ఏలో చేర్చారన్న హరీష్ రావు ఆరోపణపైనా రికార్డుల ఆధారంగా వివరణ ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నం.9/1లో మొత్తం 540 ఎకరాల 32 గుంటల భూమి ప్రభుత్వ భూమిగా వర్గీకరించారు. ఇందులో నిజాం, ఇతరుల అభ్యర్థనల మేరకు 388.36 ఎకరాలు కేటాయించగా అందులో 9 ఎకరాల 04 గుంటలను అదనపు భూమిగా ప్రకటించి నిషేధిత జాబితాలో ఉంచారు. మిగిలిన 151.36 ఎకరాల ప్రభుత్వ భూమిని హెచఎండీఏ, ఆలిండియా రేడియో, పోలీస్ శాఖ, స్పోర్ట్స్ కౌన్సిల్, ఇళ్ల స్థలాలకు కేటాయించారు. కొంత భాగం ఎన్టీఆర్ నగర్ మురికివాడ ఆక్రమణలో ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. మరోవైపు టెలిఫోన్ కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీ, ఆర్కేపురం తదితర కాలనీలు ఉన్న 9/1/ఎ నుంచి 9/1/ఎల్ పరిధిలోని 379.32 ఎకరాల పట్టా భూములు 22-ఏలో లేవని స్పష్టం చేశారు. మార్చి నుంచి ఇప్పటివరకు 268 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. ఆగస్టులోనే 31 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు మరో 9 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రామదాస్‌పల్లి గ్రామంలోని సర్వే నం.41లోని మొత్తం 1,271.27 ఎకరాలను 22-ఏలో చేర్చారన్న ఆరోపణపై ఈ భూముల్లో 15.23 ఎకరాల సీలింగ్ భూమి, 83.29 ఎకరాల వెట్టి చాకిరి విముక్తులకు ఇచ్చిన భూమి, 7.25 ఎకరాల కోర్టు/ఆర్బిట్రేషన్ అటాచ్‌మెంట్ భూమి ఉన్నాయి. ఇవన్నీ కలిపి 106.37 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపింది. మిగిలిన 1,164.30 ఎకరాలు పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నట్లు తెలిపారు. ఈ భూములను 22-ఏ నుంచి తొలగించాలని 2026 ఆగస్టు 14న ఇబ్రహీంపట్నం ఆర్డీవోకు నివేదించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నాటికే సర్వే నంబర్ 41లో 127.17 ఎకరాలు 22-ఏలో ఉండగా ప్రస్తుతం కోర్టు వివాదాల భూములను మినహాయించి 106.37 ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉన్నాయని వివరించారు.

ఎలికట్టలో 25.15 ఎకరాల భూదాన్ భూమి.. 2007 నుంచే జాబితాలో

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని సర్వే నంబర్లు 191, 193లో 25 ఎకరాల 15 గుంటల పట్టా భూమిని బోయినపల్లి నర్సింహులు, బోయినపల్లి యాదగిరి భూదాన్ యజ్ఞబోర్డుకు దానం చేశారు. ఈ భూమిని 1993లో ఆరుగురు లబ్దిదారులకు కేటాయించగా వారు 2005లో ఇతరులకు విక్రయించినట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. అనంతరం 2021లో భూదాన్ దాతల పేర్లపై భూమి తిరిగి నమోదైంది. 2022లో ఈ భూమికి హెచఎండీఏ లేఅవుట్ అనుమతి ఇచ్చినప్పటికీ 2007 నుంచే ఈ భూమి నిషేధిత జాబితాలో కొనసాగుతున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఈ భూమిని 22-ఏలో చేర్చిన విషయం కాదని ప్రభుత్వం చెబుతోందన్నారు.

పిగ్లిపూర్‌లో 386 ఎకరాల్లో 189 ఎకరాలు మాత్రమే పరిమిత భూములు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పిగ్లిపూర్ గ్రామంలోని సర్వే నం.17లో మొత్తం 386 ఎకరాల భూమి ఉంది. ఇందులో 197 ఎకరాలు పట్టా భూమి కాగా, 189 ఎకరాలు సీలింగ్, భూదాన్ ల్యాండ్‌గా ఉన్నాయి. ఈ భూమి 2007లో 22-ఏ చట్టం వచ్చినప్పటి నుంచే నిషేధిత జాబితాలో కొనసాగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. సీలింగ్ జాబితాలోని 189 ఎకరాల్లో పిగ్లిపూర్‌కు సంబంధించిన 26 ఎకరాలకు 2023 మే 15న హెచఎండీఏ ఎంజీవై కన్‌స్ట్రక్షన్స్‌కు అనుమతి ఇచ్చినట్లు రికార్డులు పేర్కొంటున్నాయి. ఇక్కడ కూడా పాత భూ వర్గీకరణ, గతంలో అమల్లో ఉన్న ఆంక్షలే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కొల్లూరు-ఉస్మాన్‌సాగర్‌లో మాజీ సైనికుల అసైన్‌మెంట్ ఎన్‌వోసీ లేకపోవడంతో 22-ఏలో కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరు సర్వే నం. 191లో 143 ఎకరాలు, ఉస్మాన్‌సాగర్ సర్వే నం.30లో 93 ఎకరాల భూమిని 1972-73లో మాజీ సైనికులకు అసైన్‌మెంట్ చేశారు. అయితే సంబంధిత శాఖల నుంచి ఎన్‌వోసీ పొందకపోవడంతో ఈ భూములు 22-ఏ పరిధిలోనే కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఎసఎస్‌పీడీఎల్, బీహెచఈఎల్ ఎంప్లాsTÖస్ హౌసింగ్ సొసైటీ కలిసి 2022లో హెచ్‌ఎండీఏ నుంచి లేఅవుట్ అనుమతి పొందినప్పటికీ లేఅవుట్ అనుమతి ఇచ్చినంత మాత్రాన 22-ఏ నుంచి భూములు తొలగిపోలేదని అధికారులు వివరించారు.

కోర్టు ఆదేశాలు.. జీవో 121

హైకోర్టు ఆదేశాల మేరకు 2016లో జీవో 121 జారీ చేసి 2017లో మార్గదర్శకాలు రూపొందించారు. కానీ వాటిని ఆ నాటి ప్రభుత్వం అమలు చేయలేదు. 22-ఎకు సంబంధించి 2017 నుంచి 2025 వరకు హైకోర్టులో 28,611 కేసులు నమోదయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీల ప్రకారం 22-ఏ జాబితాను డిసెంబర్ 3, 2025న పబ్లిక్ డొమైన్‌లో ఉంచాం. ధరణికి ముందు నుంచే భూ రికార్డుల్లో అనేక తప్పులు, వైరుధ్యాలు, అసంపూర్ణ సమాచారం వారసత్వంగా వచ్చింది. దీని మూలంగా డేటాను అప్‌లోడ్ చేసే క్రమంలో కొన్ని పొరపాట్లు జరిగినా వాటిని ప్రభుత్వం దాచిపెట్టలేదు. తప్పును అంగీకరించి బాధ్యతగా సరిదిద్దామన్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో సమస్య పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు.

కాల్ సెంటర్‌కు తగ్గుతున్న ఫిర్యాదులు

ఆగష్టు 18న కాల్ సెంటర్ ప్రారంభించిన రోజు 117 కాల్స్ రాగా 19న 198, 20న 189, 21న 369, 22న 304, 24న 317, ఆగష్టు 24 తర్వాత కాల్స్ సంఖ్య క్రమంగా తగ్గుతూ సెప్టెంబర్ 7వ తేదీ నాటికి 56కు తగ్గినది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *